-ఎంతో ప్రణాళికతో విజన్ తోనే రాజధానికి చంద్రబాబు శ్రీకారం
-మడమ తిప్పడం మాట తప్పడం జగన్ నైజం
-కులమతాలకు అతీతంగా పాదయాత్రకు ప్రజల మద్దతు
-రాజధానితో విశాఖపట్నం కొత్తగా వచ్చేది ఏమిటి
– ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు,డి.బి.వి.స్వామి,గొట్టిపాటి రవికుమార్, దామచర్ల సత్య
ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు సీఎం జగన్ మూడు రాజధానుల నాటకం ఆడుతున్నారని ప్రకాశం జిల్లా టీడీపీ నాయకులు విమర్శించారు. ఆదివారం ఏడవ రోజు రేపల్లె నియోజకవర్గం లో అమరావతి రైతుల మహాపాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతిని చిదిమేయ్యాలనే వైసిపి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేస్తుందన్నారు. ఎన్నికల ముందు వరకు అమరావతికి మద్దతు తెలిపిన ప్రతిపక్ష నాయకుడు జగన్ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పారని మండిపడ్డారు.
కోర్టులో ఎన్నిసార్లు చివాట్లు తిన్న ఈ ప్రభుత్వం తీరు మార్చుకోవడం లేదన్నారు. సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి భంగపాటు తప్పదన్నారు. అన్ని ప్రాంతాలకు సమదూరం, నీటి వనరు, రవాణా వనరులు ఉన్న అమరావతిని రాజధానిగా చంద్రబాబు ఎంపిక చేశారని తెలిపారు. ఒక ప్రణాళిక ఒక విజన్ తో ఆనాడు చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుడితే ఒక ప్రణాళిక ఒక అవగాహన లేని ముఖ్యమంత్రి రాజధాని సర్వనాశనం చేస్తున్నాడన్నారు.
రైతుల సమ్మతితో 33 వేల ఎకరాలను స్వచ్ఛందంగా సేకరించిన ఘనత చంద్రబాబు నాయుడు దేనన్నారు. ప్రజలందరి మద్దతు ప్రపంచం నివ్వెర పోయేలా అద్భుత రాజధానిని నిర్మించడం కోసం అహర్నిశలు శ్రమించారని గుర్తు చేశారు. ఒక్క నిర్మాణం పూర్తి కాలేదని వైసిపి ప్రభుత్వం ప్రచారాలు చేస్తుందన్నారు. ప్రస్తుతం పాలన సాగిస్తున్న భవనాలన్నీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కట్టినవేనాన్ని గుర్తుంచుకోవాలన్నారు. విధ్వంసం అరాచకం తప్ప రాష్ట్రంలో అభివృద్ధి జాడలు లేవన్నారు. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అనేది ప్రాంతీయ విద్వేషాలు రెచ్చకొట్టడ కోసమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల మహాపాదయాత్రకు కులమతాలకు అతీతంగా అన్ని ప్రాంతాల వారి మద్దతు రైతులకు ఉందని స్పష్టం చేశారు. మూడేళ్లుగా విశాఖకు అభివృద్ధి చేయలేని ముఖ్యమంత్రి ఇప్పుడు ఏం చేస్తారని ప్రశ్నించారు. కేవలం రాజధాని ప్రకటించడం ద్వారా ఏం సాధిస్తారని ప్రశ్నించారు. మూడున్నర సంవత్సరాలుగా విశాఖపట్నం అన్ని రకాలుగా దోచుకున్నారు. భూముల కబ్జాలకు పాల్పడ్డారు వారి ఆస్తులు పెంచుకోవడం కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. తొలుత టీడీపీ నేతలు అమరావతి రైతు రధం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
యాత్ర విజయవంతం కావాలని రైతుల ఆకాంక్షలను ఆ ఏడుకొండలవాడు నెరవేర్చాలని ప్రార్ధించారు. ఎమ్మెల్యే ఏలూరితో పాటు అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ ,కొండేపి శాసనసభ్యులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, మాజీ ఎమ్మెల్యే అరమిల్లి రాధాకృష్ణ, బాపట్ల నియోజకవర్గం ఇంచార్జ్ వేగేశన నరేంద్ర వర్మ, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ కార్య నిర్వాహ కార్యదర్శి దామచర్ల సత్య తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు.