స్పీకర్ నిర్ణయంపై బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆగ్రహం
హైదరాబాద్: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఈరోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ హత్య, ప్రజాస్వామ్య హత్య. పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన ఎమ్మెల్యేలపై తెలంగాణ శాసనసభ స్పీకర్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. రాజ్యాంగాన్ని కాపాడతామని పదే పదే చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ, ఈరోజు రాజ్యాంగ వ్యవస్థ అయిన స్పీకర్‌ను కూడా ప్రభావితం చేసి, రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకోకుండా చేసింది.
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీయే. అలాంటి పార్టీనే ఈరోజు ఆ చట్టానికీ, రాజ్యాంగానికీ గౌరవం ఇవ్వకుండా వ్యవహరిస్తోంది. చేతుల్లో రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని దేశమంతా తిరుగుతున్న నాయకులే, రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిన స్పీకర్‌పై ప్రభావం చూపి ఈ తరహా నిర్ణయం తీసుకునేలా చేశారు. స్పీకర్ పదవి స్వతంత్రంగా, రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన పదవి. ఈరోజు తీసుకున్న స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ హత్య. . ప్రజాస్వామ్య హత్య.