– సచివాలయం ప్రధాన గేటు వద్ద దిశ పెట్రోలింగ్ వాహనాలను లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించిన సీఎం వైయస్.జగన్
ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే….: ఈ రోజు దేవుడి దయతో ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దిశ డౌన్‌లోడ్స్… ఈ రోజు రాష్ట్రంలో రికార్డు సంఖ్యలో 1 కోటి 16 లక్షల మంది అక్కచెల్లెమ్మల చేతిలో దిశ యాప్ ఉంది. దాదాపుగా 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల్లో అంటే దాదాపు ప్రతి గ్రామంలో ఒక మహిళా పోలీస్ కూడా పనిచేస్తుంది. వీటన్నింటితో ఒక గొప్ప విప్లవానికి, ఒక మార్పుకు శ్రీకారం చుడుతున్నాం.
ఎక్కడైనా ఒక అక్కచెల్లెమ్మ మీద ఏదైనా అన్యాయం జరిగితే మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ప్రభుత్వం ఊరుకోదు అన్న సంకేతం పంపిస్తున్నాం. ఒక్క సామాన్య అక్కచెల్లెమ్మలే కాదు.. పోలీసు వృత్తిలో ఉన్న అక్కచెల్లెమ్మలకూ మంచి చేసే దిశగా అడుగులు పడ్డాయి. ప్రతి చెల్లెమ్మకు తెలుసు… ఇంతకుముందు పోలీస్ స్టేషన్‌లలో అక్కచెల్లెమ్మలకు ప్రత్యేకంగా రెస్ట్‌రూమ్ ఉండేది కాదు.
ఈ రోజు ప్రతి పోలీస్ స్టేషన్‌లోనూ మహిళలకు ప్రత్యేకంగా వాష్‌రూమ్‌లు ఉండటంతో పాటు బందోబస్తుకు వెళ్లినప్పుడు కూడా అక్కచెల్లెమ్మలకు ఎటువంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశ్యంతో ఈ రోజు ప్రత్యేకంగా వాష్‌రూమ్స్, డ్రెస్సింగ్ రూములు ఉండే విధంగా… 18 కార్ వాన్స్‌ను కూడా ప్రారంభిస్తున్నాం. మొత్తం 30
కార్‌వాన్స్ ప్రారంభించే కార్యక్రమంలో భాగంగా ఇవాళ 18 వచ్చాయి, వాటిని ప్రారంభిస్తున్నాం. మరో 12 రాబోయే రోజుల్లో వస్తాయి. ఈ రోజు కార్‌వాన్స్‌తో పాటు 163 దిశ పోలీస్ ఫోర్‌వీల్ వాహనాలను కూడా ప్రారంభిస్తున్నాం.
ఇప్పటికే 900 దిశ ద్విచక్రవాహనాలు వివిధ పోలీస్ స్టేషన్లలో అందుబాటులో ఉన్నాయి. వాటికి అదనంగా 163 పోర్‌వీలర్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నాం. ఇవి కాక ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఉన్న.. ప్రతి వాహనాన్ని అంటే దాదాపు మూడువేల వాహనాలను జీపీఎస్ ట్యాగింగ్ చేసి, దిశకు అనుసంధానం చేసి వాటన్నింటినీ కూడా అందుబాటులోకి తెచ్చాం. ఏదైనా ఆపదలో ఉన్న అక్కచెల్లెమ్మ తన ఫోన్‌ను ఐదుసార్లు అటూ, ఇటూ ఊపితే చాలు.. 10 నిమిషాలలోనే ఆ అక్కచెల్లెమ్మ దగ్గరకు మన పోలీస్ సోదరుడు వెళ్లి.. చెల్లెమ్మా నేను నీకు తోడుగా ఉన్నాను.
ఏమిటి నీ సమస్య అని అడిగే గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టాం. ఆ రెస్పాన్స్ టైం.. 10 నిమిషాలు. అంటే సంఘటన జరిగిన 10 నిమిషాలలోపే కచ్చితంగా అక్కడకు రావాలి అని గట్టిగా నేను చెప్పాను. డీఐజీ పాలరాజు, డీజీపీ రాజేంధ్రనాథ్ రెడ్డి, మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ విషయంలో బాగా కృషి చేశారు. అందరూ కలిసికట్టుగా ఆ రెస్పాన్స్ టైంను ఇంకా కుదించి.. ఇంకా వీలైనంత త్వరగా 10 నిమిషాలలోపే అందుబాటులో ఉండే పరిస్థితి రావాలి అనే ఉద్ధేశ్యంతో ఈ వాహనాలను ప్రారంభిస్తున్నాం.
దిశకు సంబంధించి డీజీపీ రాజేంద్రనాద్‌రెడ్డి, డీఐజీ పాలరాజకు మరొక్కసారి హామీ ఇస్తున్నా… దిశ యాప్ కోసం, పనితీరును మెరుగుపర్చేందుకు ప్రభుత్వం తరపునుంచి ఎటువంటి సహకారం కావాలన్నా కూడా అన్నిరకాలుగా ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నాం. ఈ రోజు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు దీనివల్ల మంచి జరగాలని మనసారా కోరుకుంటూ.. ఇంకా ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేసే అవకాశం కూడా దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ.. జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నానని సీఎం వైయస్.జగన్ తన ప్రసంగం ముగించారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్ కె మోషేన్ రాజు, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, డీఐజీ పాలరాజు, దిశ స్పెషల్ ఆఫీసర్ కృతికా శుక్లా, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.