* కల్తీ నెయ్యి కేసులో సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వలేదు
* కల్తీ నెయ్యితో చేసిన లడ్డూలనే ఆయోధ్య రామమందిర విగ్రహ ప్రతిష్ఠకు పంపారు
* హిందూ విశ్వాసాలపై దాడి
* తప్పు చేసినవారు ఏడుకొండలవాడికి క్షమాపణ చెప్పి తీరాలి
* కల్తీ నెయ్యి దోషుల్ని కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదు
* ఏడుకొండల వాడికి రెండు కొండలు చాలన్న వారసత్వం వారిది
* తిరుమల పవిత్రతను దిగజార్చేందుకు ఏ స్థాయికైనా దిగజారుతారు
* రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
అమరావతి:‘ఏడుకొండలవాడికి రెండు కొండలు చాలు అన్న ఆలోచనా విధానం నుంచి, వెంకటేశ్వరస్వామికి ఉన్నది రెండే కొండలు అన్న వారసత్వం నుంచి పుట్టినవారు తిరుమల పవిత్రతను దిగజార్చేందుకు ఏ స్థాయికైనా దిగజారుతారు’ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వారు భగవంతుడి మీదే పగ పట్టారన్నారు. భగవంతుడి మీద పగ పట్టిన వారు మట్టికొట్టుకుపోతారని తెలిపారు. కల్తీ నెయ్యి కేసులో సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వలేదన్నారు. లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యి అసలు పాల నుంచి చేసిందే కాదని రిపోర్టులో పేర్కొన్నట్టు చెప్పారు. చేసిన తప్పుకి క్షమాపణ కోరకుండా ఎదురు మమ్మల్ని క్షమాపణ చెప్పమని బుకాయిస్తున్నారన్నారు. ఇది హిందూ విశ్వాసాల మీద జరిగిన దాడి అన్నారు. తప్పు చేసిన వారు ఏడుకొండల వాడికి క్షమాపణ చెప్పి తీరాల్సిందేనన్నారు. కల్తీ నెయ్యి కేసులో దోషుల్లో ఏ ఒక్కరినీ కూటమి ప్రభుత్వం వదలదని హెచ్చరించారు. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, సహచర మంత్రులతో సమావేశం అయ్యారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “మతం, ధర్మం చాలా లోతైన అంశాలు. చాలా సున్నితమైనవి కూడా. అలాంటి వ్యవహారాల్లో ఒక్క మాట మాట్లాడాలన్నా చాలా ఆలోచించి మాట్లాడాలి. ముఖ్యమంత్రి, మేము కూడా మాట్లాడే సమయంలో సంయమనంతో, ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నది ఆలోచించి మాట్లాడుతాం” అన్నారు.
* దేవాలయాలపై దాడులు జరిగితే పిచ్చోడి పనన్నారు
2019 నుంచి 2024 వరకు జరిగిన వైసీపీ పాలనలో ఎన్నో దేవాలయాలపై దాడులు జరిగాయి. అన్నీ మతపరంగా సున్నితమైన అంశాలే. రామతీర్ధంలో రాముడి విగ్రహానికి శిరచ్ఛేదం చేస్తే ఎవరో ఆకతాయి చేశాడని, పిచ్చోడు చేశాడని చెప్పారు. పిఠాపురంలో దేవతా విగ్రహాలకు అశుద్ధం పూస్తే అదీ పిచ్చోడి పనే అన్నారు. కనకదుర్గమ్మ ఆలయంలో వెండి సింహాలు చోరీకి గురైతే కొత్తవి కొనుక్కోవచ్చంటూ తేలికగా మాట్లాడారు. అంతర్వేదిలో రథం తగులబెడితే అదీ ఎవరో పిచ్చోడి పనే అన్నారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు 219కి పైగా జరిగాయి. ఒక్క అంశంలోనూ సరైన చర్యలు తీసుకోలేదన్నారు.
* జంతు కొవ్వు ఉందని ఎన్డీడీబీ రిపోర్టు చెప్పింది
వెంకటేశ్వరస్వామి పాదాల చెంత రక్షించబడిన చంద్రబాబు నాయుడు ఇలాంటి అంశాల్లో చాలా అప్రమత్తంగా మాట్లాడుతారని తెలిపారు. ఎన్నికల అనంతరం ఎన్డీఏ పక్షాల సమావేశంలో ఆయన కల్తీ నెయ్యికి సంబంధించి నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్టును చదివి వినిపించారని చెప్పారు. ఒక రిపోర్టులో వెజిటేబుల్ ఆయిల్స్ ఉన్నాయని, మరో రిపోర్టులో అసలు నెయ్యే లేదని, ఫిష్ ఆయిల్, బీఫ్ ఆయిల్, పంది కొవ్వు లాంటివి ఉన్నాయని ప్రస్తావించారని తెలిపారు.
* నెయ్యే లేకుండా లడ్డూ ప్రసాదం చేసి బుకాయిస్తున్నారు
ఏ నివేదిక చూసినా నెయ్యి లేదని తేలిందన్నారు. వైసీపీ హయాంలో వినియోగించిన 59.70 లక్షల కేజీల నెయ్యిలో 58 లక్షల కేజీలు పామ్ ఆయిల్, మిగిలింది కెమికల్స్ అని విచారణలో తేలిందన్నారు. సీబీఐ నివేదికలో ఇది పాల కొవ్వులతో చేసింది కాదని స్పష్టం చేసిందన్నారు. ఎన్డీడీబీ రిపోర్టులో జంతు కొవ్వు కలిసిందని స్పష్టంగా ఉందన్నారు.
* కల్తీ జరిగిందని 2022లోనే తెలిసినా రిపోర్టు తొక్కిపెట్టారు
ఆయోధ్య రామమందిర విగ్రహ ప్రతిష్ఠకు పంపిన లక్ష లడ్డూలు ఇదే కల్తీ నెయ్యితో చేసినవని తెలిపారు. ఇది విశ్వాసాల మీద జరిగిన దాడి అన్నారు. తప్పు చేసిన వారు భగవంతునికి మొకరిల్లే వరకు ఈ యుద్ధం కొనసాగుతుందని హెచ్చరించారు