(నవీన్)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పీడిస్తున్న ఆర్ధిక బలహీనతను జయించడానికి, రాజకీయంగా సంక్రమించిన బలాన్ని వాడుకుంటున్నారు. ఏ పార్టీకీ స్పష్టమైన సొంత మెజారిటీ సీట్లు లేనప్పుడు కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించుకుని ప్రభుత్వాన్ని నడిపే సంకీర్ణ రాజకీయాలను నడిపించడంలో బాబుకంటే అనుభవజ్ఞుడు దేశంలో లేరంటే అతిశయోక్తి కాదు.
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో తెలుగుదేశం పార్టీ 16 ఎంపీలతో కీలక భాగస్వామిగా మారిన నేపథ్యంలో, ఈ రాజకీయ పలుకుబడిని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు.
ఎక్కడ తగ్గాలో ఖచ్చితంగా తెలిసిన ఈ సామర్థ్యంతో ఆయన కేంద్రప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంతో సరిపెట్టుకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు అనుగుణంగా చక్రం తిప్పుతున్నారు.
సంకీర్ణంలో పెద్దపార్టీపై వత్తిళ్ళు, బ్లాక్ మెయిళ్ళు, ప్రభుత్వాన్ని కూల్చెయ్యడాలు గత చరిత్ర.. ఒప్పించడం లేదంటే ఒప్పుకోవడం తప్ప సంకీర్ణంలో మూడో మాటలేదు. ఓర్పు సహనాలతో, తనకున్న నాలెడ్జ్ తో ఒప్పించే “లాబీయింగ్” నైపుణ్యంకూడా చంద్రబాబుకి చాతనైనంతగా భారత రాజకీయాల్లో మరెవరికీ లేదు.
సెక్యులర్ అంశం, ప్రత్యేక హోదా విషయాల్లో తప్ప ఆర్ధికవిధానాల్లో ప్రధాని నరేంద్రమోదీకి చంద్రబాబుకి ఎలాంటి తేడాలూ లేవు. ఒకరు వికాస్ నినాదంతో మరొకరు 2047 విజన్ డాక్యుమెంటుతో స్వేచ్చా వాణిజ్యానికి , పెట్టుబడుల విధానానికి బ్రాండ్ అంబాసిడర్లే.
అన్నీ కుదిరాయి. చంద్రబాబు విజన్ డాక్యుమెంటులో మౌలిక ఆలోచనలను కేంద్రం స్వీకరించింది. మోదీ కోరికపై ఆర్ధిక వనరులను క్రోడీకరించి రాష్ట్రాలకు కేటాయించే శక్తివంతమైన సంస్ధ “నీతీఅయోగ్” బృందంతో చంద్రబాబు 5 సార్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ బృందం స్వయంగా ఆంధ్రప్రదేశ్ ను సందర్శించింది కూడా.
అమరావతి నిర్మాణానికి కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన “బహుళపాక్షిక మద్దతు” (multilateral support)ను త్వరగా విడుదల చేయాలని ప్రధానిని కోరారు. ఇది కేవలం కేంద్ర నిధులపైనే కాకుండా, ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు పొందేందుకు కేంద్ర ప్రభుత్వ హామీని కోరే వ్యూహంలో భాగమని అర్ధమౌతోంది.
ఇదంతా గమనించినపుడు ముఖ్యమంత్రి తరచుగా ఢిల్లీ వెళ్లడం బలమా? బలహీనతా? అనే ప్రశ్నకు ఆస్కారమే లేదు. ఇది ఒక వ్యూహాత్మక అవసరమని ఆంధ్రప్రదేశ్ స్థితిగతులు అర్ధం చేసుకున్న ఎవరికైనా అర్ధమైపోతుంది