-నిరర్ధకంగా మారిన యూనిట్లను మరలా నిలబెట్టే ‘కో ఆర్డినేటెడ్ గ్రోత్ పాలసీ’ (సీజీపీ) : ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి
-అర్హులైన వారు పారిశ్రామిక భూములను బహుళ అవసరాలకు వినియోగించుకునే అవకాశం : ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది
-కో–ఆర్డినేటెడ్ గ్రోత్ పాలసీని స్వాగతిస్తున్న పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు
-పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల ప్రగతే లక్ష్యంగా ఏపీఐఐసీ సరికొత్త సంస్కరణలు, నిర్ణయాలు
-ఆటోనగర్ లను పరిశీలిస్తూ అక్కడి పరిస్థితులపై సమీక్షిస్తోన్న ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి
-కృష్ణాజిల్లా జగ్గయ్యపేట ఆటోనగర్ ఛైర్మన్ లో మెట్టుగోవింద రెడ్డి పర్యటన
అమరావతి : పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, పరిశ్రమల ప్రగతే లక్ష్యంగా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న విధానాలకు శ్రీకారం చుడుతోంది. పరిశ్రమలకు, యజమానులకు ఎప్పుడు ఎలాంటి కష్టమొచ్చినా వాటిని పరిష్కరించి.. తద్వారా వారికి మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటూ సరికొత్త సంస్కరణలకు నాంది పలుకుతోంది.
రాష్ట్రంలోని ఆటోనగర్లతో పాటు ఏపీఐఐసీ పారిశ్రామిక వాడలు, ఎస్టేట్‌లలో దివాలా తీసిన పరిశ్రమలు(సిక్ ఇండస్ట్రీస్), యూనిట్ల భూములను బహుళ అవసరాలకు వినియోగించునే విధంగా ‘కో–ఆర్డినేటెడ్ గ్రోత్ పాలసీ’ని తీసుకువచ్చినట్లు ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి వెల్లడించారు. గతంలో ఎక్కడో నగరాలు, పట్టణాల చివర్ల ఉన్న ఆటోనగర్‌లు, పారిశ్రామిక పార్కుల చుట్టూ ఇప్పుడు నివాస ప్రాంతాలు వచ్చేశాయి. దీంతో ప్రజలు, పారిశ్రామికవేత్తలు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాధాన్యతలు,పరిస్థితులు మారాయి. వంశపారంపర్యంగా కొనసాగే చేతివృత్తులు కూడా మారాయి.
ఇతర రంగాలలో ఉపాధి అవకాశాలు పెరిగాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆటోనగర్లలోని యూనిట్లదారుల నుంచి ఆ భూములను రెసిడెన్షియల్, వాణిజ్య అవసరాలకు వినియోగించుకునే వెసులుబాటు కల్పిస్తోందని ఛైర్మన్ పేర్కొన్నారు. ఆటో నగర్లలో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను పారిశ్రామికవేత్తల స్పందనలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని ఆటోనగర్ లో పర్యటించి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ఆటోనగర్ లలో సమస్యలు, ఇబ్బందులపై స్థానిక పారిశ్రామికవేత్తలతో మాట్లాడి తెలుసుకున్నారు.
ఏళ్ళుగా పనులు స్తంభించి, ఆర్థిక ఇబ్బందులతో నిలిచిన యూనిట్లు అనేకం. అర్హత ఉండి చక్కదిద్దేందుకు సామర్థ్యం లేక నగరం మధ్య యూనిట్లు నడపడం కష్టంగా ఉన్న వారు స్వచ్ఛందంగా ముందుకు రావాలంటూ గత ఫిబ్రవరి 4వ తేదీన జీవో నంబర్ 5,6 లను పరిశ్రమల శాఖ విడుదల చేసినట్లు ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది వెల్లడించారు. ఇలాంటి వారు భూముల వినియోగ మార్పిడికి మార్కెట్ విలువలో 50 శాతం ఫీజుగా చెల్లించేలా పరిశ్రమల శాఖ జీవో విడుదల చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. లేదా, డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో… మొత్తం కేటాయింపులో 50 శాతం భూమిని ఏపీఐఐసీకి తిరిగి ఇచ్చేలా వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు.
పారిశ్రామికంగా వినియోగించాల్సిన ఆ భూమిని ఇతర అవసరాలకు వినియోగించుకోవడానికి ఏపీఐఐసీ నిరభ్యంతర సర్టిఫికెట్ ఇస్తుందన్నారు. అదే సొంతంగా భూమిని కొనుగోలు చేసుకున్న పారిశ్రామిక యూనిట్ల భూ వినియోగ మార్పిడికి మార్కెట్ విలువలో 15 శాతం ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందని ఎండీ స్పష్టం చేశారు.
గతం..ప్రస్తుతం..రేపటికోసం
ఆంధ్రప్రదేశ్ లో ఆటోనగర్లు, పారిశ్రామికవాడలు దశాబ్దాల క్రితం ప్రారంభమయ్యాయి. జీవోల ప్రకారం అర్హత కలిగిన ఆటోనగర్‌లు, పారిశ్రామికవాడలు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 160కి పైగా ఉన్నాయి. గతంలో ఏపీఐఐసీ ఎక్కడైనా పారిశ్రామికవాడ ఏర్పాటుచేస్తే…ఆ విస్తీర్ణంలో కేవలం 10 శాతం మాత్రమే వాణిజ్య అవసరాలకు అనుమతి ఇచ్చి, మిగిలిన 90 శాతం పరిశ్రమలకే కేటాయించడం తెలిసిందే. 10 శాతానికి మించి కన్వర్షన్‌కు అనుమతి లేదు. దీనివల్ల అక్కడ అన్ని రకాల పరిశ్రమలు ఏర్పాటయ్యేవి. తద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా అందేవి.
అయితే, ఇన్నాళ్లు ఊరికి దూరంగా ఉండే పారిశ్రామిక ప్రాంగణాలు..పెరిగిన జనాభా, మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో జనావాసాల చుట్టూ చేరాయి. మధ్యలో ఉన్న కొన్ని చోట్ల పరిశ్రమలు సైతం కాలుష్యం వెదజల్లుతున్నాయి. మరికొన్ని కాలుష్యరహిత పరిశ్రమలుగా కొనసాగుతున్నాయి. ఇప్పుడీ పారిశ్రామిక భూములను సద్వినియోగపరచి, దివాళ తీసిన పరిశ్రమలను తిరిగి నిలబెట్టడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఖాళీ ప్లాట్లను బహుళ ప్రయోజన ప్రాంగణాలుగా తీర్చిదిద్ది మరిన్ని ఉపాధి అవకాశాలు పెంచాలనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం.
తాజా జీవోలు 5,6పై పారిశ్రామికవేత్తల స్పందనను కూడా ఏపీఐఐసీ స్వీకరించింది. ఏఏ ఆటోనగర్, ఇండస్ట్రియల్ పార్కులలో ఎన్ని పరిశ్రమలు మూలన పడ్డాయి? ఖాళీ విస్తీర్ణం ఎంత? వంటి వివరాలను కూడా సేకరించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 160కి పైగా ఆటోనగర్లు, ఇండస్ట్రియల్ ఎస్టేట్ లు ఉన్నాయి. ఇందులో వివిధ రకాల చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఆటోమొబైల్ యూనిట్ల ద్వారా వేలాదిమందికి ఉపాధి పొందుతున్నారనే వివరాలను సేకరించింది.
‘కో–ఆర్డినేటెడ్ గ్రోత్ పాలసీ’ పారిశ్రామికవేత్తల ఆసక్తి
ఇటీవల అన్ని చోట్లా భూముల ధరలు భారీగా పెరగడంతో కో–ఆర్డినేటెడ్ గ్రోత్ పాలసీ ద్వారా వరించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపుతున్నారు. బ్యాంకుల రుణాలు, ఆర్థిక బారాలతో కొనసాగించలేని స్థితికి చేరిన యూనిట్లు మరలా పున:ప్రారంభమవుతాయనీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ‘కొన్ని ఆటోనగర్‌లు, పారిశ్రామికవాడల చుట్టూ జనావాసాలు పెరిగిపోయాయి. నివాసానికి కూడా చోటు దొరకని పరిస్థితి.
చుట్టుపక్కల ప్రాంతాల పట్టణీకరణ, పర్యావరణ సమస్యల వల్ల అక్కడ పరిశ్రమలు నడపలేకపోతున్నామని, భూ వినియోగ మార్పిడికి అవకాశం ఇవ్వాలని పారిశ్రామిక యూనిట్ల యజమానుల నుంచి దరఖాస్తులు వస్తున్నాయి. ఆ భూమిని పారిశ్రామికేతర అవసరాలకు వాడుకునేందుకు అవకాశం ఇవ్వడం వల్ల అలాంటి వారికి వరంగా మారడం ఖాయమని ఆటోనగర్లలో యూనిట్లదారులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వానికి ఆదాయ వనరుగానూ ఉపయోగపడుతుందని గ్రోత్ పాలసీపై పారిశ్రామికవేత్తలు తమ స్పందన తెలియజేస్తున్నారు.
పారిశ్రామిక అవసరాలకే కాకుండా రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్లుగా మలుచుకోవడానికి కూడా అవకాశం కల్పించడం వల్ల ఆర్థికంగా చితికి, బ్యాంకుల నుంచి రుణాలందక, కాలుష్యం కారణంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న సిక్ ఇండస్ట్రీలకు ఈ పాలసీతో పున:వైభవం ఖాయమని ఏపీఐఐసీ అధికారులు చెబుతున్నారు. భూముల వినియోగాన్ని మార్చుకోవడానికి సింగిల్ విండో విధానంలో ఆన్ లైన్ ద్వారా ఏపీఐఐసీ వెబ్ సైట్ ద్వారా సులువుగా అనుమతులు ఇస్తామని స్పష్టం చేశారు.
జీవో నంబర్ 5,6లోని వెసులుబాటులివే
పాలసీ ప్రకారం, ఎక్కడో ఊరి చివరనున్న ఆటోనగర్లు పెరిగిన జనాభా వల్ల పట్టణాలు /నగరాల నడిబొడ్డుకు మారిన వాటిని ఏపీఐఐసీ గుర్తిస్తుంది.
వాటిని నివాసగృహాలు, వాణిజ్య భవనాల నిర్మాణం వంటి వివిధ అవసరాలకు వినియోగించునేందుకు వీలుగా ‘మల్టీపర్పస్ జోన్’లుగా మార్చేందుకు అనుమతివ్వాలని సంబంధిత కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీకి ఏపీఐఐసీయే దరఖాస్తు చేస్తుంది.
పారిశ్రామిక భూముల వినియోగ మార్పిడికి మార్కెట్ విలువలో 50 శాతం ఫీజుగా చెల్లించాలి.
డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో… మొత్తం కేటాయింపులో 50 శాతం భూమిని ఏపీఐఐసీకి తిరిగి ఇచ్చే అవకాశం గ్రోత్ పాలసీ అందిస్తోంది.
సంబంధిత మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ ఆటోనగర్‌లలోని పారిశ్రామిక యూనిట్ల యజమానుల నుంచి… భూమి మార్కెట్ విలువలో సగం మొత్తాన్ని ‘ఇంపాక్ట్ ఫీజు’గా వసూలుచేస్తుంది. భూవినియోగ మార్పిడి ఫీజు దీనికి అదనం. ‘ఇంపాక్ట్ ఫీజు’గా వసూలుచేసిన మొత్తాన్ని ఆ తర్వాత ఏపీఐఐసీకి బదలాయిస్తుంది.
ఏపీఐఐసీ పారిశ్రామిక పార్కులు, పారిశ్రామిక వాడలతో పాటు, వాటికి వెలుపల ప్రభుత్వం నుంచి స్థలం తీసుకుని ఏర్పాటుచేసిన పరిశ్రమల్ని… బహుళ అవసరాలకు వినియోగించుకునేలా మారుస్తుంది. దానికి వాటి యజమానులు ఆ భూమిలో సగం ఇవ్వాలి, లేదా మార్కెట్ విలువలో సగం ప్రభుత్వానికి చెల్లించాలి.
సొంతంగా భూమి కొనుక్కుని పరిశ్రమ ఏర్పాటు చేసుకున్నవారు… అది ఖాయిలా పడటమో, కాలుష్యం తదితర సమస్యలతో దాన్ని నిర్వహించలేకనో ఆ స్థలాన్ని వేరే అవసరాలకు వినియోగించుకోవాలనుకుంటే, భూమి మార్కెట్ విలువలో ప్రభుత్వానికి 15% చెల్లించాలి.
ఎంచుకున్న వ్యాపారాన్ని బట్టి, నిత్యం మారుతున్న సాంకేతికత, చేతివృత్తులు, వంశపారంపర్యంగా కొనసాగే పనుల్లో ఇటీవల వస్తున్న మార్పులు, డిమాండ్ ప్రాధాన్యతలను బట్టి మార్పులకు అనుగుణంగా నగరం/ పట్టణాలకు దూరంగా కొత్త పారిశ్రామికవాడలు అభివృద్ధి చేయడానికి, కాలుష్య పరిశ్రమలను నియంత్రించడానికి ప్రభుత్వం అందరికీ ఆమోదయోగ్యమైన ఈ పంథాను ఎంచుకుంది.