– రేవంత్ రూపొందించిన వ్యక్తిగత ప్రతీకార నాటకం
– ఆయనే దీనికి దర్శకుడు, నిర్మాత, నటుడు కేటీఆర్ వ్యక్తిత్వ హననం చేయాలనే ఉద్దేశం
– రేవంత్ రెడ్డి ప్రతీకార రాజకీయ దాడి ఫార్ములా-ఈ కేసు
హైదరాబాద్: ఫార్ములా-ఈ కేసు పూర్తిగా కల్పితం, కక్ష సాధింపు రాజకీయ ఎత్తుగడగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూపొందించిన “వ్యక్తిగత ప్రతీకార నాటకం”గా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. శ్రవణ్ దాసోజు అభివర్ణించారు. ఇది కేటీఆర్ వ్యక్తిత్వహననం చేయాలనే ఉద్దేశంతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమని ఆయన మండిపడ్డారు. ఈ కేసు చట్టపరమైన స్థిరత్వం, వాస్తవ ఆధారాలు, సాక్ష్యాలు లేని పక్కా కుట్రగా ఆయన అభివర్ణించారు.“ఇది చట్టం కాదు. ఇది న్యాయం కాదు. ఇది రేవంత్ రెడ్డి రాసిన ప్రతీకార స్క్రిప్ట్. ఆయనే దీనికి దర్శకుడు, నిర్మాత, నటుడు” అని వ్యాఖ్యానించారు.
బ్రాండ్ హైదరాబాద్‌ను నిర్మించి, తెలంగాణను ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దిన నాయకుడిపై దాడి చేయడానికి ప్రజాస్వామ్య సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఫార్ములా-ఈ తెలంగాణకు పెట్టుబడులు, ఉపాధి, ఈవీ ఇన్నోవేషన్‌ను తీసుకురావాలనే ఉద్దేశంతో నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ద్వారా అంతర్జాతీయ ఈవీ పెట్టుబడులు, భారీ యువత ఉపాధి, అర్బన్ మొబిలిటీ అభివృద్ధి, హైదరాబాద్ గ్లోబల్ బ్రాండింగ్ సాధ్యమయ్యాయని గుర్తుచేశారు. కానీ ప్రపంచం మెచ్చిన ఈ ఈవెంట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు స్కాండల్‌గా మార్చడం తెలంగాణ ప్రజల గౌరవంపై దాడి చేయడమే అని అన్నారు.
“ప్రపంచ స్థాయి ఈవెంట్‌ను రేవంత్ రెడ్డి గల్లీ స్థాయి రాజకీయాలుగా మార్చారు. ఇది హైదరాబాద్‌కు, యువతకు, తెలంగాణ ఆశయాలకు అవమానం” అని విమర్శించారు. ప్రజల దృష్టిని ప్రభుత్వ వైఫల్యాల నుండి మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులను ఆయుధంగా మార్చుతోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలైన పరిపాలనా పతనం, నిర్లక్ష్య రుణభారం, పెరుగుతున్న అప్పులు, వాగ్దానాల ఉల్లంఘన, కూలిపోతున్న పాలన నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఈ డ్రామా చేస్తున్నారని తెలిపారు.
“పరిపాలన పట్టులేని లేని ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు సృష్టిస్తుంది. దృష్టి లేని నాయకుడు వ్యక్తిత్వ హత్య చేస్తాడు” అని వ్యాఖ్యానించారు. కేటీఆర్ పారదర్శకత, దూరదృష్టి, అంకితభావంతో పనిచేశారని, హైదరాబాద్‌ను గ్లోబల్ డెస్టినేషన్‌గా మార్చినందుకే ఆయనను లక్ష్యంగా చేసుకుంటున్నారని పేర్కొన్నారు. కేటీఆర్ కృషిని ఎలాంటి కుట్రలు తుడిచిపెట్టలేవని స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని, ఈ కల్పిత కేసు కోర్టుల్లో నిలబడదని తెలిపారు. “తెలంగాణ ప్రజలు స్క్రిప్ట్ చేసిన అబద్ధాలను నమ్మరు.సత్యమే గెలుస్తుంది” అని అన్నారు.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని గుర్తుచేస్తూ, తెలంగాణ సత్యం, న్యాయం, స్వాభిమానం మీద నిర్మితమైందని, ద్వేషం, ప్రతీకారం మీద కాదని అన్నారు. తప్పుడు కేసులు పాలనకు ఆయుధాలైతే ప్రజాస్వామ్యం కూలిపోతుందని హెచ్చరిస్తూ, సత్యం, న్యాయం, గౌరవం కోసం తెలంగాణ ప్రజలు నిలబడాలని డా. శ్రవణ్ దాసోజు విజ్ఞప్తి చేశారు.