-ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఏకం కానున్న ప్రతిపక్షాలు
-రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణమన్న కనకమెడల వ్యాఖ్యలతో ఏకీభవించిన ప్రధాని మోడీ
-రాజధాని ఎక్కడ కడతామన్న రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు లేఅవుట్ అభివృద్ధికి 50 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పడం దారుణం
-ముందు పనులు చేసిన వారికి పెండింగులో ఉన్న బిల్లులు చెల్లించండి
-ముఖ్యమంత్రికి సమయానికనుగుణంగా కాలు బెనుకుతుంది
-గతంలో అమలులో ఉన్న పథకానికే కొత్త పేరు ఫ్యామిలీ డాక్టర్
-నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముక్తా ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాష్ట్రం లో మూడు పార్టీలు కలిసి పని చేయడం ఖాయమని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘు రామకృష్ణంరాజు తెలియజేశారు. పొత్తులపై ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టతనిచ్చారు. ప్రతిపక్షాల ఓట్లు చీల నివ్వనని పేర్కొన్న ఆయన, సరైన సమయంలో పొత్తులపై నిర్ణయం వెల్లడిస్తామని తెలిపారని గుర్తు చేశారు. గురువారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ ఢిల్లీ లో బిజెపి పెద్దలతో జరిగిన
సమావేశం లో ఏమి మాట్లాడారో నన్న టెన్షన్ అటు జనసేన ఇటు టిడిపి కార్యకర్తలు కనిపించింది. వారి కంటే ఎక్కువ టెన్షనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కనిపించిందన్నారు. టిడిపి తో పొత్తు గురించి బిజెపి పెద్దలతో మాట్లాడారా? అని పవన్ కళ్యాణ్ ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు, రాజకీయాలంటే అన్ని మాట్లాడుకుంటామని ఆయన సమాధానమిచ్చిన తీరు తోనే పొత్తులపై విస్పష్టమైన సమాధానం ఇచ్చినట్లయింది. పొత్తులపై జనసేన ముఖ్య నాయకుడు నాదెండ్ల మనోహర్ కూడా స్పష్టమైన సమాధానాన్ని ఇచ్చిన తరువాత కూడా, ఇంకా పొత్తుల గురించి ఎవరికైనా అర్థం కాలేదంటే వారు బుద్ధిహీనులై ఉంటారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి 40% ఓటు బ్యాంకు గతంలోనే ఉన్నది. ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వనని పవన్ కళ్యాణ్ పేర్కొనడం ద్వారా టిడిపి తో కలిసి వెళ్లాలని నిర్ణయించినట్లుగా తేటతెల్లము అవుతుంది. ఎన్నికల్లో ఒంటరిగా వెళితే, ఈ దుష్ట పాలనను అంతం చేయలేం… ఈ దుష్టపాలను అంతం చేయాలి అంటే ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై పోరాడాలని ఆయన భావిస్తున్నట్లుగా స్పష్టం అవుతోంది. ఒక పార్టీ అధినేతగా తనకున్న ఓటు బ్యాంకు ఎంతో ఆయనకు స్పష్టమైన అవగాహన కలిగి ఉంటారు . రాష్ట్రాన్ని ఈ దుష్ట పాలన నుంచి విముక్తి చేయాలని పవన్ కళ్యాణ్ కంకణం కట్టు కున్నారు. రాష్ట్రంలో బిజెపి ఎంతగా పెరిగినప్పటికీ, టిడిపి జనసేన తో కలిసి వెళ్తేనే ఈ దుష్ట ప్రభుత్వాన్ని తుద ముట్టించడమన్నది సాధ్యం అవుతుంది. సరైన సమయం లో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ నాయకత్వం కూడా రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం స్పందిస్తుంది. జనాల సంక్షేమమే ముఖ్యం కానీ జగన్ సంక్షేమం కాదన్న విషయం ఆ పార్టీ నాయకత్వానికి కూడా తెలుసు. రానున్నా ఎన్నికల్లో రాష్ట్రంలో టిడిపి, జనసేన, బిజెపిలు కలిసి పోటీ చేస్తాయని బిజెపి పెద్దలు మురళీధరన్, శివ ప్రకాష్ జి , నడ్డాలతో నాదెండ్ల మనోహర్ , పవన్ కళ్యాణ్ భేటీ అనంతరం ప్రగాఢ విశ్వాసంతో , రెట్టించిన ఉత్సాహంతో చెబుతున్నానని రఘురామకృష్ణంరాజు తెలిపారు.
బిజెపి కలయికపై ఎటువంటి సందేహాలు వద్దు
రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో టిడిపి, జనసేన లతో బిజెపి కలయికపై ఎటువంటి సందేహాలను పెట్టుకోవలసిన అవసరం లేదని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కుటుంబ సమేతంగా కలిసే అవకాశం టిడిపి రాజ్యసభ సభ్యుడు కనకమెడల రవీందర్ కుమార్ కు లభించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అధ్వాన శాంతి భద్రతల పరిస్థితులను రవీంద్ర కుమార్ ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్లి, రాష్ట్రాన్ని కాపాడ వలసిందిగా కోరారు. దానికి ప్రధానమంత్రి స్పందిస్తూ ,అవును…ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి పంజాబ్ మాదిరి గానే ఉన్నదని వ్యాఖ్యానించడం ద్వారా రవీందర్ కుమార్ వాదనలతో ఆయన ఏకీభవించినట్లయింది. ప్రధానమంత్రి తో ఏదో ఒకటి మాట్లాడి, బయటకు వచ్చి మా పార్టీ పెద్దల మాదిరిగా బిల్డప్పులు ఇచ్చే రకము రవీందర్ కుమార్ కాదు. ప్రధానమంత్రి తన మనసులో ఉన్న మాటను, రవీందర్ కుమార్ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవించడం ద్వారా చెప్పకనే చెప్పారు. ఒకవేళ ఆయనకు రవీందర్ కుమార్ మాటలు ఇష్టం ఉండి ఉండకపోతే, సబ్జెక్టు డైవర్ట్ చేసి ఉండేవారని తాను పలువురితో మాట్లాడినప్పుడు పేర్కొన్నారని రఘురామ కృష్ణంరాజు తెలియజేశారు. రానున్న రోజుల్లో టిడిపి జనసేన కలిసి పనిచేసే అవకాశాలు ఉండగా,వారి తో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కూడా జతకట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జనసేన తోనే తమ పొత్తు ఉంటుందన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాటల్లోనూ తప్పులేదు. జనసేన తో బీజేపీ కలిసి పని చేయాలనుకుంటుండగా, టిడిపి తో జనసేన కలిసి పని చేసేందుకు ఆసక్తిని చూపుతుంది. టిడిపి, జనసేన, బిజెపి కలిస్తే మాడు పగులుతుందని, బాక్స్ బద్దలవుతుందని, కొంప కొల్లేరవుతుందన్న ఆందోళనలో మా పార్టీ పెద్దలు ఉన్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసినప్పుడు రాష్ట్రంలోని శాంతి భద్రత పరిస్థితిని వివరించినట్లు రఘురామకృష్ణం రాజు తెలిపారు. గతంలో తనని లాకప్ లో చిత్రహింసల గురిచేశారని, ఇప్పుడు బిజెపి నాయకుడు సత్య కుమార్ పై దాడి చేశారని వివరించానని తెలిపారు . గతంలో బిజెపిలో పని చేసినప్పటి తనకు జేపీ నడ్డాతో పరిచయం ఉంది. అప్పటినుంచి ఆయనతో టచ్ లోనే ఉన్నాను. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో పొత్తులు ఉంటాయని ఆయన బాడీ లాంగ్వేజ్ పరిశీలిస్తే అర్థమయిందన్నారు.
పూర్తయిన టిడ్కో ఇల్లు ఇవ్వకుండా… లేఅవుట్ వేసి ఇస్తాననడం ఆశ్చర్యం
రాష్ట్రంలో పూర్తయిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయకుండా, అమరావతిలో లేఅవుట్ ను అభివృద్ధి చేసి పేదలకు పంచుతానని ముఖ్యమంత్రి జగన్ మోహన్ చెప్పడం ఆశ్చర్యంగా ఉందని రఘురామకృష్ణం రాజు విస్మయం వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంతంలో 1138 ఎకరాల్లో 50 కోట్ల రూపాయలు వెచ్చించి యుద్ధ ప్రాతిపదికన లే ఔట్ అభివృద్ధి చేసి, ధర నిర్ణయించి ఈనెల 15వ తేదీ ఫైనలైజ్ చేస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పడం విడ్డూరంగా ఉంది. రాష్ట్రంలో ఎన్నో పనులు చేసిన వారికి చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, వారి బిల్లులు చెల్లించాలి. రాజధాని ఎక్కడ కడతామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 50 కోట్ల రూపాయలు లే ఔట్ అభివృద్ధి కోసం ఎక్కడ నుంచి తెచ్చి ఇస్తారని రఘు రామ కృష్ణంరాజు ప్రశ్నించారు. రాష్ట్రంలో పూర్తి చేసిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయకుండా, లేఅవుట్ ను అభివృద్ధి చేసి పేదలకు స్థలాలు పంచుతాననడం వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర ఏమిటో స్పష్టం అవుతుంది. గురువారం ఉదయం ఫస్ట్ కోర్టులో అమరావతి రైతులు మెన్షన్ చేశారు. శుక్రవారం 14వ తేదీన లిస్ట్ చేయమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘించరాదు. హైకోర్టు తీర్పు పై సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు. జూలై 11వ తేదీన అమరావతి కేసు సుప్రీంకోర్టులో ఉన్నందున, అప్పటివరకు ఆగమని చెప్పే అవకాశాలు లేకపోలేదు. రైతుల వైపు భగవంతుడు ఉన్నారు. సుప్రీంకోర్టులో రైతులకు న్యాయమే జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ అటవిక, దరిద్రపు, మోసపు కుట్రతో కూడిన చర్యలపై చెప్పుతో కొట్టినట్లుగా తీర్పు ఉంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అమరావతిపై మారీచునికాండ ఆగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో కోర్టుకు ఖచ్చితంగా హాజరు కావాలంటే జగన్ కాలు బెనికింది
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి టైం చూసుకుని కాలు బెనుకుతుందని రఘు రామ కృష్ణంరాజు ఏద్దేవా చేశారు. గతంలో కోర్టుకు కచ్చితంగా హాజరు కావాలని నోటీసులు జారీ చేసినప్పుడు, ఇలాగే కాలు బెణికింది. ఇప్పుడు ఒంటిమిట్ట లో జరిగే శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొనడానికి వెళతాడని అనుకుంటే కాలు బెణికింది. ఈస్టర్ కు ముందు వారం రోజులపాటు హోలీ వీక్ పాటించడం క్రైస్తవ మతస్తుల ఆనవాయితీ. ఈ వారం రోజులలో వారు ఎటువంటి ఉత్సవాలలో పాల్గొనరు. క్రీస్తు మళ్లీ పుట్టాడని ఈస్టర్ సందర్భంగా ఉత్సవాలను జరుపుకుంటారు. కాలు బెణికినప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం కార్యాలయ విధులను నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక వైద్యుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారో, ఏమో చిలకలూరిపేటలో జరిగిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమ ప్రారంభోత్సవ సందర్భంగా అన్ని దినపత్రికలకు అడ్వర్టైజ్మెంట్ లు ఇచ్చారు. కానీ, ఆ అడ్వర్టైజ్మెంట్లలో సంబంధిత శాఖ మంత్రి విడుదల రజిని ఫోటో లేకపోవడం ఆశ్చర్యకరం. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనూ , తాను నియోజకవర్గంలో ఎంపీగా ఎన్నికైన తొలి ఏడాది చురుకుగా తిరిగే సమయములో రెండు మూడు పీహెచ్సీ కేంద్రాలను ప్రారంభించాను. 2012 లో నేషనల్ హెల్త్ మిషన్ ప్రాజెక్టులో భాగంగా అప్పటి యూపీఏ ప్రభుత్వం, నాన్ కమ్యూనల్ డిసీజెస్ సర్వే నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా అమలు చేశారు. మండలానికి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రతి మండల పరిధిలో ఐదు నుంచి పది సబ్ సెంటర్ లను జనాభా ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని నిర్ణయించారు . 1250 నుంచి 1300 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా, ఇప్పుడదే బిల్డింగులలో ఉన్న పీహెచ్సీలకు స్కీమ్ పేరు మార్చి వైయస్సార్ విలేజ్ క్లినిక్ గా నామకరణం చేశారు. సబ్ సెంటర్లకు మరొక పేరు పెట్టి ఉంటారు. ఒక్కొక్క పి హెచ్ సి కి 14 మంది వైద్య సిబ్బంది ఉండాలని నిబంధన పెట్టారు. 1200 పిహెచ్సి లలో 800 మంది డాక్టర్లు లేరు. ఇందులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన డాక్టర్లు తక్కువే. ఎక్కువమంది ఎంబీబీఎస్ డాక్టర్లు ఉంటారు. ఎవరికి ఏ జబ్బు వచ్చినా ఈ డాక్టర్లే ఇంటింటికి వెళ్లి చూస్తారట. వైద్యులు ఇచ్చిన మందులకు జబ్బులు తగ్గకపోతే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించి చికిత్స అందిస్తారట. అక్కడ కూడా నయం కాదని తెలిస్తే వారే అపోలో వంటి కార్పోరేట్ ఆసుపత్రికి తరలిస్తామని పేర్కొంటున్నారు. అదే బిల్డింగులలో అంతకు మునుపు ఇదే తరహాలో వైద్యాన్ని అందించలేదా?, దేశం మొత్తం ఈ మోడల్ కాపీ కొట్టి మన గురించి మాట్లాడుకుంటారని జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉంది. అన్ని పథకాలకు పేర్లను మార్చినట్లుగానే, ఈ పథకానికి కూడా పేరు మార్చి పిట్టలదొర కబుర్లు చెప్పడం విస్మయాన్ని కలిగిస్తోందని రఘురామకృష్ణం రాజు అపహాస్యం చేశారు. ఈ విధానాన్ని విదేశీ ప్రతినిధులకు అందంగా చెబితే, వారు జగన్మోహన్ రెడ్డే ఈ విధానాన్ని తొలుత ప్రవేశపెట్టారని భావించి ఒకవేళ కితాబునిస్తే దాని గురించి సాక్షి దినపత్రికలో గొప్పగా రాసుకుంటారు.
గతంలో నాన్ కమ్యూనల్ డిసీజెస్ సర్వే జరిగిందా? లేదా?అని ప్రశ్నించిన రఘురామకృష్ణం రాజు, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సూది లేదు, దూది లేదు,మాస్కు లేదు, సెలైన్ లేదు అంటూ ప్రభుత్వాన్ని దెప్పి పొడిచారు. కరోనా ఐదవ, ఆరవ వేవ్ వస్తుందని అంటున్నారు. మాస్క్ కావాలని అడిగితే డాక్టర్ సుధాకర్ ను హత్య చేసినట్లుగా, హత్య చేస్తారేమో?. ప్రభుత్వ ప్రాథమిక వైద్య కేంద్రాలలో మందులే లేవు. ముందు కుక్కల నుంచి మనుషులను కాపాడండి. ప్రభుత్వ పెద్దలను వదిలి కుక్కలు కూడా సామాన్యులనే కరుస్తున్నాయి. ఒక్క కరిస్తే, రోగికి వైద్యం అందించడానికి రేబిస్ మందు కూడా అందుబాటులో లేదు. గ్రామీణ ప్రాంత ప్రజలను విష సర్పాలు కాటు వేస్తే, వారిని కాపాడే మందులు కూడా విలేజ్ సబ్ సెంటర్లలో అందుబాటులో లేకపోవడం ప్రజల ప్రాణాల మీదకొస్తుంది. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో పనిచేసే ఇద్దరు వైద్యులలో ఒక్కరు 104 గ్రామాలను తిరిగి వైద్యం అందించాలట. మరొక వైద్యుడు 8 గంటల పాటు రోగులకు అందుబాటులో ఉండాలని జగన్మోహన్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. గతంలో అమలులో ఉన్న దానికి భిన్నంగా, మెరుగైన పథకాన్ని అమలు చేసి డాక్టర్ల పోస్టులను భర్తీ చేసి ప్రజలకు సేవలు అందజేయాలని చూడకుండా, ప్రజల్ని మాయ చేయడానికి జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. ఆర్భాటంగా ప్రారంభించిన తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ ప్రస్తుతం పని చేయడం లేదు. ఆ వాహనాలలో డీజిల్ పోయించడానికి డబ్బులే లేవు. రాష్ట్రంలో ఎక్కడా ఆ వాహనాలు పనిచేసిన దాఖలాలు లేవు. 104 వాహనం జగన్మోహన్ రెడ్డి నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి అమలులో ఉంది. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడులు తమ ప్రభుత్వాల హయాంలో 104 వాహనాలను ప్రవేశపెట్టి, ప్రజలకు సేవలు అందించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందం, మందం, ఆయన అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్ పథకం అమలు తీరు చూసి దుష్ట చతుష్టయం, ఆ దత్తపుత్రుడు ఏడుస్తారట. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్రానికి 500 కోట్ల రూపాయల నిధులు కేటాయించగా, ఆ నిధులను దారి మళ్లించినందుకు 40 కోట్ల రూపాయల జరిమానా తో కూడిన వడ్డీని చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. అయితే వడ్డీ చెల్లించలేమని, ఇకపై అటువంటి పొరపాట్లు చేయమని రాష్ట్ర ప్రభుత్వం సంజాయిషీ ఇచ్చుకుంది. ప్రతి అకౌంట్లోనే డబ్బులను దారి మళ్లించడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్యామిలీ డాక్టర్ పథకానికి జగనన్న vaidya దీవెన అని పెట్టి ఉంటే బాగుండేదని రఘురామకృష్ణం రాజు అపహాస్యం చేశారు. ఖాతాదారులు డబ్బులకు ఐదు రెట్ల భద్రతను కల్పించే మార్గదర్శి సంస్థ, ఖాతాదారుల డబ్బులను దారి మళ్లించిందని సిఐడి అభియోగాలను మోపడం విడ్డూరం. మార్గదర్శి సంస్థ ఎటువంటి తప్పులను చేయలేదు, నిజాలు నిలకడ మీద తెలుస్తాయి. ప్రజలకు ఉపయోగపడే పథకాలను నిలిపివేసి, ఉపయోగపడని పథకాలకు బటన్ నొక్కుతున్నానని చెప్పడం జగన్మోహన్ రెడ్డికి పరిపాటిగా మారింది. జగన్మోహన్ రెడ్డి చెబుతున్న శ్రీరంగనీతుల గురించి ప్రజలు ఆలస్యంగా నైనా తెలుసుకునే అవకాశం ఉంది. ఫ్యామిలీ డాక్టర్ పథకం పచ్చి బూటకమని రఘు రామ కృష్ణంరాజు విమర్శించారు.