-సంఘటన పై విచారణ జరిపి సమగ్ర నివేదిక అందించాలి
-సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి ఆదేశం
అమరావతి: నూజివీడు ట్రిపుల్ ఐటి లో చదువుతున్న విద్యార్ధులు అనారోగ్యం పాలు అవుతుండడం పై రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి స్పందించారు. ట్రిపుల్ ఐటి కళాశాల అధికారులతో మాట్లాడి అనారోగ్యానికి గల కారాణాల ఫై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సంస్థ లో చదువుతున్న విద్యార్ధులు అందరికీ అవసరమైన వైద్య పరీక్షలు చేయించాలని, అనారోగ్యానికి గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.విషయం తెలిసిన వెంటనే మంత్రి ట్రిపుల్ ఐటి రిజిస్ట్రార్ ఇతర అధికారులతో మాట్లాడి విద్యార్ధులకు ఏవిధమైన ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని, వారి ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించవద్దని,ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అనారోగ్యానికి గల కారణాల పై విచారణ జరిపి సమగ్రమైన నివేదికను తక్షణం అందించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. తక్షణం నూజివీడు ట్రిపుల్ ఐటి కి వెళ్లి విద్యార్ధులకు అందుతున్న వైద్యం, విద్యార్థులు అనారోగ్యానికి గురి కావడానికి గల కారణాల ఫై ఆరా తీయాలని ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని మంత్రి ఆదేశించారు. మంత్రి ఆదేశాలు మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సెర్మిష్ట నూజివీడు ట్రిపుల్ ఐటి కి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. కళాశాలలో అపరిశుభ్రత లేకుండా చూడాలని మంత్రి పార్థసారథి ఆదేశించారు.