Suryaa.co.in

Telangana

ఇది రేవంత్ రెడ్డి చేయించిన దాడే

– ఎటు పోతోంది మన రాష్ట్రం?
– బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్: పట్టపగలే ఎమ్మెల్యేపై హత్యాయత్నామా? ఎటు పోతోంది మన రాష్ట్రం?ఫ్యాక్షన్, రౌడీ రాజకీయాలకు తెలంగాణను అడ్డాగా మార్చేస్తుంటే బాధేస్తోంది. కౌశిక్ రెడ్డిని గృహ నిర్భంధంలో ఉంచి అరికెపూడి గాంధీ గుండాలతో దాడి చేయిస్తారా? ఇందిరమ్మ రాజ్యమంటే ఎమ్మెల్యేకు కూడా రక్షణ లేకపోవటమేనా?

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై న్యాయపరంగా పోరాడుతున్నందునే కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఇది కచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించిన దాడే. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.ఇలాంటి ఉడుత ఊపుల దాడులకు బెదరం.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గుండాలు దాడి చేయటాన్ని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. పట్టపగలే ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి హత్యాయత్నానికి ప్రయత్నిస్తున్నారంటే రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డిని గృహ నిర్భంధంలో ఉంచి పోలీసుల సాయంతో అరికెపూడి గాంధీ గుండాలు రెచ్చిపోయి దాడులకు పాల్పడటమేమిటన్నారు.

రాష్ట్రాన్ని ఫ్యాక్షనిజం, రౌడీయిజానికి అడ్డాగా మార్చేస్తుండటం చూస్తుంటే బాధేస్తుందన్నారు. ఇది కచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించిన దాడేనని కేటీఆర్ మండిపడ్డారు. గత కొన్ని రోజులుగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై న్యాయపోరాటం చేస్తున్న కౌశిక్ రెడ్డిని ఈ ప్రభుత్వం టార్గెట్ చేసిందన్నారు.

కావాలనే తనపై అక్రమ కేసులు, హత్యాయత్నాలకు పాల్పడి బెదిరించే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఉడుత ఊపులకు బీఆర్ఎస్ బెదరదని కేటీఆర్ స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డిని చంపే కుట్ర చేస్తున్నారని ఆయనకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్తానన్న కౌశిక్ రెడ్డి ని గృహ నిర్భంధంలో ఉంచిన పోలీసులు…అరికెపూడి గాంధీని మాత్రం కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చేందుకు ఎలా అనుమతించారని కేటీఆర్ ప్రశ్నించారు. వందల మంది రౌడీలు కోడిగుడ్లు, రాళ్లతో దాడులు చేశారంటే పక్కా ముందస్తుగా ప్లాన్ చేసే ఈ దాడి చేశారని కేటీఆర్ అన్నారు.

పూర్తిగా ప్రభుత్వం, పోలీసుల సహకారంతో కౌశిక్ రెడ్డిపై దాడి చేసే ప్రయత్నం జరిగిందన్నారు. ఇలాంటి చిల్లర చేష్టలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని చూస్తుంటే జాలేస్తోందన్నారు.

అక్రమ కేసులు, దాడులతో బెదిరించాలని ప్రయత్నిస్తే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదన్నారు. ఇందిరమ్మ పాలన, ప్రజా పాలన అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేపై ప్రభుత్వమే దాడి చేయించటమా అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రశ్నిస్తే చాలు ప్రభుత్వం దాడులకు తెగబడుతోందన్నారు. కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలను కచ్చితంగా రాసి పెట్టుకుంటామని హెచ్చరించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని ఇంతకు మించి ప్రతిఘటన తప్పదని కేటీఆర్ స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE