– సింగరేణి నుంచి మెస్సీ తెలంగాణకు వచ్చిన సందర్భంలో రూ.10 కోట్ల స్పాన్సర్షిప్ ఎలా ఇచ్చారు?
– టెండర్లు అభివృద్ధి కోసం కాకుండా కమీషన్ల కోసమే
– నైని బ్లాక్ టెండర్లను ఎందుకు రద్దు చేశారో భట్టి ప్రజలకు స్పష్టత ఇవ్వాలి
– రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి రూ.50 వేల కోట్లకు పైగా బకాయి
– రాష్ట్రాన్ని మొదట భ్రష్టు పట్టించింది బీఆర్ఎస్ పార్టీయే
– దర్యాప్తు స్కోప్ బీఆర్ఎస్ ప్రభుత్వ కాలం నుంచే ప్రారంభం కావాలి
– బీఆర్ఎస్ ప్రభుత్వం సీబీఐ తెలంగాణలోకి రాకుండా జీఓ తీసుకొచ్చింది
బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు
న్యూఢిల్లీ: సింగరేణి – నైని బ్లాక్ టెండర్ల రద్దు వ్యవహారం కమీషన్లు కాంట్రాక్టుల పేరుతో కాంగ్రెస్ దోపిడీ పాలనకు నిదర్శనం.. నైని బ్లాక్ కేసు ద్వారా కాంగ్రెస్ పాలనలో టెండర్లు అభివృద్ధి కోసం కాకుండా కేవలం కమీషన్ల కోసమే జరుగుతున్నాయన్న నిజం బయటపడింది.
కాంగ్రెస్ పార్టీకి ప్రజల సమస్యలపై కాదు, కేవలం కమీషన్ల గురించే ఆలోచన. సింగరేణి కార్మికుల రక్తం, చెమట పీల్చి కాంగ్రెస్ నాయకులు కమీషన్లు దండుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకుల సొంత మనుషులు, బంధుమిత్రులకే కోల్ బ్లాక్స్, కాంట్రాక్టులు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కి లేఖ రాసే నైతిక హక్కు వారికి లేదు.
సింగరేణిలో జరిగిన కుంభకోణాల్లో సగం పాపం గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వానిదైతే, మిగతా సగం పాపం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానిదే.గతంలో బీఆర్ఎస్ పాలనలో కూడా సింగరేణి కాంట్రాక్టులు తమ సొంత మనుషులకే ఇచ్చిన విషయం ప్రజలకు తెలిసిందే.
ఒకప్పుడు సింగరేణిలో వేలాది మంది ఉద్యోగులు ఉండగా, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సంఖ్య 42 వేల వరకు తగ్గిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది మరింతగా తగ్గి సుమారు 38 వేలకే పరిమితమైంది.
కార్మికుల రక్తం, చెమటతో లాభాల్లో నడిచిన సింగరేణిని పక్కన పెట్టి, ఈరోజు అదే సింగరేణి పేరుతో వ్యాపారం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దేశంలోనే అత్యంత లాభాల్లో ఉన్న సంస్థగా గుర్తింపు పొందిన సింగరేణిని ఈరోజు నష్టాల్లో ఉందని చెప్పడం దారుణం. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి రూ.50 వేల కోట్లకు పైగా బకాయిపడి ఉంది.
నష్టాల్లో ఉందని చెబుతున్న సింగరేణి నుంచి మెస్సీ తెలంగాణకు వచ్చిన సందర్భంలో రూ.10 కోట్ల స్పాన్సర్షిప్ ఎలా ఇచ్చారు? లాస్లో ఉన్న సంస్థతో ఇంత భారీ ఖర్చులు ఎలా పెట్టారు? దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి.
‘సైట్ విజిట్’ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చి, ఆ విధానం పేరుతో అక్కడికి వెళ్లి తమకు సంబంధించిన వారికే టెండర్లు ఇవ్వాలనే కుట్రపూరిత నిర్ణయాలు తీసుకుంటోంది. ఇది పూర్తిగా ప్లాన్డ్ స్కామ్. ఈరోజు సింగరేణి పరిస్థితికి, నైని బ్లాక్‌లో జరుగుతున్న అవకతవకలకు కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా బాధ్యత వహించాల్సిందే.
నైని బ్లాక్ టెండర్లను ఎందుకు రద్దు చేశారో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. ఎందుకు ఆ కాంట్రాక్టులు ఇచ్చారు? ఎందుకు పారదర్శకత లేదు? ఎందుకు చివరికి క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది? ఎవరెవరి దగ్గర నుంచి ఎవరెవరికి ఎంత ముడుపులు పుట్టాయి? ఈ అన్ని ప్రశ్నలకు ప్రజలకు సమాధానం రావాల్సిందే.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కార్పొరేట్ కంపెనీల విషయంలో మంత్రుల మధ్యే విభేదాలు బయటపడ్డాయి. ఒక మంత్రి, ఒక పీఏ కలిసి సిమెంట్ కంపెనీని బెదిరించిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. మరో మంత్రి “ఆ వ్యవహారంలోకి రావద్దు” అని చెప్పిన పరిస్థితులు ఉన్నాయి.
ఇప్పుడు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి మధ్య కూడా టెండర్లు ఎవరి మనుషులకు ఇవ్వాలి.. వారి మధ్య మా మనుషులకా, మీ మనుషులకా అన్న గొడవలు బహిర్గతమయ్యాయి. ఇది కాంగ్రెస్ పాలనలోని అసలైన పరిపాలనా పరిస్థితి.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరిపాలనపై కాదు, కేవలం కమీషన్లపైనే దృష్టి పెట్టింది. ఈరోజు సింగరేణిలో కార్మికుల రక్తాన్ని పీలుస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే.కష్టపడి సింగరేణిని ఆదుకుంటున్న కార్మికులను మరిచి, వారి శ్రమపై కమీషన్ల రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు. నైని బ్లాక్ వ్యవహారంలో పాపం సగం బీఆర్ఎస్ది, సగం కాంగ్రెస్‌దే.
సింగరేణి కి సంబంధించిన ఇలాంటి వ్యవహారాలు గతంలో కూడా అనేకసార్లు జరిగాయి.ఎవరికి టెండర్లు ఇచ్చారో, ఎవరికివ్వాలని ప్రయత్నం చేశారో.. ఇది నాయకులకు మాత్రమే కాదు, ప్రజలకు కూడా స్పష్టంగా తెలుసు.సింగరేణి, నైని బ్లాక్, కోల్ టెండర్లలో బీఆర్ఎస్ & కాంగ్రెస్ పార్టీలు చేసిన అవినీతిపై సమగ్ర దర్యాప్తు జరగాలి.
ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను పూర్తిగా పక్కన పెట్టింది. రాష్ట్రంలో నిజంగా పాలన జరుగుతోందా, లేక మంత్రుల మధ్య ఎవరు ఎంత పంచుకుంటున్నారు, ఎవరు ఎక్కువ తీసుకున్నారు, ఎవరి కుటుంబానికి ఎంత దక్కింది అన్న గొడవలే కొనసాగుతున్నాయా అనే సందేహం ప్రజల్లో తీవ్రంగా నెలకొంది.
కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల మధ్య జరుగుతున్న గొడవలు, కమిషన్ల పంచాయతీలు రోజు రోజుకు బయటపడుతూ, పాలన ఎంత దారుణంగా మారిందో స్పష్టంగా చూపిస్తున్నాయి. సింగరేణిలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అవకతవకలకు పాల్పడిన విషయం అందరికీ తెలిసిందే. ఒకవేళ హరీష్ రావు నిజంగా ఎంక్వైరీ జరగాలని కోరుకుంటే, ఆ విచారణ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు సింగరేణిలో జరిగిన అన్ని వ్యవహారాలపై జరగాల్సిందే.
సీబీఐ అయినా, సిట్ అయినా, విజిలెన్స్ అయినా.. ఏ దర్యాప్తు సంస్థ అయినా సరే, సింగరేణిని బీఆర్ఎస్ తమ సొంత ఆస్తిలా వాడుకున్న కాలం నుంచి, ఈ రోజు కాంగ్రెస్ మంత్రులు “మా వాళ్లకే కాంట్రాక్టులు ఇవ్వాలి” అని కొట్లాడుకునే స్థాయి వరకూ సమగ్ర దర్యాప్తు జరిపించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది.
హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీని సుద్దపూసలా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ రాష్ట్రాన్ని మొదట భ్రష్టు పట్టించింది బీఆర్ఎస్ పార్టీయే. ఆ పాపాన్ని కొనసాగిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. రెండు పార్టీలు పాపాత్ములే.
బీఆర్ఎస్-కాంగ్రెస్ రెండు పార్టీలూ సింగరేణి కార్మికుల రక్తాన్ని పీల్చాయి. కార్మికుల జీవితాలతో, ఉద్యోగాలతో తమ లాభాలు, తమ కమిషన్ల కోసం ఆడుకున్నారు.అందుకే గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈ రెండూ సింగరేణికి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.
నైని బ్లాక్ టెండర్లు ఎందుకు ఇచ్చారు? ఎందుకు పారదర్శకత లేదు? ఎందుకు క్యాన్సిల్ చేశారు? ఎవరికి ఎంత ముడుపులు పుట్టాయి? ఈ విషయాలన్నింటిపై తెలంగాణ ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వానికి సిట్ ఉంది, విజిలెన్స్ ఉంది. కేంద్రంలో సీబీఐ, ఈడీ ఉన్నాయి. ఏ సంస్థ దర్యాప్తు చేసినా సరే, దర్యాప్తు స్కోప్ బీఆర్ఎస్ ప్రభుత్వ కాలం నుంచే ప్రారంభం కావాలి.
2024లో సైట్ విజిట్ తర్వాత జరిగిన టెండర్లే కాదు, అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన టెండర్లు ఎందుకు ఇచ్చారు, ఎందుకు క్యాన్సిల్ చేశారు అన్న అంశాలన్నింటిపై కూడా సమగ్ర విచారణ జరపాల్సిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ జరగకుండా, బీఆర్ఎస్ ప్రభుత్వం సీబీఐ తెలంగాణలోకి రాకుండా జీఓ తీసుకొచ్చింది. సీబీఐ దర్యాప్తు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేదా కోర్టు ఆదేశం అవసరం. ఈడీ విషయంలో అలా కాదు. ఈడీ అనేక కేసుల్లో దర్యాప్తు చేసి, కేసులు కూడా నమోదు చేసింది.
ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, కోల్ స్కామ్ – ఇవన్నీ సెలెక్టివ్ అంశాల్లో మాత్రమే కాకుండా హోలిస్టిక్‌గా, పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలి. లక్షల కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తంపై విచారణ జరగాల్సిందే. సింగరేణిలో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం షేర్ మాత్రమే ఉంది. అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వానిదే. కేంద్ర ప్రభుత్వం ఒక్క ప్యూన్‌ను కూడా అపాయింట్ చేయలేదు, ఒక్క ప్యూన్‌ను కూడా ట్రాన్స్ఫర్ చేయలేదు.
సింగరేణి-కోల్ ఇండియా మధ్య ఉన్న 40 ఏళ్ల ఒప్పందాన్ని ప్రజల ముందు పెట్టాలి. ప్రాఫిట్ వచ్చినా, లాస్ వచ్చినా దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. ఇది టీవీ ఛానళ్ల మధ్య గొడవ కాదు. ఇది కాంగ్రెస్‌లోని మంత్రుల మధ్య, గ్రూపుల మధ్య జరుగుతున్న గొడవ. తుపాకీ పెట్టి కార్పొరేట్ కంపెనీలను బెదిరించడం, పేపర్లలో వార్తలు రాగానే టెండర్లు క్యాన్సిల్ చేయడం.. ఇవన్నీ పారదర్శకత లేనదనడానికి నిదర్శనాలు.
భారతీయ జనతా పార్టీలోని ఒక వర్గం బీఆర్ఎస్కు, మరో వర్గం కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తుందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఇది కాంగ్రెస్-బీఆర్ఎస్ సృష్టించిన కథనం మాత్రమే. బీజేపీ ఒక టీమ్. టీం బీజేపీగా ఐక్యంగా పనిచేస్తుంది.
దర్యాప్తు సంస్థలపై మాకు ఎలాంటి నియంత్రణ లేదు. మేము కేవలం డిమాండ్ చేస్తాం. రెండు సంవత్సరాలుగా ఫోన్ ట్యాపింగ్ విచారణ సాగుతూనే ఉంది. అధికారులను మాత్రమే బలి చేసి, రాజకీయ నాయకులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అనే ప్రశ్నకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి సమాధానం రావాలి.
మునుగోడు ఎన్నికల ముందు బీజేపీని ఓడించేందుకు ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఇది కాంగ్రెస్‌పై కాదు.. బీజేపీపై చేసిన కుట్ర. ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంగా చెప్పారు.. వెస్ట్ బెంగాల్ తర్వాత తెలంగాణ. తెలంగాణ ప్రజలకు బీజేపీపై నమ్మకం ఉంది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించండి.
తెలంగాణలో బీజేపీ అధికారంలో వచ్చాక.. డబుల్ ఇంజన్ సర్కార్‌తో తెలంగాణ రూపురేఖలు మార్చుతాం. నిజమైన బంగారు తెలంగాణగా మారుస్తాం.. మొత్తంగా చెప్పాలంటే, సింగరేణిలో జరిగిన అన్ని అవకతవకలకు, నైని బ్లాక్ స్కామ్‌కు కాంగ్రెస్-బీఆర్ఎస్ ప్రభుత్వాలే కారణం. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి పారదర్శక విచారణ జరిపి, దోషులను శిక్షించాల్సిందే.
మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి , బిజెపి ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ , బిజెపి తెలంగాణ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.