– మంత్రి నారాయణ హామీ
– ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్ వెల్లడి
ఉయ్యూరు: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన టిడ్కో ఇళ్లను త్వరలోనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఉయ్యూరు నగర పంచాయతీ ఏరియాలో నిర్మించిన టిడ్కో ఇళ్ల పనులను మొదటి విడతలో పూర్తి చేయాలని మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పి. నారాయణని అమరావతి సెక్రటేరియట్ లో కలిసి వినతి పత్రం ఇచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి నారాయణ తప్పకుండా మొదటి విడతలో మీ ఉయ్యూరు నగర పంచాయతీ ఏరియాలో నిర్మించిన టిడ్కో ఇళ్ల పనులు పూర్తి చేసే విధంగా చూస్తానని… అలాగే వచ్చే జనవరి లేక ఫిబ్రవరి కల్లా 500, 12500 రూపాయలు కట్టిన లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను పూర్తి చేసి అందిస్తామని, తరువాత 25,000 వేలు కట్టిన లబ్ధిదారులకు కూడా రెండో విడతలో ఇస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు.
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గత కొన్ని రోజుల క్రితం ఉయ్యూరు లోని 20 వార్డుల్లో పర్యటించామని, దానిలో భాగంగానే టిడ్కో ఇళ్లకు డబ్బులు కట్టిన లబ్ధిదారులు అన్ని వార్డుల్లో ఈ ఇళ్ల సమస్యను మా దృష్టికి తీసుకువచ్చినట్టు తెలిపారు.
ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ ఉయ్యూరు నగర పంచాయతీ ఏరియాలో దాదాపుగా 3000 వేల టిడ్కో ఇళ్ళ నిర్మాణం గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో 90 శాతం జరిగిందని, తదుపరి వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ఇళ్ల నిర్మాణాన్ని నిలిపివేశారన్నారు.