Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ ఖాతాలోకి స్కిల్ స్కాం నిధుల హవాలా మార్గంలో మళ్లింపు

-టీడీపీ ప్రధాన కార్యాలయానికి సీఐడీ నోటీసులు
– ఎంపీ విజయసాయిరెడ్డి

నవంబర్ 15: చంద్రబాబు స్కిల్ స్కాంలో దోచుకున్న నిధుల్లో రూ. 27 కోట్లు హవాలా మార్గంలో టీడీపీ ఖాతాలోకి మళ్లించినట్లు స్కిల్ స్కాం దర్యాప్తు సంస్థ సీఐడీ గుర్తించి టీడీపీ ప్రధాన కార్యాలయానికి నోటీసులు జారీచేసిందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. సోషల్ మీడియాలో బుధవారం ఈ అంశంపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. ఇతర కుంభకోణాల నిధులు కూడా చంద్రబాబు పార్టీ ఖాతాలోకి మళ్లించారని తెలిపారు.ఈ మేరకు ఈ నెల 18న వివరాలతో సిట్ కార్యాలయానికి రావాలని జారీ చేసిన నోటీసులో సీఐడీ పేర్కొందని అన్నారు.

జాతి నేతగా మారిన జాతీయనేత పురందేశ్వరి
జాతీయ నేతగా ఉన్న పురందేశ్వరి జాతి నేతగా ఎందుకు మారారని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఆమె సొంతఊరు ప్రకాశం జిల్లా కారంచేడులో తాను ఇప్పుడున్న పార్టీ బిజెపి నుండి గత ఎన్నికల్లో సర్పంచ్ లేదా తన సొంత మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను ఎందుకు పోటీలో పెట్టలేదని ప్రశ్నించారు.

అప్పటికి ఆమె పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారని గుర్తుచేశారు.రాష్ట్రంలో ఆమె పార్టీ (బీజేపీ)కి చెందిన చిన్న చిన్న నేతలు కూడా నిజాయతీగా అన్ని చోట్ల పోటీ చేశారని, మరి తానెందుకు ఆ పని చేయలేదని ప్రశ్నించారు. పార్టీ కార్యకర్తలు ఈ ప్రశ్న అడిగితే ఆమె ఏం సమాధానం చెబుతారని, తన బావ కళ్లల్లో ఆనందం కోసం’ అని నిజం చెప్పేస్తారా అని చమత్కరించారు . బిజెపి పట్ల ఆమెకున్న చిత్తశుద్ధి ఇదేనని అన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మద్ధతుగా టీడీపీ పోటీ చేయొద్దని పురందేశ్వరి సలహా ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయని అన్నారు. వారి ఆస్తులు, నివాసాలు ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపించుకుంటే వారు అధికారంలో ఉన్నట్టే అని భావిస్తున్నట్లు తెలుస్తోందని అన్నారు. బిజెపి గురించి కాక సామాజికవర్గ ప్రయోజనాల కోసం ఇంతలా ఆరాటపడుతూ పురందేశ్వరి ఇంకా ఎన్ని విన్యాసాలు చేస్తారని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE