Suryaa.co.in

Andhra Pradesh

ముచ్చటగా మూడో పెళ్లి

-ఇంటింటికి వెళ్లి.. ఆహ్వానాలు అందించి..
-సందడిగా విందు, వినోదం..
-శుభ లేఖలు పంచి.. దగ్గరుండి మూడవ పెళ్లి జరిపించిన మొదటి భార్య – రెండో భార్య
(వెంకట్)

అల్లూరి జిల్లా ఏజెన్సీ లోని పెదబయలు మండలం గుల్లెలు పంచాయితీ కించూరు గ్రామం. అక్కడ సాగేని పండన్న.. పార్వతమ్మ ను తొలుత వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు అప్పలమ్మను కూడా మొదటి భార్య అంగీకారంతో పెళ్లాడాడు.. అలా ఇద్దరు భార్యలతో పండన్న సంసార జీవితం సాఫీగానే సాగిపోతుంది. ఏనాడు ఎటువంటి కుటుంబ కలహాలు లేకుండా ఆ ఇద్దరు భార్యలు భర్తను చక్కగా చూసుకుంటున్నారు.

అయితే.. అప్పటికే ఇద్దరు భార్యలు ఉన్న పండన్న.. లక్ష్మీ అనే మరో యువతిపై మనసు పారేసుకున్నాడు. ఆమెది జి మాడుగుల మండలం కిల్లంకోట పంచాయతీ బందవీధి గ్రామం. లక్ష్మీని ఇష్టపడ్డ విషయం.. తనను ఎంతగా ప్రేమించే ఇద్దరు భార్యలకు చెప్పాడు. దీంతో తన భర్త ఆనందంలో తమ ఆనందం చూసుకునే ఆ ఇద్దరు భార్యలు పండన్నను ప్రోత్సహించారు.

దీంతో, ఇక పండన్న వెనక్కి తగ్గలేదు. ఎలాగైనా ఆమెను వివాహం చేసుకొని తమ జీవితం లోకి ఆహ్వానించాలని అనుకున్నాడు. అంతే.. ఆ ఇద్దరు భార్యలతో రాయభారం పంపాడు. పెద్దలు కూడా అంగీకరించడంతో.. లక్ష్మీని పండన్నకు ఇచ్చి వివాహం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక.. ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు.

పండన్నకు తల్లిదండ్రులు లేరు.. దీంతో, ఇద్దరు భార్యలే అతనికి సర్వస్వం. వాళ్లు కూడా అదే స్థాయిలో పండన్నను ప్రాణానికి మించి చూసుకుంటున్నారు. ఇక పెళ్లి పెద్దలు కూడా వాళ్ళిద్దరే అయ్యారు. శుభ లేఖల్లో కూడా.. ఆ ఇద్దరు భార్యలే అందరిని ఆహ్వానిస్తున్నట్టు ముద్రించారు. ఇంటింటికి వెళ్లి శుభ లేఖలను పంచారు. బంధు మిత్రులను ఆహ్వానించారు. ‘మీ రాకను ప్రేమతో ఆహ్వానిస్తూ.. నిండు మనసుతో ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించ ప్రార్థన.. అంటూ ఆ ఇద్దరు భార్యలు సాగేని పార్వతమ్మ, సాగేని అప్పలమ్మ..’ అంటూ శుభ లేఖను ముద్రించి ముగించారు.

జూన్ 25 ఉదయం 10 గంటలకు కించూరులో వివాహం జరిగింది. నవ వధువు లక్ష్మీ తరపు బంధువులు, మూడో పెళ్లి చేసుకుంటున్న పండన్న బంధు మిత్రులు, గ్రామ పెద్దలు కూడా వివాహానికి హాజరయ్యారు. అదే స్థాయిలో విందు కూడా ఏర్పాటు చేశారు. అందరూ కలిసి గ్రాండ్‌గా పండన్న లక్ష్మీల వివాహాన్ని జరిపించారు. సంసారం సుఖ సంతోషాలతో సాగి పోవాలని ఆశీర్వదించారు.

LEAVE A RESPONSE