– బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన
హైదరాబాద్: కరువు కాటేయడం లేదు.కాలువల్లో నీళ్లు వారించకుండా కాంగ్రెస్ కాటేస్తున్నది.కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోయకుండా కక్షగట్టిన సర్కార్ నిర్లక్ష్యం మూలంగా కాలువల్లో నీళ్లకు బదులు రైతుల కన్నీళ్లు పారుతున్నాయి.
అద్దాలమేడలో ఊరేగుతున్న అబద్దాల కాంగ్రెస్ మూలంగా అంధకారంలో తెలంగాణ రైతన్న ఆందోళన చెందుతున్నాడు.
దశాబ్దాల పాలనలో దండగ చేసిన వ్యవసాయాన్ని
దశాబ్ద బీఆర్ఎస్ పాలనలో పండగ చేస్తే ..
ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో తిరిగి దండగ చేశారు .
కానీ పండగల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఊరేగుతున్నది.బీఆర్ఎస్ పాలనలో వచ్చిన కాళేశ్వరం నీళ్లు.. కాంగ్రెస్ పాలనలో ఎందుకు రావడం లేదని రైతన్నలు ప్రశ్నిస్తున్నారు.
దాదాపు ఆరువందల మీటర్ల ఎత్తున ఎగిసిన కాళేశ్వరం నీళ్లు సుమారు 450 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సూర్యాపేట జిల్లాలోని పెన్పహాడ్ మండలంలో రావిచెరువు వరకు చేరి రైతుల పొలాలను తడిపిన నీళ్లు నేడెందుకు పారడం లేదని రైతన్నలు ప్రశ్నిస్తున్నారు.
శ్రీరాంసాగర్ కింద 2001లో పూర్తయిన కాకతీయ వరద కాలువ 22 ఏళ్ల తర్వాత కాళేశ్వరం ఎత్తిపోతల మూలంగా 153 కిలోమీటర్లు ప్రయాణించి చివరి ఆయకట్టుకు చేరాయి
కానీ నేడు మేడిగడ్డ మరమ్మతులు చేయకుండా, కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీళ్లు ఎత్తిపోసి సాగునీరు ఇచ్చే అవకాశం ఉన్నా, కాంగ్రెస్ సర్కార్ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంతో అటువైపు కన్నెత్తి చూడడం లేదు.
వ్యవసాయంపై కక్షగట్టిన కాంగ్రెస్ సర్కార్ రైతన్నలకు శిక్ష వేస్తున్నది. కాంగ్రెస్ కుట్రలను చేధిస్తాం.తెలంగాణ రైతన్నలను కాపాడుకునేందుకు నిరంతరం పోరాడతాం.