– దోచుకునే పనిలో మహిళా మంత్రులు బిజీ
– మహిళల రక్షణ గురించి ఈ ప్రభుత్వానికి కనీస బాధ్యత లేదు
– మహిళలను నమ్మించి మోసం చేసిన కూటమి సర్కార్‌కు బుద్ది చెబుతాం
– సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించాలి
– వైయస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత
– నెల్లూరులో వైయస్ఆర్సీపీ మహిళా విభాగం జోనల్ సమావేశం. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మహిళా నేతలు వరుదు కళ్యాణి, కాకాణి పూజిత
నెల్లూరు: మహిళలను నమ్మించి మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకు రాష్ట్రం లోని మహిళలు సిద్దంగా ఉన్నారని వైయస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితలు స్పష్టం చేశారు.
నెల్లూరులో కాకాణి పూజిత ఆధ్వర్యంలో వైయస్ఆర్సీపీ మహిళా విభాగం జోనల్ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం వరుదు కళ్యాణి, కాకాణి పూజితలు మీడియాతో మాట్లాడారు. కూటమి సర్కార్ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో మహిళలకు కనీస రక్షణ లేకుండా పోయిందని ఈ సందర్భంగా వారు మండిపడ్డారు.
మహిళలను దగా చేసిన ప్రభుత్వమిది
వైయస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి
కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. 16 నెలలుగా మద్యాన్ని ఏరులై పారిస్తూ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నారు. మద్యానికి బానిసలుగా మారి, మహిళల మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు నిత్యం జరుగుతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా అనిపించడం లేదు. నాడు మహిళలకు రక్షణగా నిలబడిన దిశ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఇలాంటి ప్రభుత్వానికి ఎందుకు ఓటేశామా అని ప్రతి మహిళలోనూ పశ్చాత్తాపం కనిపిస్తోంది.
ప్రతి మంగళవారం అప్పులు చేస్తూ కూడా ఒక్క పథకాన్ని అమలు చేసిన పాపానపోవడం లేదు. మహిళలకు అండగా నిలబడాలని వైయస్సార్సీపీ మహిళా విభాగం నిర్ణయించింది. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, మహిళలకు జరుగుతున్న మోసాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు గడిచిన ఐదేళ్ల వైయస్సార్సీపీ పాలనలో వైయస్ జగన్ మహిళలకు ఏవిధంగా అండగా నిలబడ్డారో ఇంటింటికీ వివరిస్తాం.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేదని చెప్పుకుంటూనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్, మంత్రి నారా లోకేష్‌లు మాత్రం స్పెషల్ ఫ్లైట్లు, హెలిక్యాప్టర్ లలో విహరిస్తున్నారు. సాక్షాత్తు జూనియర్ ఎన్టీఆర్ తల్లిని టీడీపీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే చెప్పలేని భాషలో తిడితేనే అతడి మీద చర్యలు తీసుకోలేదు. రూ. 5 కోట్లు ఖర్చు చేసి తన తల్లిని టీడీపీ వారితో తిట్టించారని గతంలో పవన్ కళ్యాణ్ కూడా స్వయంగా చెప్పాడు.
ముగ్గురు మహిళా మంత్రులుండి కూడా మహిళలకు మేలు జరగడం లేదు. రౌడీలకు పెరోల్ ఇప్పించి సొమ్ము చేసుకోవడంలో ఒక మంత్రి, కుట్టు మిషన్ పేరుతో దోచుకోవడంలో మరో మహిళా మంత్రి, వరలక్ష్మీ వ్రతం పేరుతో కానుకలు కొల్లగొట్టేయడంలో ఇంకో మహిళా మంత్రి బిజీగా ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలంతా కూటమి (కే ట్యాక్స్) ట్యాక్స్ వసూలు చేయడంలో బిజీగా ఉన్నారు. ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా తన వారికి కట్టబట్టేస్తున్నారు.
మహిళల మీద చెయ్యేస్తే తాట తీస్తామని హెచ్చరించే పవన్ కళ్యాణ్.. సుగాలి ప్రీతి కేసును రాజకీయాలకు వాడుకున్నాడు. అధికారంలోకి వచ్చాక సుగాలి ప్రీతి కేసును ప్రథమ ప్రాధాన్యంగా స్వీకరించి న్యాయం చేస్తానని అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాన్.. 16 నెలలుగా సుగాలి ప్రీతి కేసు గురించి ప్రస్తావించలేదు. కనీసం సుగాలి ప్రీతి తల్లి పార్వతికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. పవన్‌కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే సుగాలి ప్రీతి కేసులో సీబీఐ విచారణకు కేంద్రాన్ని కోరాలి.
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు
– వైయస్సార్సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత
ఆడవారి మీద చెయ్యేస్తే అదే ఆఖరి రోజు అవుతుందని మైకుల ముందు గొప్పగా ఊదరగొడుతున్నారు. మహిళలకు అన్యాయం జరిగితే అండగా ఉండి ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కళ్యాన్ పత్తా లేకుండా పోయాడు. ప్రశ్నించిన వారి మీద కక్షకట్టి అక్రమ కేసులు పెట్టడమే ఈ ప్రభుత్వం పనిగా పెట్టుకుంది. చంద్రబాబు ఈ ఏడాది పాలనలో వేధింపులకు ఏ కుటుంబం కూడా మినహాయింపు కాదు. వైయస్ జగన్‌ని సీఎం చేసేదాకా మహిళలమంతా ఈ ప్రభుత్వంపై పోరాడతామని కాకాణి పూజిత స్పష్టం చేశారు.