• బీసీల పథకాలు…ప్రయోజనాలకు గండి కొట్టి వారిని శాశ్వతంగా తన బ్లాక్ మెయిల్ రాజకీయాలకు వాడుకోవడానికే జగన్ రెడ్డి తన జేబు సంస్థలతో తూతూమంత్రంగా కులగణన చేయాలని చూస్తున్నాడు
• కులగణన..జనగణన పేరుతో ప్రజల వివరాలు సేకరించే అధికారం వాలంటీర్లకు.. ముఖ్యమంత్రికి ఎవరిచ్చారు
• జాతీయ బీసీ కమిషన్ అనుమతితో.. రిటైర్డ్ జస్టిస్ నేత్రత్వంలోని కమిటీ నిబంధనల ప్రకరామే కులగణన వివరాలు సేకరిస్తున్నారా?
• వైసీపీ ఎంపీలు నేరుగా ప్రధానిని కలిసి కులగణన గురించి తెలియచేసి ఆమోదం పొందాకే బీసీల వివరాలు సేకరించాలి
• జగన్ రెడ్డి మెప్పుపొంది.. తన స్వప్రయోజనాలు నెరవేర్చుకోవడానికే ఆర్.కృష్ణయ్య బీసీల జపం చేస్తున్నాడు
• జగన్ రెడ్డి దమనకాండకు, దుర్మార్గపు పాలనకు బీసీలు బలైనప్పుడు వేలాది బీసీకుటుంబాలు రోడ్డునపడినప్పుడు కృష్ణయ్య ఎక్కడున్నాడు?
• బీసీ సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించినప్పుడు.. దాదాపు 70మందికి పైగా బీసీ కీలకనేతల్ని దుర్మార్గంగా జగన్ రెడ్డి చంపించినప్పుడు కృష్ణయ్య ఎందుకు నోరెత్తలేదు
• బీసీల ప్రతినిధినని చెప్పుకోవడం తప్ప రాజ్యసభ సభ్యుడిగా ఏనాడైనా జగన్ ప్రభుత్వం బీసీలకు చేస్తున్న ద్రోహంపై కృష్ణయ్య పార్లమెంట్లో గొంతు విప్పాడా?
• జగన్ రెడ్డి బీసీలకు చేస్తున్న ద్రోహం… దుర్మార్గం చూశాక కూడా వైసీపీలోని బీసీనేతలు.. మంత్రులు ఏ ముఖంపెట్టుకొని సిగ్గులేకుండా అధికారపార్టీలో ప్రభుత్వంలో కొనసాగుతున్నారో వారే చెప్పాలి
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర
ఎన్నికల్లో లబ్ధి పొందడానికే జగన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను వంచిస్తూ తన పార్టీ పెయిడ్ ఆర్టిస్ట్ లతో సామాజిక సాధికార బస్సుయాత్ర నిర్వహిస్తున్నా డని, ఎలాగైనా మరలా అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి ఉవ్విళ్లూరుతుంటే , వైసీపీలోని బీసీ నేతలు, మంత్రులు నిస్సిగ్గుగా ఆయనకు వంతపాడుతున్నా రని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
“ రాష్ట్రంలోని బీసీనేతలు చాలరన్నట్టు తెలంగాణలో ఉండే ఒక వ్యక్తి, ఏపీలో ఒక బీసీ సంఘం నిర్వహిస్తూ, దాని ముసుగులో మొత్తం బీసీలను జగన్ రెడ్డికి తాకట్టు పెట్టి రాజ్యసభసభ్యుడిగా పదవి పొంది తన ప్రయోజనాలకోసం పాటు పడుతున్నాడు. సదరు నాయకుడు నేడు బీసీలను తెలుగుదేశానికి దూరం చేయడం కోసం కొత్త కుట్రలకు తెరలేపాడు. తెలంగాణ రాష్ట్రానికి తొలి బీసీ ముఖ్య మంత్రిగా ఆర్.కృష్ణయ్య పేరుని ప్రకటించింది తెలుగుదేశం పార్టీనే. బ్లాక్ మెయిల్ రాజకీయాలకే పరిమితమైన ఆర్.కృష్ణయ్య పద్ధతి మార్చుకొని బీసీలకు న్యాయంచేస్తాడని నమ్మి ఎమ్మెల్యేగా గెలిపించి శాసనసభకు పంపిస్తే ఆయన ఏనాడూ తన వర్గాల కోసం గొంతెత్తింది లేదు.
జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేస్తుంటే ఏనాడైనా కృష్ణయ్య బీసీల తరుపున ముఖ్యమంత్రిని ప్రశ్నించాడా? బీసీ సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించినా, రాజ్యాంగపరంగా బీసీలకు దక్కాల్సిన స్థానిక సంస్థల పదవులు దక్కకుండా చేసినా, బీసీల రిజర్వేషన్లకు కోతపెట్టినా ఏనాడూ ఆర్.కృష్ణయ్య, జగన్ రెడ్డిని ఒక్కమాట అన్నది లేదు. ప్రజలతో ఎన్నుకోబడిన బీసీ సర్పంచ్ లు.. ఇతర ప్రజాప్రతినిధులు ప్రజలసంక్షేమానికి వెచ్చించాల్సిన నిధుల్ని జగన్ రెడ్డి మింగేస్తుంటే కృష్ణయ్యకు కనిపించడం లేదా?
పదవుల్లో బీసీలకు జగన్ రెడ్డి తీవ్ర అన్యాయం చేసినప్పుడు కృష్ణయ్య ఎందుకు స్పందించలేదు?
ప్రభుత్వ సలహాదారుల్లో.. నామినేటెడ్ పోస్టుల్లో.. విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్ లర్లుగా బీసీలకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఏనాడూ జగన్ రెడ్డిని కృష్ణ య్య ఎందుకు ప్రశ్నించలేకపోయాడు. బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలను ఉత్సవ విగ్రహాలుగా మార్చి, వారిపై అధికారాన్ని తన వర్గం వారికి కట్టబెట్టిన జగన్ రెడ్డి నియంత్రత్వ పోకడలు కృష్ణయ్యకు కనిపించడంలేదా? నామమాత్రంగా 56 బీసీ కార్పొరేషన్లు పెట్టి, వాటికి ఛైర్మన్లు, డైరెక్టర్లుగా నియమించిన వారిని ఉత్తబొమ్మలుగా మార్చిన జగన్ రెడ్డి అహంకారాన్ని బీసీల ప్రతినిధినని చెప్పుకునే కృష్ణయ్య ఏనాడూ ఎందుకు నిలదీయలేదు?
కృష్ణయ్య లాగా బీసీల్ని రాజకీయాలకు.. స్వార్థానికి వాడుకునే ఆలోచన టీడీపీ బీసీనేతలకు లేదు
రేపల్లెలో బీసీ బాలుడు అమర్నాథ్ గౌడ్ ను దారుణంగా పెట్రోల్ పోసి తగలబెట్టి చంపినప్పుడు కృష్ణయ్యకు బీసీలు గుర్తురాలేదు. తెలుగుదేశం పార్టీకి మద్ధతుగా సైకిల్ యాత్ర చేస్తున్న బీసీ సోదరుల్ని పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గూండాలు దారుణంగా బట్టలు విప్పి అవమానిస్తే కృష్ణయ్యలో చలనం లేదు. నెల్లూరుజిల్లా కావలి వద్ద ఆర్టీసీ డ్రైవర్ని వైసీపీ నాయకుడు చావగొడితే మానవత్వంగా కూడా కృష్ణయ్య మాట్లాడలేదు. ధర్మవరం వస్త్ర వ్యా పారులు తమకు రావాల్సిన బకాయిలకోసం విజయవాడకు వస్తే… వారికి డబ్బు ఇవ్వకుండా కొట్టి అవమానిస్తే దానిపై కృష్ణయ్య ఎందుకు స్పందించలేదు?
జగన్ ప్రభుత్వంలో బీసీలపై నిత్యం రాష్ట్రంలో ఏదోఒకమూల ఏదో ఒక దారుణం జరుగు తూనే ఉన్నా బీసీల నాయకుడిని అని చెప్పుకునే కృష్ణయ్య ఎందుకు నోరెత్తడం లేదు? పార్టీలకతీతంగా పనిచేసే బీసీనాయకులు.. టీడీపీలోనికీలక బీసీ నేతలపై జగన్ రెడ్డి తప్పుడు కేసులు పెట్టి.. అన్యాయంగా జైలుకు పంపిననాడు కృష్ణయ్యకు బీసీలపై జరుగుతున్నదారుణాలు కనిపించలేదా? నాపై.. అచ్చెన్నాయుడిపై.. యనమల రామకృష్ణుడు.. అయ్యన్నపాత్రుడిపై వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులపై కృష్ణయ్య ఏనాడూ ఎందుకు ముఖ్యమంత్రిని ప్రశ్నించలేదు?
బీసీ మహిళలైన పంచుమర్తి అనురాధ.. ఆదిరెడ్డి భవానీ వంటి వారిని జగన్ రెడ్డి.. అతని ఎమ్మెల్యేలు.. వైసీపీనేతలు దారుణంగా అవమానించి న విషయం కృష్ణయ్యకు గుర్తులేదా? బీసీ నాయకులమైన మేం ఎప్పుడూ బీసీలపక్షానే నిలుస్తాం. కృష్ణయ్యలాగా పదవులకోసం.. స్వ ప్రయోజనాలకోసం బీసీల్ని వాడుకొని రాజకీయంగా ఎదిగే దుర్బుద్ధి తమకు లేదు.
రాజ్యసభ సభ్యుడిగా ఉండి రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై కృష్ణయ్య పార్లమెంట్లో ఏనాడూ ఎందుకు మాట్లాడలేదు?
కేంద్రప్రభుత్వం నుంచి బీసీల సంక్షేమానికి రావాల్సిన నిధులు రాకపోయినా.. వచ్చిన వాటిని సద్వినియోగం చేయకుండా దారిమళ్లిస్తున్నా రాజ్యసభ సభ్యుడి గా ఉన్న కృష్ణయ్య ఏనాడూ ఎందుకు పార్లమెంట్లో బీసీలకు జరిగే అన్యాయంపై మాట్లాడలేదు? పాఠశాలల విలీనం పేరుతో బీసీ పిల్లలకు ప్రాథమిక విద్యను దూరం చేసిన జగన్ రెడ్డి నిర్వాకం కృష్ణయ్యకు కనిపించడం లేదా? బీసీ విద్యార్థు లు, యువతకోసం టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు.. విదేశీవిద్య…స్టడీ సర్కిళ్లను జగన్ రెడ్డి రద్దుచేయడంపై కృష్ణయ్య ఏం సమాధానం చెబుతాడు?
కృష్ణయ్య ఒక్కడే కాదు.. వైసీపీలోని బీసీ నేతలు.. బీసీ మంత్రులు.. గ్రామ, మండలస్థాయి నేతలు జగన్ రెడ్డి బీసీలకు ఇంత అన్యాయంచేస్తున్నా.. తప్పుడు కేసులతో వారిని వేధిస్తున్నా ఏ ముఖం పెట్టుకొని సిగ్గులేకుండా వైసీపీలో కొనసాగుతున్నారని ప్రశ్నిస్తున్నా. అధికారంలోకి వచ్చాక 70మందికి పైగా బీసీనేతల్ని దారుణంగా చంపించిన జగన్ రెడ్డి లాంటి బీసీ ద్రోహికి.. బీసీల పథకాలు.. వారి రాజకీయపదవుల్ని దూరం చేసిన బీసీ వంచకుడికి వత్తాసు పలకడం అంటే బీసీలను దారుణంగా వంచించడమేనని వైసీపీలోని బీసీనేతలు.. బీసీ మంత్రులు గ్రహించాలి.
బస్సుయాత్ర నిర్వహణ..పర్యవేక్షణకు కూడా బీసీలు పనికిరారా జగన్ రెడ్డి?
జగన్ రెడ్డి .. అతని ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడానికి.. ఇతర కీలక పదవుల్లో కొనసాగడానికి బీసీలు పనికిరారా? సామాజిక సాధికార బస్సుయాత్ర నిర్వహణను.. దాని పర్యవేక్షణ ఏర్పాట్లను ఏరికోరి తనవర్గం వారికి.. బీసీయేతర వర్గాలకు కట్టబెట్టిన జగన్ రెడ్డి ఏ విధంగా బీసీలకు మేలు చేశాడో..చేస్తున్నాడో అధికారపార్టీలోని బీసీ నేతలు.. బీసీ మంత్రులు చెప్పాలి. బీసీల స్వాధీనంలో ఉన్న 14లక్షల ఎకరాల అసైన్డ్ భూముల్ని కొల్లగొట్టినా జగన్ రెడ్డిని ప్రశ్నించలేని వైసీపీ బీసీ నాయకత్వం బీసీలకు అవసరమా?
రాష్ట్రంలో చేపట్టబోయే కులగణను ప్రధాని దృష్టికి తీసుకెళ్లి, కేంద్రప్రభుత్వ అనుమతి పొందాలి
బీసీలను బ్లాక్ మెయిల్ చేయడానికే జగన్ రెడ్డి కొత్తగా కులగణన నాటకం మొదలెట్టాడు. బీసీలకు అసలు ఎలాంటి భవిష్యత్ లేకుండా చేయాలన్న దుష్ట ఆలోచనతోనే జగన్ కులగణనను తెరపైకి తెచ్చాడు. కులగణన..జనగణన పేరుతో ప్రజల వివరాలు సేకరించే అధికారం వాలంటీర్లకు ఎవరిచ్చారు. కులగణ న అనేది చట్టబద్ధంగా న్యాయప్రకారం జరగాలి. జాతీయ బీసీ కమిషన్ అనుమతి తో.. రిటైర్డ్ జస్టిస్ నేత్రత్వంలోని కమిటీ పర్యవేక్షణలో బాధ్యతగల ప్రభుత్వాధి కారులు చేయాల్సిన కులగణనను ఎఫ్.ఓ.ఏ (ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ) లో భాగమైన రామ్ ఇన్ ఫో టెక్ సంస్థ ద్వారా చేయించడం ముమ్మాటికీ చట్ట విరుద్ధమే.
జగన్ రెడ్డి మొక్కుబడిగా చేపట్టబోతున్న కులగణన ముమ్మాటికీ బీసీలను వంచించడానికి చేస్తున్నదే. వాలంటీర్లు అడిగితే వేలిముద్రలు ఎందుకు వేయాలి? వారు అడిగితే ఓటీపీ వివరాలు ఎందుకు చెప్పాలి? వారికిచ్చే ప్రతి సమాచారం అంతిమంగా మనకే చేటు చేస్తుందని ప్రతి బీసీ కుటుంబం గుర్తించాలి. అభిప్రాయసేకరణ పేరుతో నిర్వహిస్తున్న సభలు.. సమావేశాల్ని వైసీపీ కార్యక్రమాల్లా మార్చి బీసీలు నోరెత్తకుండా చేస్తున్నారు. కులగణనలోని లోటుపాట్లు..సాధ్యాసాధ్యాలపై ఎక్కడా బీసీలకు.. సంఘాల నేతలకు మాట్లాడే అవకాశం ఇవ్వడంలేదు. వైసీపీలోని బీసీ నేతలు.. పార్లమెంట్ సభ్యులు నేరుగా కేంద్రప్రభుత్వాన్ని కలిసి జగన్ ప్రభుత్వం చేపట్టబోతున్న కులగణన దేనికోసమో.. ఎందుకోసమో..ఎంత వరకు చట్టబద్ధమో తెలుసుకోండి.
బీహార్లో ఏం జరిగిందో చూశాం. అక్కడి రాష్ట్రప్రభుత్వం ఇలానే కులగణన చేసినా అది ఎందుకు అమలుకు నోచుకోలేదో ఆలోచించండి. అధికారపార్టీలోని బీసీనేతలు.. మంత్రులు… పార్లమెంట్ సభ్యులతో పాటు మొత్తం ఎంపీలంతా ప్రధానిని కలిసి బీసీలకోసం, వారి సంక్షేమం కోసం కులగణన చేయాల్సిన అవసరముందని చెప్పి ఒప్పించండి. అది చేయకుండా కేవలం బీసీలను గుప్పెట్లో పెట్టుకొని ఆడించాలనో… వారిని బ్లాక్ మెయిల్ చేయాలనో..వారికి రావాల్సిన పథకాలు..నిధులు రాకుండా చేయాలనో ఇలాంటి గణనలు చేపడితే వాటిని ఎట్టిపరిస్థితుల్లో ముందుకు సాగనివ్వం.” అని రవీంద్ర తేల్చిచెప్పారు.