సీఎం కావాలంటే చిన్నాయన హత్యకు గురవ్వాలి..
ఇదీ జగన్మోహన్ రెడ్డి స్టాటజీ!
నెల్లూరు: పులివెందులలో ప్రజాస్వామ్యం బతకడాన్ని ఓర్చుకోలేకపోతున్న జగన్ రెడ్డి.. చంద్రబాబు నాయుడిపై నోటికొచ్చినట్టు వ్యాఖ్యలు చేయడం తగదు అని సర్వేపల్లి శాసన సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే… వంగి కొబ్బరికాయ కొట్టలేనటు వంటి వ్యక్తి మా నాయకుడి వయస్సు గురించి మాట్లాడటమా? నోరు అదుపులో పెట్టుకోకపోతే జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఫలితం అనుభవించక తప్పదు.
ఇవే చివరి ఎన్నికలు అని, కృష్ణారామ అని జపం చేసుకోవాలని, నరకానికి పోతారని అంటూ చంద్రబాబు నాయుడుపై నోరు పారేసుకుంటున్నారు. కుప్పం ఎన్నికల్లో అరాచకంతో గెలిచి ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గురించి హేళనగా మాట్లాడారు. రాముడు, కృష్ణుడు జపం చేసుకుంటూ ఇంట్లో కూర్చోలేదు..అనుక్షణం లోక కల్యాణం కోసం తపించారు. చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల కోసం నిత్యం పోరాటం సాగిస్తున్నారు. క్రమశిక్షణ, కష్టపడేతత్వానికి మారుపేరైన చంద్రబాబు నాయుడు పేరెత్తే అర్హత జగన్ రెడ్డికి లేదు.
జగన్ రెడ్డితో పాటు ఆయన అనుచరుల సంగతి తేల్చే బాధ్యత యువనాయకుడు లోకేష్ చేపట్టారు. వైసీపీ పాలనలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా అరాచకాలు సృష్టించి నామినేషన్లు వేయలేని పరిస్థితి కల్పించారు. ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నిక ప్రజాస్వామ్యయుతంగా జరుగుతుంటే ఓర్చుకోలేక ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు.
వంగి కొబ్బరికాయ కొట్టలేనటువంటి జగన్ రెడ్డి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడటం బాధగా ఉంది. రోజులో 12 గంటలు నిరంతరంగా పనిచేయగల శక్తి మా చంద్రబాబు నాయుడి సొంతం. నిరంతరం ఆయన ప్రజల కోసమే తపిస్తుంటారు. ఇంటర్నేషనల్ స్కాం అయిన లిక్కర్ కేసులో సిట్ రోజుకో అంశాన్ని వెలికితీస్తుండటంతో గందరగోళానికి గురవుతున్న జగన్ రెడ్డి నోటిపై అదుపు కోల్పోతున్నారు.
రాజకీయాల్లోకి రావాలంటే నాయన చనిపోవాలి… సీఎం కావాలంటే చిన్నాయన హత్యకు గురవ్వాలి..ఇదీ జగన్మోహన్ రెడ్డి స్టాటజీ. ప్రజాసేవలో ఎంతో అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు బ్యాక్ గ్రౌండ్ ఏమిటి..జగన్ రెడ్డి బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఇకనైనా గుణపాఠం నేర్చుకుని మాట్లాడాలని జగన్మోహన్ రెడ్డికి హితవు పలుకుతున్నాం..లేదంటే అనుభవించక తప్పదు.