‘సెప్టెంబర్ 9న రైతు నిరసన’!
– రానున్న మాజీ సీఎం జగన్
– వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిన్న శ్రీను
విజయనగరం: రాష్ట్రంలోనూ, ఈ జిల్లాలోనూ నెలకొన్న రైతు సమస్యలపై రెవెన్యూ డివిజన్ల స్థాయిలో సెప్టెంబర్ 9న రైతు నిరసన కార్యక్రమాన్ని పెద్ద స్థాయిలో నిర్వహించ తలపెట్టనున్నట్టు వైసీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాస్ రావు(చిన్న శ్రీను) పేర్కొన్నారు. ఈ మేరకు రైతులకు, రైతు సంఘాల నేతలకు, వైసీపీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. బుధవారం తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రైతాంగం అనేక సాగు సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని, అయినా ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్టు కూడా లేదని ఎద్దేవా చేశారు. పైగా రైతుల ఆత్మ గౌరవాన్ని కించపరిచేలా ఈ ప్రాంతానికి చెందిన వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెం నాయుడు బాధ్యతా రాహిత్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ చిన్న శ్రీను తప్పుబట్టారు. నాట్లు వేసిన రైతాంగానికి కనీసం యూరియాను కూడా సరఫరా చేయలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని విమర్శించారు.
జిల్లాలో యూరియా, డీఏపీ వంటి ఎరువులు కొరత అధికంగా ఉందని అన్ని పత్రికల్లోనూ కథనాలు వస్తుంటే, వాటిని ఖండిస్తూ సమాచార శాఖ ద్వారా ఈ ప్రభుత్వం తప్పుడు ప్రకటనలు ఇస్తూ రైతులను దగా చేస్తుందని ధ్వజమెత్తారు. ఎరువుల కొరత, అన్నదాత సుఖీభవ లోపాలు, గిట్టుబాటు ధరలు లేకపోవడం, నిర్వీర్యం అవుతున్న రైతు భరోసా కేంద్రాలు వంటి అనేక రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళేందుకు సెప్టెంబర్ 9 న వైసీపీ ఆధ్వర్యంలో రైతు నిరసన కార్యక్రమాన్ని తలపెట్టనున్నట్టు తెలిపారు.
ఈ రైతు సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళేందుకు రైతులతో, రైతు పోరాట సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమం చేపట్టనునట్టు తెలిపారు. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక మార్లు రైతుల పక్షాన నిలబడి పోరాటం చేశారని గుర్తు చేశారు. అలాగే ఈనెల 9 న జరిగే రైతు నిరసనలోను జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్నట్టు పేర్కొన్నారు.