– జర్నలిస్టు అనే పదానికి అర్థం లేకుండా పోతోంది
– కమ్యూనిస్టులు ఉప్పు లాంటి వారు.
– ఉప్పు లేని వంట రుచి ఉండదు
– “నవ తెలంగాణ” దినపత్రిక 10 వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నిరంతరం ప్రజల పక్షాన నిలబడి పనిచేసే పత్రికా సంస్థలు కొన్ని మాత్రమే ఉంటాయి. అందులో నవ తెలంగాణ పత్రిక ఒకటి. ప్రస్తుతం పత్రికా సంస్థలు తమ విశ్వసనీయతని కోల్పోయే పరిస్థితి తలెత్తుతోంది. స్వాతంత్ర్య పోరాటంలో దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు పత్రికలు ఉపయోగపడ్డాయి.
నాటి సాయుధ రైతాంగ పోరాటంలో, సామాజిక రుగ్మతలపై ప్రజలలో చైతన్యం తీసుకొచ్చేందుకు కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన పత్రికలు ఉపయోగపడ్డాయి. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ.. పాలకులు ఎవరైనా ప్రజల పక్షం నిలుస్తున్న పత్రిక నవ తెలంగాణ.
గతంలో తమ భావజాలాన్ని ప్రజలకు వివరించేందుకు కొన్ని రాజకీయ పార్టీలు పత్రికలను నడిపేవి. కానీ ఈ రోజుల్లో రాజకీయ పార్టీల పత్రికలు వింత పోకడతో వ్యవహరిస్తున్నాయి. తమ సంపాదనను కాపాడుకోవడానికి, తప్పులను కప్పి పుచ్చుకునేందుకు కొన్ని రాజకీయ పత్రికలు పనిచేస్తున్నాయి. దీంతో జర్నలిస్టు అనే పదానికి అర్థం లేకుండా పోతోంది
జర్నలిజం ముసుగులో ఉన్న కొన్ని రాజకీయ పార్టీల పత్రికల తీరును ప్రజలు నిశితంగా గమనించాలి. జర్నలిజంలో ఓనమాలు తెలియనివారు కొంతమంది జర్నలిస్టు ముసుగు వేసుకుని సోషల్ మీడియా పేరుతో తిరుగుతున్నారు.. నిజమైన జర్నలిస్టులు సెమినార్లు నిర్వహించి, జర్నలిస్ట్ పదానికి డెఫినేషన్ నిర్వచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.ఎవడు పడితే వాడు జర్నలిస్ట్ అంటాడు. మీడియా సమావేశం లో ముందు కూర్చొని నమస్తే పెట్టవా అన్నట్టు చూస్తాడు. వేదిక దిగి కొట్టాలనిపిస్తుంది.
‘నేను పాత్రికేయ మిత్రులను కోరుతున్నా. జర్నలిజానికి నిర్వచనం ఇవ్వండి. మమ్మల్ని ప్రశ్నించేవారిని సెపరేట్ చేయండి. వాళ్లను మీ పక్కన కూర్చోనీయకండి. వాళ్లను నేరుగా కూర్చోబెట్టండి. మాట్లాడండి. వాళ్లు-మేం వేర్వేరన్న భావన ప్రజల్లో కలిగించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీడియా, సోషల్మీడియా, డిటిజల్ మీడియా, ప్రింట్ మీడియా..ఎవడుపడితే వాడు.. వాడికి పెన్ను పేపరిస్తే అ ఆలు మొత్తం రాయలేడు.
బీసీడీలు కూడా మొత్తం రాయలేడు. వాడు కూడా నేను జర్నలిస్టు అంటున్నాడు. నేను సోషల్మీడియా జర్నలిస్టునంటాడు. వాడి పేరు పక్కనే జర్నలిస్టు అని పెట్టుకుంటాడు వేరే ఆయన. వాళ్ల తాత,ముత్తాతలంతా జర్నలిజంలోనే పుట్టి పెరిగినట్లు! పోనీ ఏదైనా జర్నలిజం స్కూల్లో చదివిండా? లేక ఓనమాలు మొత్తమొస్తాయా అనుకుంటే అదీ రాదు’’అని, రేవంత్ నేటి జర్నలిజంలో ఉన్న పరిస్థితులను విశ్లేషిస్తూ వ్యాఖ్యానించారు.
గతంలో మేం ప్రెస్ మీట్ లు నిర్వహించినప్పుడు సబ్జెక్టుపై జర్నలిస్టులతో వివరాలు తీసుకునే వాళ్లం.కానీ ఇవాళ వింత పోకడలు వచ్చాయి. ఈ వింత పోకడలకు రాజకీయ పార్టీలు తోడయ్యాయి. ఈ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నాయి. రాజకీయ నాయకుల విశ్వసనీయతలాగే, జర్నలిస్టుల విశ్వసనీయత కూడా వేగంగా సన్నగిల్లుతోంది.
అందుకే నిజమైన జర్నలిస్టులు దీనికి ఒక లక్ష్మణ రేఖ గీయాల్సిన పరిస్థితి ఏర్పడింది.నిజమైన జర్నలిస్టులు, జర్నలిస్టుల ముసుగు తొడుక్కున్న వారిని మీరే వేరు చేయాల్సిన అవసరం ఉంది.లేకపోతే దేశ భద్రతకే ప్రమాదకరంగా మారే పరిస్థితి ఏర్పడుతుంది.కమ్యూనిస్టులు ఉప్పు లాంటి వారు. ఉప్పు లేని వంట రుచి ఉండదు…
అలాగే ప్రజా సమస్యలపై పోరాటంలో ఎర్రజెండా కనిపించిన్నప్పుడే ఆ సమస్యల పరిష్కారం జరుగుతుంది. ప్రభుత్వ ప్రకటనల్లో నవ తెలంగాణకు సమాన ప్రాధాన్యతనిస్తాం. ఆనాడైనా.. ఈ నాడైనా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కమ్యూనిస్టుల సహకారం ఎంతో ఉంది. భవిష్యత్తులో కాంగ్రెస్- కమ్యూనిస్టుల మధ్య సహకారం ఇలాగే కొనసాగాలి. కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పని చేస్తే ప్రజలకు మరింత ప్రయోజనం ఉంటుంది.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సీపీఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.