నెల్లూరు జిల్లా, కావలి సమీపంలో ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన వ్యక్తులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించాలని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ బాబు పోలీసులను కోరారు. చల్లపల్లిలో సురేష్ బాబు మాట్లాడుతూ ఆర్టీసీ డ్రైవర్ పై దాడి అమానుషమైన చర్య అని అన్నారు. ఈ ఘటన రాష్ట్రంలో ఉద్యోగుల భద్రతను మరియు పోలీసులు, చట్టాలు పట్ల వ్యక్తులకు భయంలేని తనాన్ని ప్రశ్నించేలా ఉందన్నారు. ఇలాంటి సంఘటనలను పోలీసులు తీవ్రంగా పరిగణించి దాడి చేసిన వ్యక్తుల పట్ల బహిరంగంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించాలని కోరారు.
చట్టాలు ,పోలీసులు పట్ల భయం లేకుంటే సమాజంలో ఇలాంటి సంఘటనలు మరిన్ని జరిగే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో ఉద్యోగుల భద్రతకు ప్రత్యేక చట్టాలను రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు. సంఘటన జరుగుతున్న సందర్భంలో బస్సులో ప్రయాణికులు,ఆ ప్రదేశంలో ఉన్న వ్యక్తులు ఒక్కరు కూడా దాడిని అడ్డుకోకపోవడం ,నిరోధించే ప్రయత్నం చేయకపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి దానిని ప్రధానమంత్రి ,ముఖ్యమంత్రి చూసుకుంటారులే మనకెందుకు అనేలా, సామాజిక బాధ్యత లేకుండా ప్రజలు వ్యవహరించడం సరికాదన్నారు. ఇలాంటి సంఘటన లను ప్రతి ఒక్కరూ ఖండించాలని సురేష్ బాబు కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా నేత మేడేపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.