Suryaa.co.in

Andhra Pradesh

ట్రాన్స్ ఫార్మర్ల కుంభకోణం c/o జగన్ ప్రభుత్వం

• తెలంగాణ ప్రభుత్వంతో పోలిస్తే, ఒక్కో ట్రాన్స్ ఫార్మర్ ను ఏపీ ప్రభుత్వం 2023లోనే 200, 300 శాతం అధికధరకు కొనడం వెనకున్న మర్మమేంటి?
• నాలుగేళ్ల క్రితం టీడీపీప్రభుత్వంలోని ధరలతో పోలిస్తే, నేడు జగన్ హాయాంలోనే ప్రతి ట్రాన్స్ ఫార్మర్ ధర ఊహించని విధంగా ఎందుకు పెరిగింది?
• 25 కేవీ ట్రాన్స్ ఫార్మర్ ధర టీడీపీ ప్రభుత్వంలో రూ.58వేలుంటే, ఈ సంవత్సరం (2023) తెలంగాణ ప్రభుత్వం రూ.79,829లకు కొంటే, జగన్ ప్రభుత్వం మాత్రం 223.98 శాతం ధర పెంచి, రూ.1,78,800లకు కొనడం దోపిడీ కాదా?
• 315 కేవీ ట్రాన్స్ ఫార్మర్ ధర చంద్రబాబు ప్రభుత్వంలో రూ.5,71,252లు ఉంటే, తెలంగాణ సర్కార్ రూ.8,60,000లకు కొంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ.16,75,000లకు కొనడం కుంభకోణం కాదా?
• ఒకే సంవత్సరం పక్కపక్కనే ఉన్న రెండు రాష్ట్రాలు జరిపిన ట్రాన్స్ ఫార్మర్ల కొనుగోళ్లలో ఇంత వ్యత్యాసం ఎందుకుందో ముఖ్యమంత్రి చెప్పాలి.
• బ్లాక్ లిస్ట్ లో ఉండాల్సిన షిరిడిసాయి సంస్థకు కాంట్రాక్టులు కట్టబెట్టడం వెనకున్న మతలబు ఏమిటో ప్రభుత్వం బయటపెట్టాలి
• స్మార్ట్ మీటర్ల కుంభకోణంపై నిజాలు నిగ్గుతేల్చడానికి హైకోర్టులో పిల్ వేశాను.. త్వరలోనే ట్రాన్స్ ఫార్మర్ల కుంభకోణంపై కూడా న్యాయస్థానాల్ని ఆశ్రయించి, జగన్ రెడ్డి బాగోతాన్ని ప్రజల ముందు ఉంచుతాను
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

అధికారంలోకి వచ్చినప్పటినుంచీ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రతి స్కీమ్, ప్రతి ప్రాజెక్ట్ లోనూ స్కామ్ అవినీతేనని, విద్యుత్ రంగంలో ముఖ్యమంత్రి దోపిడీపై హైకోర్టులో పిటి షన్ వేశానని, షిరిడిసాయి ఎలక్ట్రికల్స్ సంస్థకు కట్టబెట్టిన ట్రాన్స్ ఫార్మర్ల టెండర్లలో భారీ స్కామ్ జరిగిందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ట్రాన్స్ ఫార్మర్ల స్కామ్ ను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా విలేకరులకు వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“ జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు దత్తపుత్రులు..వారిలో ఒకరు అరబిందో సంస్థ యాజమాన్యమైతే, మరొకరు షిరిడీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ యజమాని. ఈ రెండు సంస్థలకు పుట్టిన విషపుత్రికే ఇండో సోల్ సోలార్ సంస్థ. ఇండో సోల్ సోలార్ సంస్థ వయస్సు కేవలం 18 నెలలు మాత్రమే. ఆ సంస్థను దత్తత తీసుకున్న ముఖ్యమంత్రి అందుకు బహుమతిగా రూ.75,706 కోట్ల విలువైన ప్రాజెక్టులు కట్టబెట్టాడు. గతంలో తాము షిరిడిసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ స్మార్ట్ మీటర్ల కుంభకోణాన్ని బయటపెట్టాము. ఇప్పుడు ట్రాన్స్ ఫార్మర్ల కుంభకోణం గురించి తెలుసుకుందాం.

చంద్రబాబు ప్రభుత్వంలోని ధరలతో పోలిస్తే, జగనన్నహయాంలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల ధరలు అమాంతం 300 శాతానికి పైగా ఎందుకు పెరిగాయి?
టీడీపీ హాయాంలో 25 కే.వీ ట్రాన్స్ ఫార్మర్ ధర రూ.58,569లు అయితే, నేడు జగన న్న ప్రభుత్వంలో ఆ ధర రూ.1,78,800లు ఉంది. రూ.1,20,230ల ధర పెరిగింది. అంటే దాదాపు కేవలం నాలుగేళ్లలో 305 శాతం ధర పెరిగింది.

63 కేవీ. ట్రాన్స్ ఫార్మర్ ధర టీడీపీ ప్రభుత్వంలో రూ.89,892 లు ఉంటే, నేడు జగన్ రెడ్డి హయాంలో రూ.2,81,000 లకు పెరిగింది. రూ.1,91,108ల ధర పెరిగింది. అంటే దాదాపు 312 శాతం పెరిగింది.
100 కేవీ ట్రాన్స్ ఫార్మర్ ధర చంద్రబాబు హాయాంలో రూ.1,20,311లు ఉంటే, జగన్ హాయాంలో రూ.3,58,000లు. రూ.2,37,689లు పెరిగింది. అంటే 297.56 శాతం పెరిగింది.

160 కేవీ ట్రాన్స్ ఫార్మర్ ధర టీడీపీ ప్రభుత్వంలో రూ.2,00,790లు ఉంటే, జగన్ హాయాంలో దాని ధర రూ.6,36,000 లకు పెరిగింది. పెరిగిన మొత్తం రూ.4,35,210 లు. పెరిగిన శాతం 316.75 శాతం.

315 కేవీ ట్రాన్స్ ఫార్మర్ ధర టీడీపీ హాయాంలో రూ.5,71,252లు ఉంటే, నేడు జగన్ రెడ్డి హాయాంలో రూ.16,75,000లు అయ్యింది. అప్పటికీ, ఇప్పటికీ పెరిగిన వ్యయం రూ.11,03,748లు. పెరిగిన శాతం 293.22.

తెలంగాణ ప్రభుత్వంతో పోలిస్తే ఏపీ ప్రభుత్వం ట్రాన్స్ ఫార్మర్ల కొనుగోలుకు 200, 300శాతం అధిక సొమ్ము వెచ్చించింది
నాలుగేళ్లలో ట్రాన్స్ ఫార్మర్ల ధరలు పెరగవా అని జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా వాదించ వచ్చు. కానీ ఏపీలో మాత్రమే దాదాపు 300శాతం వరకు ట్రాన్స్ ఫార్మర్ల ధరలు పెరిగా యి. పక్కనే ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఈ సంవత్సరం (2023)లో కొనుగోలు చేసిన ట్రాన్స్ ఫార్మర్ల ధరలతో, ఏపీ ప్రభుత్వ ధరలను పోలిస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే.

25 కేవీ ట్రాన్స్ ఫార్మర్ ధర టీడీపీ ప్రభుత్వంలో రూ.58 వేలుంటే, ఈ సంవత్సరం తెలంగాణ సర్కార్ అదే ట్రాన్స్ ఫార్మర్ (ఒక్కోదాన్ని) ను రూ.79,829లకు కొనుగోలు చేసింది. అదే ట్రాన్స్ ఫార్మర్ ను జగన్మోహన్ రెడ్డి సర్కార్ మాత్రం 2023లో రూ.1,78, 800లకు కొనుగోలు చేసింది. తెలంగాణతో పోలిస్తే ఏపీ ప్రభుత్వం ఒక్కో ట్రాన్స్ ఫార్మర్ కొనుగోలుకి రూ.98,971లు అదనంగా వెచ్చించింది. అంటే 223.98శాతం అదనంగా ఖర్చుపెట్టింది.

అలానే 63 కేవీ ట్రాన్స్ ఫార్మర్ ను తెలంగాణ సర్కార్ 2023లో రూ.1,22,936లకు కొంటే, వైసీపీ ప్రభుత్వం మాత్రం ఒక్కో ట్రాన్స్ ఫార్మర్ ను రూ.2,81,000లకు కొనుగో లు చేసింది. మొత్తంగా పక్క రాష్ట్రంతో పోలిస్తే ఒక్కో ట్రాన్స్ ఫార్మర్ కు రూ.1,58,064 లు అదనంగా ఖర్చు పెట్టింది. 228.57శాతం అదనంగా వెచ్చించింది.

100 కేవీ ట్రాన్స్ ఫార్మర్ ను 2023లో తెలంగాణ ప్రభుత్వం రూ.1,86,500లకు కొంటే, జగన్ రెడ్డి ప్రభుత్వం రూ.3,58,000లకు కొనుగోలు చేసింది. రెండు ప్రభుత్వాలు వెచ్చించిన దాని మధ్య వ్యత్యాసం రూ.1,71,495లు. మొత్తంగా పెరిగిన ఖర్చుశాతం రూ.191.95శాతం.

315 కేవీ ట్రాన్స్ ఫార్మర్ని తెలంగాణ ప్రభుత్వం రూ.8,60,000లకు కొంటే, జగన్ ప్రభుత్వం మాత్రం అడ్డగోలుగా ఒక్కోట్రాన్స్ ఫార్మర్ కు రూ.16,75,000లు చెల్లించింది . రెండు ప్రభుత్వాల మధ్య కొనుగోలు ధర తాలూకా వ్యత్యాసం రూ.8,14,000లు. మొత్తంగా పెరిగిన శాతం 194.70 శాతం.

ఒకే సంవత్సరం పొరుగున ఉన్న రెండు రాష్ట్రాలు జరిపిన ట్రాన్స్ ఫార్మర్ల కొనుగోళ్లలో ఇంత భారీ వ్యత్యాసం ఏమిటి? జగన్ సర్కార్ మాత్రమే దేశంలో ఏరాష్ట్రం చేయని విధంగా 200, 300శాతం అధిక ధరకు ట్రాన్స్ ఫార్మర్లు ఎందుకు కొనుగో లు చేసింది? ట్రాన్స్ ఫార్మర్లకోసం అధికంగా చెల్లించిన సొమ్ము ఎటు పోయింది?

రాష్ట్రంలోని మూడు డిస్కంల పరిధిలో జరిగిన స్మార్ట్ మీటర్లు, ట్రాన్స్ ఫార్మర్ల కొనుగో ళ్లకు సంబంధించిన సమాచారం కావాలని, సమాచారహక్కు చట్టం కింద కోరిన సమాచారం ఇవ్వాలని 4 నెలలుగా ఆయా డిస్కింల యాజమాన్యాలను కోరుతున్నా ను. ఆఖరికి మూడు డిస్కంల సీఎండీలకు, విద్యుత్ శాఖ కార్యదర్శికి కూడా ఫోన్ చేశాను. ఎంత ప్రయత్నించినా, డిస్కంల అధికారులు అరకొర సమాచారం ఇచ్చి చేతులు దులుపుకున్నారు తప్ప వాస్తవాలు బయటపెట్టలేదు. తాను అడిగిన సమాచారం ఎందుకు ఇవ్వరని, అలా ఇవ్వకపోతే సమాచారహక్కు చట్టానికి విలువ ఏముంటుందని కూడా ప్రశ్నించాను. డిస్కంల పరిధిలో కూడా భారీ కుంభకోణాలు జరిగాయి కాబట్టే సమాచారాన్ని తొక్కిపెట్టారు.

సీపీడీసీఎల్ పరిధిలోని రూ.611.40కోట్ల విలువైన పనుల్లో, రూ.380కోట్ల విలువైన(62.16శాతం) పనులు షిరిడీసాయి సంస్థకే అప్పగించడం వెనకున్న మర్మమేంటి?
విజయవాడలోని సెంట్రల్ డిస్కం (సీపీడీసీఎల్) కు చెందిన రూ.611.40కోట్ల విలువైన టెండర్లలో ఒక్క షిరిడిసాయి ఎలక్ట్రికల్స్ సంస్థకే రూ.380కోట్లకు పైగా పనులు అప్పగిం చారు. అంటే మొత్తం పనుల్లో 62.16శాతం పనులు ఆ సంస్థకే అప్పగించారు. గతంలో నాసిరకం ట్రాన్స్ ఫార్మర్లు సరఫరా చేసినందుకు గాను టీడీపీప్రభుత్వం షిరిడిసాయి ఎలక్ట్రికల్స్ సంస్థకు రూ.178కోట్ల పెనాల్టీ విధించింది. టీడీపీ హాయాంలో సదరు సంస్థకు వేసిన జరిమానాను, వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శిగా ఉన్న ఐ.ఏ.ఎస్ అధికారి శ్రీకాంత్ కూడా రూ.40 కోట్ల పెనాల్టీని రైటాఫ్ చేయడం జరిగింది.

డిస్ క్వాలిఫై చేసి, బ్లాక్ లిస్ట్ లో పెట్టాల్సిన షిరిడిసాయి సంస్థకు అన్ని కాంట్రాక్టులు ఎందుకు కట్టబెడుతున్నారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. రైతుల మోటార్లకు బిగించే స్మార్ట్ మీటర్ల వ్యవహారంలోకూడా రూ.7 వేలకోట్ల కుంభకోణం జరిగిందని గతంలోనే ఆధారాలతో సహా మీడియాకు వివరించాను. కానీ జగన్ ప్రభుత్వం స్పందించలేదు. స్మార్ట్ మీటర్ల కుంభకోణంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్ ) వేశాను. అలానే ట్రాన్స్ ఫార్మర్ల కుంభకోణంపై కూడా న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తాను. వైసీపీ ప్రభుత్వం నామినేషన్ పద్ధతిలో వేలకోట్ల విలువైన ప్రాజెక్టుల్ని ఎలాంటి అనుభవం లేని షిరిడిసాయి సంస్థకు కట్టబెడుతోంది.

టీడీపీ హయాంలో షిరిడిసాయి సంస్థకు అదనంగా ఎలాంటి పనులు, టెండర్లు అప్పగించలేదు. ఆనాడు మా హాయాంలో పనిచేసిన 6, 7 కంపెనీల్లో షిరిడిసాయి సంస్థ ఒకటి. అదికూడా నిబంధన లకు విరుద్ధంగా వ్యవహరించడంతో పెనాల్టీలు వేశాం. టీడీపీప్రభుత్వం వేసిన పెనాల్టీల ను నిస్సిగ్గుగా రద్దుచేసింది కాక, వేలకోట్ల విలువైన కాంట్రాక్టులు కట్టబెడతారా?

జగన్ రెడ్డి…వైసీపీప్రభుత్వ అవినీతి, కుంభకోణాలపై మాట్లాడే ధైర్యం లేకే మంత్రులు, వైసీపీనేతలు టీడీపీపై, చంద్రబాబుపై నిందలేస్తున్నారు
ఇప్పటివరకు తాను సేకరించిన సమాచారాన్ని ప్రజలు… మీడియా ముందు ఉంచా ను. ఇంకా లోతుల్లోకి వెళ్లి మరింత సమాచారం సేకరించి, జగన్ రెడ్డి హాయాంలో విద్యుత్ డిస్కంల పరిధిలో జరుగుతున్న చీకటి కోణాలను వెలికితీస్తాను. ఇప్పటికే రాష్ట్ర విద్యుత్ రంగం పూర్తిగా సర్వనాశనమైంది. విద్యుత్ కోతలతో వ్యవసాయ, పారి శ్రామిక రంగాలు కుదేలయ్యాయి. విద్యుత్ శాఖలో భారీ అవినీతి జరుగుతోంది. అది మొత్తం ఆధారాలతో సహా బయటపెట్టే తీరతాం. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని వే లకోట్లు సంపాదించిన వ్యక్తే ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే లక్షలకోట్లు సంపాదించకుం డా ఉంటాడా?

వైసీపీ ప్రభుత్వంలో ఏ స్కీమ్ లో అయినా అవినీతి లేదని చెప్పగలరా? జరిగే దోపిడీ, కుంభకోణాలపై మాట్లాడకుండా, మంత్రులు.. వైసీపీ నేతలు టీడీపీపై విమర్శలు చేయడం.. చంద్రబాబుపై నిందలేయడం చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలోని కుంభకోణాలన్నీ బయటకొస్తే.. ముఖ్యమంత్రి జీవితకాలం జైల్లోనే ఉంటారు. ప్రజలంద రూ ఆధారపడే విద్యుత్ వ్యవహారంలో భారీ కుంభకోణాలు జరిగితే అంతిమంగా నష్టపోయేది ప్రజలే కదా! అరబిందో, షిరిడిసాయి సంస్థలు తప్ప ఇతర కంపెనీలు లేవా? త్వరలోనే మూడు డిస్కంల పరిధిలో జరిగిన ఊహించని వ్యవహారాలను బయటపెడతాను” అని సోమిరెడ్డి తేల్చిచెప్పారు.

LEAVE A RESPONSE