– కార్పొరేట్ శక్తులకు మాత్రమే అనుకూలం
– ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు
అమలాపురం: గత కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి సమకూర్చిపెట్టిన ఆస్తులను అమ్ముకోవడమే పనిగా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పాలన చేస్తోందని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ అంశాలపై ఆయన స్పందిస్తూ… దేశాన్ని అభివృద్ధి పధంలో అప్పజెప్పిన యూపీఏ ప్రభుత్వంలో నాటి ప్రధాని, ఆర్థివేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్, యూపీ మాజీ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ నాయకత్వంలో 2004-2014 మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పేదలను మధ్యతరగతి వర్గాల స్థాయికి తీసుకెళ్లిందని గుర్తుచేశారు.
యూపీఏ ప్రభుత్వం 27 కోట్ల మంది పేదలను మధ్యతరగతి స్థాయికి చేర్చరని గుర్తుచేశారు. గడచిన 7ఏళ్ల భాజపా ప్రభుత్వంలో 23కోట్ల మంది మధ్యతరగతి ప్రజలు పేదరికం స్థాయికి దిగజారారని ఈ ఘనత బీజేపికే దక్కుతుందని పేర్కొన్నారు. దేశానికి వెన్నుముకగా ఉన్న సన్న, చిన్నకారు రైతులు, వారికి కావాల్సిన యూరియా, ఫెర్టిలైజర్, ఇతర వ్యవసాయ పరికరాలు ధరలను పెంచడం శోచనీయం అన్నారు. ప్రధానంగా యువతకు సంబంధించి ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ప్రకటిస్తామని ప్రగల్భాలు పలికిన ప్రధాని మోదీ 7-8ఏళ్ల కాలంలో కోట్లాది మందిని నిరుద్యోగులు మార్చారని ఆరోపించారు.
స్వాతంత్ర్యం వచ్చాక గడచిన 50 ఏళ్ల కాలంలో ఇంతటి నిరుద్యోగ సమస్య ఎప్పుడూ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్ కబంధహస్తాల్లోకి వెళుతున్న పరిస్థితి నెలకొందన్నారు. దేశంలో ఉన్న 5శాతం మంది పెట్టుబడిదారులు, బడా పారిశ్రామికవేత్తలు దేశంలోని 67 శాతం ఆర్థిక వనరులను వారి ఆదీనంలోకి తీసుకున్నారని తెలిపారు. ప్రైవేటీకరణ పేరుతో విశాఖ ఉక్కులాంటి వందలాది కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవైటుపరం చేస్తూ కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ లక్షలాది కుటుంబాలు జీవనోపాధిని దెబ్బతీశారని ఫలితంగా దేశంలో నిరుద్యోగం రేటు గతంలో ఎన్నడూ లేని స్థాయికి చేరిందన్నారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఇచ్చిన పౌరుల హక్కులకు భంగం వాటిల్లే విధంగా పెగాసిస్ లాంటి సాఫ్ట్‌వేర్‌తో ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని, చట్టసభల్లోని పెద్దలను సుప్రీంకోర్టు న్యాయాధికారులను ఎగ్జిక్యూటీవ్ అధికారుల గోప్యతను అంతర్గత విషయాలను సేకరిస్తున్న తీరు శోచనీయం అన్నారు. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే అప్పటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన ఏపీ రీ-ఆర్గనేషన్ యాక్టు 2014 ప్రకారం పోలవరానికి సంబంధించిన నిధులుగాని, రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులుగాని ఆంధ్రప్రదేశ్‌కి ఇవ్వాల్సిన మౌలిక సదుపాయాల కల్పనలోగాని బీజేపీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపించిందన్నారు.
ముసలికారు కన్నీరు కారుస్తున్న భారతీయ జనతా పార్టీని 2024 ఎన్నికల్లో ఓడించి రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధిని కాపాడే కాంగ్రెస్ పార్టీకి సహకరించాలని గిడుగు రుద్రరాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.