– పిల్లల పాలిట పాయిజన్ గా మారిన రేవంత్ రెడ్డి
– ఆసుపత్రి పాలయిన విద్యార్థులను పరామర్శించడానికి టైం లేదా?
– 100 కోట్లు ఖర్చుపెట్టి ఫుట్బాల్ ఆడడం ఎందుకు రేవంత్ రెడ్డి? ఆ డబ్బుతో ఒక పూట కడుపునిండా అన్నం విద్యార్థులకు పెట్టలేవా?
– యాడ్లలో తెలంగాణ రైసింగ్ .. హాస్పిటల్స్ లో విద్యార్థులు ఫాలింగ్
– మెస్సితో ఫుట్ బాల్ ఆడేందుకు మేస్త్రి కోట్లు ఖర్చు చేస్తున్నాడు.. పిల్లలకు మాత్రం తిండి పెట్టడం లేదు
– రాహుల్ గాంధీకి ఫుట్ బాల్ మ్యాచ్ మీద ఉన్న శ్రద్ధ.. చనిపోతున్న రైతులు, విద్యార్థుల మీద లేదు
– పాఠశాలలో పురుగుల అన్నం తిని ఆగమైతుంటే, నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగే తెలివి, బాధ్యత లేదా?
– అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులే స్వయంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి రేవంత్ సర్కార్ పై ఫిర్యాదు చేసే దుస్థితి నెలకొంది
– కింగ్ కోఠి ఆసుపత్రిలో విద్యార్థులను పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్: బాగ్ లింగంపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై కింగ్ కోఠి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. వారి వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ ఉన్నారు. విద్యార్థులకు అందుతున్న వైద్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హరీష్ రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై, రాహుల్ గాంధీ పర్యటనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదో ఒక గురుకుల పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు కలుషిత ఆహారం తిని ఆసుపత్రి పాలవుతున్నారు. మొన్న షామీర్ పేట్ లో బీసీ గురుకుల పాఠశాలలో అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఏకంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లే పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విద్యార్థులే ఫిర్యాదు చేశారు. నిన్న మాదాపూర్ లోని చందు నాయక్ తండాలో మధ్యాహ్న భోజనం వికటించి 43 మంది పిల్లలు ఆసుపత్రిలో చేరారు. ఇప్పుడు ముషీరాబాద్ నియోజకవర్గంలో బాగ్ లింగంపల్లి మైనార్టీ గురుకులంలో కలుషిత ఆహారం తిని 90 మంది ఆసుపత్రి పాలయ్యారు.
రేవంత్ రెడ్డి విజన్ 2047 అని డబ్బా కొట్టుకుంటున్నాడు. ఇది విజన్ 2047 కాదు.. విద్యార్థుల పాలిట పాయిజన్ 2047 గా మారింది. పిల్లల పాలిట పాయిజన్ గా మారిన రేవంత్ రెడ్డి. నీకు నిజాయితీ ఉంటే గురుకులాల్లోని పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టు. ఆసుపత్రిలో చేరిన విద్యార్థులు తిరిగి మళ్లీ హాస్టల్ కి వెళ్ళము అని భయపడి చెబుతున్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో పిల్లలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. కేసీఆర్ హయాంలో సన్నబియ్యంతో మంచి నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందేది.
ఇప్పుడు దొడ్డు బియ్యం పెడుతున్నారు, అన్నం ఉడకడం లేదు, సరైన భోజనం పెట్టట్లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీవీ యాడ్లు, పేపర్ యాడ్ల కోసం మాత్రమే తెలంగాణ రైసింగ్. వాస్తవంలో గురుకుల, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు హాస్పిటల్స్ లో ఫాలింగ్. దేంట్లో రైసింగ్? అవినీతిలో రైసింగ్. అరాచకంలో రైసింగ్. అహంకారంలో లేక కబ్జాలో రైసింగ్. 20 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడుతున్నా అంటున్నావు. అప్పటివరకు పిల్లలు బతికుండేది ఎట్లా?
ముఖ్యమంత్రికి కనీసం చీమ కుట్టినట్టైనా లేదు. ఏనాడు కూడా ఆసుపత్రి పాలైన విద్యార్థులను పరామర్శించలేదు. ఫుట్బాల్ ఆడడంలో ముఖ్యమంత్రి బిజీగా ఉంటాడు. మెస్సితో ఫుట్బాల్ ఆడటానికి మేస్త్రి కోట్లు ఖర్చు చేస్తున్నాడు. 5 కోట్లతో స్టేడియం కట్టించుకున్నాడు. 100 కోట్లు ఖర్చుపెట్టి ఫుట్బాల్ ఆడడం ఎందుకు రేవంత్ రెడ్డి? ఆ డబ్బుతో ఒక పూట కడుపునిండా అన్నం విద్యార్థులకు పెట్టలేవా?
నీ కబ్జాలకు, నీ సోకులకు, నీ కమిషన్లకు టైం సరిపోవడం లేదు.. ఇంక నువ్వు విద్యార్థులను ఎలా పట్టించుకుంటావు. 61 సార్లు ఢిల్లీకి పోవడానికి టైం ఉంది కానీ ఆసుపత్రి పాలయిన విద్యార్థులను పరామర్శించడానికి టైం లేదా? ఆరు గ్యారెంటీలకు నాది జిమ్మెదారి అన్న రాహుల్ గాంధీ ఎటు పోయిండు?
ఈరోజు రాష్ట్రంలో దాదాపు 300 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే రాహుల్ గాంధీ రాడు.
160 మంది ఆటో డ్రైవర్లు చనిపోతే రాడు. 116 మంది విద్యార్థులు చనిపోతే రాడు. 42% రిజర్వేషన్ కోసం బీసీలు పోరాటం చేస్తున్నా రాడు. రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నా ముఖం చాటేసి, ఈరోజు ఫుట్ బాల్ చూడడానికి వస్తున్నాడు.
రాహుల్ గాంధీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు వచ్చి రేవంత్ రెడ్డి ఆడే ఫుట్బాల్ చూసి పరవశిస్తాడంట. కలుషిత ఆహారంతో కడుపునొప్పి భరించలేక ఏడుస్తున్న విద్యార్థుల కన్నీళ్లు చూడు రాహుల్ గాంధీ. గురుకుల పాఠశాలలో పురుగుల అన్నం తిని ఆగమైతుంటే, నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగే తెలివి, బాధ్యత లేదా? విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అట్టర్ ప్లాఫ్ అయ్యాడు. త్రీ ట్రిలియన్ ఎకానమీ, ఫ్యూచర్ సిటీ అని గొప్పలు చెప్పడం కాదు.. ముందు హాస్టల్ పిల్లలకు పురుగులు లేని అన్నం పెట్టండి.