నైపుణ్యాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్
“ప్రపంచవ్యాప్త పోటీతత్వం దిశగా పాలిటెక్నిక్ విద్యా విధానం మార్పు” అనే అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు
జాతీయ విద్యా విధానం మేరకు పాలిటెక్నిక్ విద్య
చదలవాడ నాగరాణి
ఉపాధి కోసం విద్య అన్న నానుడిని తిరగరాస్తూ ఉపాధి సృష్టించేలా పాలిటెక్నిక్ విద్య రూపాంతరం చెందాలని రాష్ట్ర నైపుణ్యాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ అన్నారు. రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ, సాంకేతిక విద్యా, శిక్షణా మండలి సంయిక్త ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో “ ప్రపంచవ్యాప్త పోటీతత్వం దిశగా పాలిటెక్నిక్ విద్యా విధానం మార్పు” అనే అంశంపై ప్రభుత్వ, ప్రవేటు పాలిటెక్నిక్ ల ప్రిన్సిపల్స్ తో ప్రత్యేక సదస్సు నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సురేష్ కుమార్ మాట్టాడుతూ నేటి సమాజానికి పాలిటెక్నిక్ విద్యార్ధుల ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. పాలిటెక్నిక్ అంటే ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశం అనే ధోరణిని విడనాడి స్వతంత్ర్య పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్నారు. ప్రతి ఒక్క విద్యార్ధి తన కెరిర్ ను అద్బుతంగా మలచుకునేందుకు అన్ లైన్ అప్ డేటెడ్ కోర్సులు నేర్చుకోవాలన్నారు. ప్రతి విద్యార్ధి చివరి సంవత్సరం పాలిటెక్నక్ నాటికి ఒక ఆర్టికల్ రాయగలిగిన స్థాయిలో తీర్చిదిద్దబడాలని తెలిపారు.
తప్పుదారి ప్రయాణంలో ఎంతదూరం వెళ్లినా విజయం సమకూరదన్న విషయాన్ని విద్యార్ధులు మరువరాదన్నారు. యురోపియన్ దేశాలలో జనాభా తగ్గుతోందని, ఇండియా వంటి దేశాలలో మానవ వనరుల కొరత లేదని, ఇది రానున్న కాలంలో మనకు మరింతగా అంతర్జాతీయ ఉపాధిని అందిస్తుందని, అయితే నైపుణ్యం కలిగి ఉంటేనే అవకాశాలు దక్కుతాయని సురేష్ కుమార్ పేర్కొన్నారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సాంకతిక విద్యాశాఖ కమీషనర్, సాంకేతిక విద్యా, శిక్షణా మండలి ఛైర్మన్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్యార్థులు ప్రపంచ పరిశ్రామిక రంగంలో అత్యుత్తమ ఉద్యోగులుగా నిలిచేలా జాతీయ విద్యా విధానం 2020 రూపుదిద్దుకుందన్నారు. ఎన్ఎస్ క్యూఎఫ్ మార్గదర్శకాలకు అనుగుణంగా యాడ్ ఆన్ కోర్సులను రూపొందిస్తున్నామని, పాలిటెక్నిక్ విద్యార్థులకు ఆ కోర్సులో ఇంటెన్సివ్ ట్రైనింగ్ పొందే అవకాశం కల్పిస్తామని తెలిపారు.
అదనపు నైపుణ్య శిక్షణలు అదనపు క్రెడిట్లను అందిస్తాయన్నారు. పాలిటెక్నిక్ విద్యావిధానం ఇప్పుడు నేషనల్ క్రెడిట్ ప్రేమ్ వర్క్ సూచించిన “చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్” అమలు, అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ (ఎబిసి) తో అనుసంధానించడంపై పనిచేస్తోందన్నారు. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ లలో శాస్త్రీయ డాక్యుమెంటేషన్, రికార్డ్ ప్రక్రియలతో “అకడమిక్ ఆడిట్”ను పునఃప్రారంభిస్తున్నామన్నారు.
సాంకేతిక విద్యా శాఖ ఉపసంచాలకులు డాక్టర్ ఎంఏవీ రామకృష్ణ 2023-24 విద్యాసంవత్సరంలో విద్యార్ధులకు వంద శాతం ఉపాధి చూపగలిగేలా జాబ్ మేళాలు, క్యాంపస్ డ్రైవ్‌లలో ఎంపిక చేసుకోవడానికి సన్నద్ధత వంటి అంశాలను వివరించారు. సాంకతిక విద్యా శిక్షణా సంస్ధ సంయిక్త కార్యదర్శి (అకడమిక్) జీవీవీఎస్ మూర్తి నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్ వర్క్ ముఖ్యాంశాలను వివరించారు. పాలిటెక్నిక్ విద్యకు క్రెడిట్ సిస్టమ్ రూపకల్పనలో అందరూ పాలుపంచుకోవాలన్నారు.
పాలిటెక్నిక్ లలో ప్రమాణాలు పాటించే సందర్భంలో అకడమిక్ ఆడిట్ అత్యంత ప్రాముఖ్యమైనదన్నారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక విద్యాశాఖ అదనపు సంచాలకులు వి.పద్మారావు, ఎస్ బీటీఈటీ కార్యదర్శి కేవీ రమణబాబు, ఏయూ రీజియన్ ఆర్జేడీ సత్యనారాయణమూర్తి, ఎస్వీయూ రీజియన్ ఆర్జేడీ నిర్మల్ కుమార్ ప్రియ, కేంద్ర కార్యాలయం ఉన్నతాధికారులు విజయభాస్కర్, జానకిరామ్, కళ్యాణ్ , విజయ కుమార్ తదితరులు పాల్గొన్నారు.