తిరుపతి నగరపాలక సంస్థలో అధికారుల పాలకుల తీరు చూస్తే “కంచే చేను మేసినట్లు” తయారైంది. నగరపాలక సంస్థకు ఆస్తి పన్నుల రూపంలో ప్రజలు కట్టే ప్రతి పైసాకి అధికారులు, పాలకులు జవాబుదారితనంగా వ్యవహరించాలే తప్ప “అత్త సొత్తు అల్లుడు దానం చేసినట్లు”ఆరోగ్యశాఖ వాహనాలను సకాలంలో రిపేర్లు చేయించక తుప్పు పట్టి పోయిందన్న సాకుతో ఇష్టం వచ్చినట్లు నిబంధనలకు విరుద్ధంగా వేలం వేసి అమ్మే హక్కు లేదన్నారు! తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ పేరుతో రిజిస్టర్ అయి వేలం వేయని చెత్త తరలింపు లారీ సూళ్లూరుపేట వద్ద ఉండడం పత్రికలో రావడం పలు అనుమానాలు కలుగుతున్నాయి దీనిపై విజిలెన్స్ అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టాలి!
తిరుపతి మాస్టర్ ప్లాన్ రోడ్లలో భాగంగా ల్యాండ్ అక్విజేషన్ ద్వారా ఎంత మందికి TDR (TRANSFERABLE DEVELOPMENT RIGHTS) బాండ్స్ ఇచ్చారు? ఏ ప్రాతిపదికన ఇచ్చారు? మిగిలిన వారికి ఎందుకు ఇవ్వలేదు? అన్నదానిపై ప్రజలలో అనేక అనుమానాలు ఉన్నాయి! తిరుపతి అభివృద్ధి చెందాలంటే మాస్టర్ ప్లాన్ రోడ్లు అవసరం కానీ ఒక్కొక్కటిగా ప్రణాళిక బద్ధంగా నగరపాలక సంస్థకు స్మార్ట్ సిటీ ఇస్తున్న నిధులకు తగ్గట్టుగా ఒక మాస్టర్ ప్లాన్ రోడ్డును మోడల్ గా తీసుకొని భూగర్భ డ్రైనేజీ,భూగర్భ విద్యుత్ కేబుల్స్,రోడ్డు పక్కన కాలువలు,త్రాగునీటి కనెక్షన్లు,వీధి దీపాలు పూర్తి చేసి మరొక మాస్టర్ ప్లాన్ రోడ్డును ప్రారంభిస్తే నిధుల కొరత లేకుండా సకాలంలో అన్ని రోడ్లు పూర్తవుతాయి లేదంటే అరకొరగా అసంపూర్తిగా మిగిలిపోయి ప్రజలకు అసౌకర్యంగా మారుతుంది!
తిరుపతి నగరపాలక సంస్థలో ఇటీవల కూల్చేసిన పాత భవన నిర్మాణపు స్క్రాప్ (ఇనుము ఇతర సామగ్రి)ను అడ్డగోలుగా నిబంధనలకు విరుద్ధంగా కారు చౌకగా వేలం వేసి అమ్మేయడం ప్రజలు గమనిస్తున్నారు! తిరుపతి స్మార్ట్ సిటీ నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులపై కేంద్ర రాష్ట్ర విజిలెన్స్ నిఘా సంస్థలు దృష్టి సారించి నగరంలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన పనులు జరుగుతున్నాయా, కాంట్రాక్టర్ లకు సకాలంలో చెల్లింపులు సక్రమంగా చెల్లిస్తున్నారా లేక కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న స్మార్ట్ సిటీ నిధులను ప్రక్కదోవ పట్టిస్తున్నారా అన్న కోణంలో విచారణ జరపాలి!
నగరపాలక సంస్థకు స్మార్ట్ సిటీ కోసం కేంద్రం నుంచి ఇప్పటివరకు ఎన్ని వందల కోట్ల నిధులు వచ్చాయి?వాటిని ఎక్కడ ఖర్చు పెట్టారు? ఎంత ఖర్చు పెట్టారు? ఇంకా కేంద్రం నుంచి రావాల్సిన స్మార్ట్ సిటీ నిధులు ఎంత అన్నదానిపై నగరపాలక సంస్థ అధికారులు పాలకులు ప్రజలకు తెలిసేలా శ్వేత పత్రం విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కేంద్రం నుంచి స్మార్ట్ సిటీ నిధులను పూర్తిగా రాబట్టే ప్రయత్నం చేయాలి! తిరుపతి స్మార్ట్ సిటీ నిధుల వినియోగంపై,నిధుల విడుదల జాప్యంపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకి నగర ప్రజల తరఫున లేఖ రాస్తున్నాను!
– నవీన్ కుమార్ రెడ్డి
రాయలసీమ పోరాట సమితి కన్వీనర్
ఐ ఎన్ టి యు సి జిల్లా గౌరవాధ్యక్షులు