Suryaa.co.in

Telangana

ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్యనే

– బ్యాంకు లోనే అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతన్న ఆత్మహత్యకు ప్రభుత్వానిదే బాధ్యత
-పంట ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఉన్న తెలంగాణ ఈరోజు ఆత్మహత్యల్లో అగ్రస్థానంలో నిలుస్తున్నది
-పెరుగుతున్న రైతు ఆత్మహత్యలకి కాంగ్రెస్ రైతులకు చేసిన మోసమే కారణం
-ఆత్మహత్యలు వద్దంటూ తెలంగాణ రైతన్నలకు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విజ్ఞప్తి

హైదరాబాద్: కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ చేయకపోవడంతో ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సైదుపూర్‌కు చెందిన జాదవ్ దేవరావ్ అనే రైతు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం అని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన పేరిట రుణం ఉన్న బ్యాంకులోనే పురుగుల మందు తాగి ఆ రైతు బలన్మరణానికి పాల్పడ్డాడంటే, ఆ రుణభారం అతన్ని ఎంత మానసిక వేదనకు గురిచేసిందో అర్థమవుతోంది.

ఆ అన్నదాత నిండు జీవితం బలికావడానికి రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ పేరిట చేసిన మహామోసంతోపాటు రైతు వ్యతిరేక విధానాలే ప్రధాన కారణమన్నారు. పదేళ్లపాటు రాజుగా బతికిన రైతన్న ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో అవస్థల పాలైతూ, ఆరిగోశ పడుతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అన్నదాతలను పట్టించుకోవడం లేదన్నారు. అప్పులు తీరక అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నా కనికరం లేని కాంగ్రెస్ సర్కారులో ఏమాత్రం చలనం లేదు.

అధికారంలోకి రాగానే రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి మాట తప్పడం, రైతు భరోసా ఎత్తకొట్టడం వల్లే దేవరావ్ అనే రైతు అన్యాయంగా బలయ్యారన్నారు.

ఇది ఆత్మహత్య కానే కాదు… ముమ్మాటికీ రేవంత్ సర్కారు చేసిన హత్యగానే తెలంగాణ రైతాంగం భావిస్తుందన్నారు. దేవరావ్ మరణానికి కారణమైన ఈ ప్రభుత్వంపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలన్నారు. రైతు కుటుంబానికి కనీసం ₹20 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించి, ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఇప్పటికైనా రుణమాఫీ కాక దిక్కుతోచని స్థితిలో ఉన్న లక్షలాది మంది రైతుల అప్పులను వెంటనే మాఫీ చేసి, ప్రభుత్వం వారిని రుణవిముక్తులను చేయాలని, ఇలాంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు.

పదేళ్లపాటు తెలంగాణలో గుండెలపై చేయి వేసుకుని హాయిగా బతికిన రైతుల జీవితాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పూర్తిగా అధికారం అలుముకుందన్న కేటీఆర్, ఒకప్పుడు సాగులో, పంట దిగుబడిలో నెంబర్ వన్‌గా ఉన్న తెలంగాణ, ఇప్పుడు అన్నదాతల ఆత్మహత్యల్లో దేశంలోనే నంబర్ వన్‌గా ఉండటం కాంగ్రెస్ సర్కారు చేతకానితనానికి నిలువెత్తు నిదర్శనమన్నారు.

అన్నదాతలారా, దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు అంటూ కేటీఆర్ రైతన్నలకు విజ్ఞప్తి చేశారు. నమ్మించి మోసం చేసిన ఈ నయవంచక కాంగ్రెస్ సర్కారును నిలదీద్దాం, హామీలు అమలయ్యే దాకా కొట్లాడి ముఖ్యమంత్రి మెడలు వంచుదాం తప్ప మీ ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదన్నారు.

LEAVE A RESPONSE