Suryaa.co.in

Andhra Pradesh

ఇది మంచి ప్రభుత్వం

  • పారదర్శకంగా… పక్షపాతరహితంగా… ప్రతిభ, సమర్థత, నిబంధనలే కొలమానంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో బదిలీలు
  • సిఫార్సులు… ఒత్తిళ్ళు… లంచాలకు తావు లేకుండా బదిలీలు
  • గ్రామ స్థాయి అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించిన లక్ష్యాలు అందుకొనే దిశగా అడుగులు
  • డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

కూటమి పాలన మొదలై 100 రోజులు దాటింది. ముందుగా శాఖాపరమైన అధ్యయనం చేసి ప్రజా ప్రయోజనం, అభివృద్ధే లక్ష్యంగా నేను చేపట్టిన శాఖల్లోని పథకాలను పకడ్బందీగా అమలుపరచాలని నిర్ణయించుకున్నాను. ఆ దిశగా చేపట్టిన శాఖలు, అందులోని విభాగాల అధికారులతో పలు దఫాలు సమావేశమయ్యాను. ఉద్యోగుల శక్తిసామర్థ్యాలను సద్వినియోగం చేసుకొంటూ వారికి నిర్దుష్ట లక్ష్యాలను నిర్దేశించాలని భావించాను.

గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసన సభ సమావేశాల్లో, మంత్రి మండలి సమావేశాల్లో ‘కూటమి ప్రభుత్వం ఆశ్రిత పక్షపాతం లేకుండా… ప్రజలకు మేలు చేసేలా పని చేస్తుంద’ స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా ఉద్యోగుల బదిలీల ప్రక్రియను పారదర్శకంగా, పక్షపాతరహితంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశాను. ప్రతిభా, సమర్థత, నిబంధనలు కొలమానాలుగా తీసుకోవాలని తెలిపాను.

ప్రజా ప్రతినిధులు, సహచర మంత్రుల నుంచి వచ్చిన సిఫార్సుల విషయంలో సైతం బదిలీలకు నిర్దేశించుకున్న కొలమానాలకు అనుగుణంగా ఉంటే పరిగణనలోకి తీసుకోవాలని సూచించాను. డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్లు, ఏపీడీలు, డి.పి.ఓ.లు, జిల్లా పరిషత్ సి.ఈ.ఓ.ల బదిలీల ప్రక్రియ మొదలయ్యే ముందే మా కార్యాలయం పూర్తి సమాచారం తీసుకుంది. కొందరు అధికారులు గత పాలకుల ప్రాపకం మూలంగానో, నాటి బదిలీల్లో సాగిన లావాదేవీల వల్లనో ఒకే ప్రాంతంలో కీలక పోస్టుల్లో అటూఇటూగా మారుతూ ఉన్నారు. ఆ ప్రాంతాలను తమ జాగీర్లుగా మార్చుకొనే స్థితికి చేరుకున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలతో సంబంధం లేని జైళ్ల శాఖ, ఖజానా శాఖ… ఇతర శాఖల నుంచి ఫారిన్ సర్వీస్ అనే నిబంధన ద్వారా వచ్చి జిల్లా పోస్టుల్లో పని చేస్తూ ఉన్నారు. అదే సమయంలో ప్రతిభ, సమర్థత, సమగ్రత ఉండి కూడా అప్రాధాన్యంగా మిగిలిపోయిన అధికారులు ఈ శాఖలో ఉన్నారు. వారికి కుల సమీకరణం కుదరకనో, రాజకీయ సమీకరణాల వల్లనో తగిన గుర్తింపు దక్కలేదు.

బదిలీ ప్రక్రియ మొదలుపెట్టగానే అప్పటికే సేకరించిన సమాచారం ఆధారంగా ఉన్నతాధికారులు కసరత్తు చేశారు. నిర్దేశించిన కొలమానాలకు అనుగుణంగా లేని పక్షంలో ఆ అధికారులను ఇతర స్థానాలకు పంపించారు. అదే విధంగా పి.ఆర్., ఆర్.డి. అధికారులకు మాత్రమే డ్వామా పి.డి., ఏపీడీ, జడ్పీ సి.ఈ.ఓ. పోస్టులు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నాము. అందువల్ల ఇతర శాఖల నుంచి ఈ శాఖలోకి రావాలనుకున్నవారిని, ఆ విధంగా వచ్చిన సిఫార్సులను పరిగణనలోకి తీసుకోలేదు. ఏ దశలోనూ బదిలీల విషయంలో ఆర్థిక లావాదేవీలకు తావు లేకుండా చూసుకున్నాము.

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఇంత పారదర్శకంగా, లంచాలకు ఆస్కారం లేకుండా ఇటీవలి సంవత్సరాల్లో బదిలీలు జరగలేదు… పకడ్బందీగా బదిలీలు చేశారు అని వార్తా కథనాలు, ఉద్యోగుల నుంచి స్పందన వచ్చింది. ఇది మంచి ప్రభుత్వం కాబట్టే చిత్తశుద్ధితో బదిలీలు పూర్తి చేశాము. మా కూటమికి ఆశ్రిత పక్షపాతం లేదు. ప్రజలకు మేలు చేయాలనే తలంపుతోనే నిర్ణయాలు తీసుకుంటాము. అందుకు కట్టుబడి ఉంటాము. సిఫార్సులు, సూచనలు చేసిన ప్రజా ప్రతినిధులు, మంత్రివర్గ సహచరులకు వారు కోరిన అధికారికి ఆ స్థానం ఎందుకు ఇవ్వలేకపోయామో వివరించాము.

అధికారులు, ఉద్యోగులకు సైతం ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా బదిలీలు చేశాము. రాయలసీమ ప్రాంతంలో ఒక అధికారి ఉద్యోగంలో చేరి రెండు దశాబ్దాలు దాటింది. అంత అనుభవం, శాఖాపరమైన అవగాహన ఉన్నా జిల్లా స్థాయి పోస్టులో ఉద్యోగం చేయలేదని మా ముందుకొచ్చిన నివేదిక ద్వారా గుర్తించాము. తగిన పోస్టింగ్ ఇచ్చాము. ఒక జిల్లా అధికారి పోస్టింగ్ విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాము. గతంలో నిర్వర్తించిన బాధ్యతల్లో చురుగ్గా, అప్పగించిన ప్రాజెక్టులు సక్రమంగా నిర్వర్తించినవారికి మరో జిల్లా అప్పగించాము. మా ముందు ఉన్న నివేదికలో ఆరోపణలు, ప్రతికూలమైన కామెంట్స్ వచ్చిన వారికి కీలక బాధ్యతలు ఇవ్వలేదు.

బదిలీల విషయంలో ఇంత కసరత్తు ఎందుకు చేశామంటే – గత పాలకులు పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను మళ్లించడం, నిధులను రాబట్టుకోలేకపోవడం లాంటి చర్యలతో గ్రామ సర్పంచులు సైతం ఏమీ చేయలేని స్థితికి వెళ్ళిపోయారు. కేంద్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల్ జీవన్ మిషన్ పథకం, అందుకు సంబంధించిన నిధులను సైతం గత పాలకులు సద్వినియోగపరచలేదు.

గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్రంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తగినన్ని నిధులు ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి మొదలు కావాలని స్పష్టమైన లక్ష్యాలు ఇచ్చారు. స్వర్ణ పంచాయతీలు కావాలని గ్రామ సభలు ఏర్పాటైన రోజున స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 100 రోజులలోపునే కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.4500 కోట్లు ఉపాధి హామీ నిధులను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పొందింది. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1987 కోట్లు వచ్చాయి. 2027నాటికి జల్ జీవన్ మిషన్ ద్వారా 95.44  లక్షల ఇళ్లకు కుళాయి ద్వారా రక్షిత నీరు నిరంతరాయంగా సరఫరా చేయాలనేది పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్. శాఖలకు ఉన్న లక్ష్యం. ఈ ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ వార్షిక ప్రణాళికకు మన రాష్ట్రనికిగాను రూ.215.8 కోట్లు బడ్జెట్ ను కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆమోదింప చేసుకున్నాము. ఈ విధంగా కేంద్రం నుంచి అవసరమైన నిధులు పొందుతూ పంచాయతీల్లో అభివృద్ధి పనులు చురుగ్గా, లక్ష్యాన్ని అందుకొనేలా పూర్తి చేయాలి.

ఇందుకోసం సమర్థులైన, సమగ్రత కలిగిన అధికారులకు బాధ్యతలు అప్పగించేందుకు బదిలీల ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాము. ఇప్పుడు కొత్తగా బాధ్యతలు చేపట్టిన అధికారులను సైతం ప్రభుత్వ లక్ష్యాలు దిశగా తీసుకువెళ్తాము. ఈ క్రమంలో వారు ప్రభుత్వ నియమనిబంధనలు పాటిస్తూ, ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా, అభివృద్ధి పనులను లోపరహితగా చేస్తున్నారో లేదో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఉన్నతాధికారులను ఆదేశించాను. నిర్దేశిత లక్ష్యాలను అందుకోకుండా, నిబంధనలకు విరుద్ధంగా వెళ్ళేవారికి స్థాన చలనం ఉంటుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో అనుభవంతో, రాష్ట్ర అభివృద్దే కోసం మా శాఖల సమీక్షలో, జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చేసిన సూచనలు విలువైనవి. వాటిని ఆధారంగా చేసుకొని పంచాయతీలకు పునరుజ్జీవం చేస్తున్నాము. ఇందుకుగాను ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. బదిలీల ప్రక్రియలో అనుసరించిన విధానాల గురించి తెలియచేయగానే మాకు సహకరించిన ప్రజా ప్రతినిధులు, మంత్రివర్గ సహచరులకు కృతజ్ఞతలు. బదిలీ ప్రక్రియలో పాలుపంచుకున్న ఉన్నతాధికారులకు నా అభినందనలు. బదిలీలపై తమ స్పందనను అందించిన మీడియాకు, ఉద్యోగ వర్గాలకు కృతజ్ఞతలు.

గ్రామ స్థాయిలో మౌలిక వసతుల కల్పన, స్థానిక పాలనలో ప్రజా భాగస్వామ్యం ధ్యేయంగా వెళ్తున్నాము. ఇందుకు ఉద్యోగ శక్తికి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. అందుకే వారి బదిలీల్లో సిఫార్సులు, లంచాలకు ఆస్కారం ఇవ్వలేదు. కచ్చితంగా వారు జవాబుదారీతనంతో పని చేస్తారు. ఎందుకంటే ఇది బాధ్యత కలిగిన పాలకులతో కూడిన మంచి ప్రభుత్వం.

LEAVE A RESPONSE