Suryaa.co.in

Telangana

త్యాగం చేసినందుకు భారాస నాకు ఇచ్చిన బహుమతి ఈ సస్పెన్షన్‌

– మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్‌: తనను భారాస నుంచి సస్పెండ్‌ చేయడం సంతోషమేనని.. కానీ ఎందుకు అలా చేశారో స్పష్టంగా చెప్పాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తాను అసత్యాలు మాట్లాడినట్లు రుజువు చేయాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లోని ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు.

‘‘మూడేళ్లుగా భారాస సభ్యత్వం పుస్తకాలు నాకు ఇవ్వలేదు. పార్టీ సభ్యుడిగా నేను ఉన్నట్లా?లేనట్లా? పారదర్శక పాలన అందించడం ప్రభుత్వం బాధ్యత. ఇష్టారీతిన పాలన చేస్తా.. అడిగేందుకు మీరెవరు? అనే రీతిలో ప్రవర్తిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో యావత్‌ తెలంగాణ సమాజం భాగస్వామ్యం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో జిల్లా అంతటా పాదయాత్ర చేశాను. స్వరాష్ట్ర సాధనలో భాగంగా ఎమ్మెల్యే, మంత్రి పదవులను త్యాగం చేసినందుకు భారాస నాకు ఇచ్చిన బహుమతి ఈ సస్పెన్షన్‌.

2019 ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని 14 స్థానాల్లో 13 చోట్ల భారాస గెలిచింది. ఆ గెలుపులో నా కష్టం.. నా నిజాయతీ ఉన్నాయి. 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. ఈసారి నేను ఓడిపోవడానికి ప్రభుత్వ పెద్దలే కారణం. సీనియర్లు ఉండొద్దనే ఉద్దేశంతో నన్ను ఓడించారు. ఓ వైపు టికెట్‌ ఇస్తూనే.. మరోవైపున ఓడించారు. దానికి ఎన్నో కారణాలున్నాయి. నేనెప్పుడూ వ్యక్తిగత ప్రయోజనం పొందలేదు’’ అని జూపల్లి కృష్ణారావు అన్నారు.

LEAVE A RESPONSE