Suryaa.co.in

Andhra Pradesh

విద్యార్థుల ఆరోగ్య భద్రతతో పాటు భవిష్యత్తు ఆలోచిస్తాం

-తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
-రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్

రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు పొడిగింపు ఆలోచన లేదని ప్రకటించిన విధంగా యధావిధిగా పాఠశాలలు నడుస్తాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్య భద్రత తో పాటు భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తుందని ఆయన చెప్పారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేశామని, 15 నుంచి 18 సంవత్సరాల వయసు విద్యార్థులకు కూడా దాదాపు 92 శాతం వ్యాక్సిన్ వేయడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పాఠశాలలను యధావిధిగా నడపాలని ఆలోచిస్తూనే వారి ఆరోగ్య భద్రత పై కూడా డేగ కన్నుతో నిఘా ఉంచడం జరిగిందన్నారు. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ పాఠశాలలను నడిపేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు. ఇప్పటికైతే పాఠశాలలకు సెలవులు ప్రకటించే ఆలోచన లేదని భవిష్యత్తులో కేసుల తీవ్రతను బట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు ఆలోచిస్తామని ఆయన చెప్పారు.

LEAVE A RESPONSE