– నవంబర్ లో విడుదలకి సన్నాహాలు
– ఏప్రిల్ 2025 నుండి అమల్లోకి రానున్న పర్యాటక హిత పాలసీ
– జనవరిలో విశాఖ ఉత్సవ్, బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తాం
– పర్యాటక అభివృద్ధి కోసం త్వరలో పెట్టుబడిదారులతో కాన్ క్లేవ్
– ముగిసిన మంత్రి కందుల దుర్గేష్ రెండు రోజుల విశాఖ పర్యటన
విశాఖపట్నం: రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేలా నవంబర్ లో టూరిజం పాలసీ విడుదల చేస్తామని, ఏప్రిల్ 2025 నుండి పాలసీ అమల్లోకి రానుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.
ఆదివారం సాయంత్రం విశాఖపట్నంలోని సర్క్యూట్ హౌస్ లో మీడియాతో మాట్లాడిన మంత్రి టూరిజం పాలసీకి సంబంధించి పలు అంశాలు వివరించారు. పర్యాటకులను ఆకర్షించేలా, స్టేక్ హోల్డర్లకు అనుకూలంగా ఉండేలా పాలసీ రూపకల్పనకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రత్యేక సహకారం అందించేందుకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముందుకు వచ్చారని తెలిపారు. సెప్టెంబర్ 2న బెంగుళూరులో జరిగిన దక్షిణాది రాష్ట్రాల పర్యాటక మంత్రుల సదస్సులో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. వైజాగ్ లో జరగాల్సిన సమావేశం భారీ వర్షాలు, వరదల వల్ల బెంగుళూరులో జరిగిందని పేర్కొన్నారు.
ఏపీలో పర్యాటక అభివృద్ధికి అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నాయని, వాటిని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని తాను వెల్లడించానని మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రసాద్ ద్వారా టెంపుల్ టూరిజాన్ని, స్వదేశీ దర్శన్ ద్వారా ఎకో, అడ్వెంచర్ టూరిజం అభివృద్ధి చేయనున్నామని వెల్లడించారు.
టెంపుల్ టూరిజంలో భాగంగా నంద్యాల జిల్లా శ్రీశైలం, బాపట్ల జిల్లా సూర్యలంక, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను కలుపుతూ అఖండ గోదావరి, నంద్యాల జిల్లా సంగమేశ్వరం పరిసర ప్రాంతాల్లో ఐకానిక్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. స్వదేశీ దర్శన్ లో భాగంగా విశాఖ సమీపంలోని లంబసింగి, బొర్రా గుహలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళిక రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టులను పట్టాలెక్కించనున్నామన్నారు.
పర్యాటకులను ఆకర్షించాలన్న ఉద్దేశంతో హాస్పిటాలిటీ, హోటల్ యాజమాన్యాల కోరిక మేరకు రాత్రి వేళలో 11, 12 గంటల వరకు హోటళ్ల కార్యకలాపాలు నిర్వహించుకునేలా ప్రభుత్వం సూత్రప్రాయ అంగీకారం తెలిపిందన్నారు.
టెంపుల్ టూరిజంతో పాటు ఎకో, అడ్వెంచర్, వెల్ నెస్, అగ్రి టూరిజంలను కలుపుతూ సర్క్యూట్ లను అభివృద్ధి చేసి పర్యాటకులు ఎక్కువ రోజులు ఉండేలా ప్రణాళికలు తయారు చేస్తామన్నారు. ఈ క్రమంలో తిరుపతి, శ్రీశైలం, బాపట్ల, గోదావరి జిల్లాల్లో, వైజాగ్ తీరంలో సర్క్యూట్ లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు. తద్వారా ఆదాయం పెంపుకు కృషి చేస్తామన్నారు.
టూరిజం పాలసీ ద్వారా పర్యాటక ప్రాంతాల్లో సరైన సదుపాయాల కల్పన, ముందుకు వచ్చే పెట్టుబడిదారులకు రాయితీలు, వారిని ఆకర్షించేలా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ అంతేగాక ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించినట్లు పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్ట్ నర్ షిప్ ద్వారా పర్యాటకం అభివృద్ధి చేయాలని భావిస్తున్నామన్నారు.
ఇప్పటికే పీపీపీ విధానంలో భోగాపురం సమీపంలోని అన్నవరంలో ఫైవ్ స్టార్ హోటల్ ఏర్పాటు చేసేందుకు ఒబెరాయ్ సంస్థ ముందుకు వచ్చిందన్నారు. అదేవిధంగా తిరుపతి, రాజమహేంద్రవరం సమీపంలోని పిచ్చుకలంక తదితర 5 ప్రాంతాల్లో ఫైవ్ స్టార్ హోటళ్ల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారని పేర్కొన్నారు.
రూ.500 కోట్లతో ఏపీలోని అమరావతిలో మెగా ప్రాజెక్టు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. రెండు రోజుల విశాఖ పర్యటనలో ఈస్ట్ పాయింట్ గోల్ప్ క్లబ్ ఆధ్వర్యంలో వైజాగ్ ఓపెన్ గోల్ప్ టోర్నమెంట్ కు హాజరయ్యానని, ప్రైజ్ ల ప్రదానం కార్యక్రమంలో పాల్గొన్నానని తెలిపారు. గతంలోనే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు వారికి గోల్ప్ కోర్స్ ఏర్పాటుకు దాదాపు 8 ఎకరాల స్థలం కేటాయించారన్న విషయం గుర్తుచేశారు.
ఏపీలోనే కాదు దక్షిణ భారతదేశంలోనే నెంబర్ వన్ గోల్ప్ కోర్స్ గా తీర్చిదిద్దుతామని తెలిపామన్నారు. గోల్ప్ ను అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటకంగా అభివృద్ధి చెందించాలన్నది తమ ఉద్దేశమని ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో పేర్కొన్నారని గుర్తు చేశారు.
అమరావతిలో కూడా గోల్ప్ కోర్స్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు. గోల్ప్ కోర్సుల విషయంలో ఇండియాలో 5వ స్థానంలో ఉన్నామని తెలిపారు. అదే విధంగా రాజధాని అమరావతిలో రివర్ ఫ్రంట్ పొడవునా పర్యాటక ప్రాజెక్టులు నెలకొల్పేందుకు సీఎం ఆమోదం తెలిపారన్నారు. త్వరలోనే కాన్ క్లేవ్ ఏర్పాటు చేసి పెట్టుబడిదారులను ఆహ్వానిస్తామన్నారు.