Suryaa.co.in

Editorial

కొను‘గోల్‌మాల్’పై టీఆర్‌ఎస్-బీజేపీ ఫొటోల యుద్ధం

– బీజేపీ ప్రముఖులతో స్వాములు ఉన్న ఫొటోలు విడుదల చేసిన టీఆర్‌ఎస్
– నందకుమార్ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అనుచరుడేనంటున్న తెరాస
– బాలరాజు అనుచరుడి కారు ఫొటో విడుదల చేసిన బీజేపీ
– టీఆర్‌ఎస్ నేతలతో నందు ఫొటోలు విడుదల చేసిన బీజేపీ
– రోహిత్‌రెడ్డి-నందకుమార్ వ్యాపార భాగస్వాములంటున్న బీజేపీ
– వ్యాపారభాగస్వామి నందుని రోహిత్‌రెడ్డి ఇరికించడం సాధ్యమేనా?
– మరి అలాగైతే పీఠాథిపతులను నందకుమారే ఇరికించారా?
– పట్టుబడ్డ నగదుపై కనిపించని స్పష్టత
– వివరాలు ప్రకటించని పోలీసులు
– ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు
( మార్తి సుబ్రహ్మణ్యం)

మళ్లీ అచ్చం అప్పట్లో రేవంత్‌రెడ్డిపై వేసిన ట్రాప్‌కు జిరాక్సే. కాకపోతే పాత్రధారులు వేరు. వల వేసిన సూత్రధారి మాత్రం అప్పుడూ-ఇప్పుడూ ఒక్కరే. అప్పుడు రేవంత్‌రెడ్డి టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ ఇంట్లో దొరికిపోతే, ఇప్పుడు ఢిల్లీ నుంచి వచ్చిన స్వాములోర్లు మాత్రం ఓ ఫాంహౌస్‌లో అడ్డంగా చిక్కారు. కెమెరాలు, మైకులు, పోలీసుల హడావిడి.. మిగిలిన ట్రాప్ కథంతా సేమ్ టు సేమ్. ఆ తర్వాత జరుగుతున్న హైడ్రామానే కొంచెం రొటీన్ భిన్నంగా సాగుతోంది. అప్పుడు రేవంత్‌రెడ్డికి అందుబాటులో ఎదురుదాడి అస్త్రాలు లేవు. వార్ వన్ సైడే. ఇప్పుడు టీఆర్‌ఎస్-బీజేపీకి బోలెడన్ని అస్త్రశస్త్రాలు. అవన్నీ ఫొటోలు, వీడియోలే. పైగా పట్టుబడింది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఫాంహౌసులో.

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, హర్షవర్ధన్‌రెడ్డి, రేగా కాంతారావు, పైలెట్ రోహిత్‌రెడ్డిని కొనుగోలు చేసే లక్ష్యంతో, ఢిల్లీ-తిరుపతి నుంచి స్వాములు రంగంలోకి దిగారన్నది పోలీసుల ఆరోపణ. అందులో తిరుపతికి చెందిన సింహయాజులు అనే స్వయంప్రకటిత పీఠాథిపతికి, టీఆర్‌ఎస్ నేత పైలెట్ రోహిత్‌రెడ్డి శిష్యుడన్నది ఒక కథనం.

సదరు స్వామి ద్వారానే ఈ కథంతా నడిచిందట. తిరుపతి స్వామికి ఘజియాబాద్ స్వామి రామచంద్ర భారతి మార్గదర్శనం చేసి, మిగిలిన కథకు దర్శకత్వం వహించారన్నది పోలీసుల ఆరోపణ. వారిని నందకుమార్ అనే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అనుచరుడు, పైలెట్ రోహిత్‌రెడ్డికి చెందిన ఫాంహౌసుకు తీసుకువచ్చారని పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కథనం.

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి వంద కోట్లు ఆఫర్ చేసి, ముందు 15 కోట్లు అడ్వాన్సుగా తీసుకురాగా, నగదును పట్టుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సమాచారంతో తాము రంగప్రవేశం చేశామని స్టీఫెన్ రవీంద్ర మీడియాకు చెప్పారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హుటాహుటిన ప్రగతిభవన్‌కు వెళ్లడం, ఈ హైడ్రామాపై బీజేపీ దళపతి బండి సంజయ్ ప్రెస్‌మీట్ పెట్టి.. ఇదంతా కామెడీ కథగా కొట్టిపారేయడం, బీజేపీ తీరుకు నిరసనగా టీఆర్‌ఎస్ కార్యకర్తలు, మంత్రులు శ్రీనివాసగౌడ్, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్‌రెడ్డి ధర్నాలు చేయడం శరవేగంగా జరిగిపోయాయి.

ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్-బీజేపీ వ్యూహబృందాలు యుద్ధవేదికను సోషల్‌మీడియా కేంద్రంగా మార్చాయి.bjpతొలుత కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి-నందు, కేంద్రమంత్రి రాజ్‌నాధ్-పీఠాథిపతి, కిషన్‌రెడ్డి-పీఠాథిపతి ఉన్న ఫొటోలను.. టీఆర్‌ఎస్ సోషల్‌మీడియా బృందం విడుదల చేసింది.

ఆ తర్వాత టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కోసం, డబ్బు సంచులతో దొరికాయంటున్న కారు తెరపైకొచ్చింది. ఆ కారు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అనుచరుడైన దిలీప్‌కుమార్‌దేనంటూ,nandu5 బీజేపీ సోషల్‌మీడియా బృందం, ఆ కారు ఫొటో విడుదల చేసింది. దానితోపాటు ఆ కారు నాగర్‌కర్నూల్ వెలదండ, హైదరాబాద్‌లో రెగ్యులర్‌గా తిరుగుతున్న చలాన్‌ను కూడా బీజేపీ సోషల్‌మీడియాలో వైరల్carచేసింది. దానితోపాటు.. నందకుమార్ టీఆర్‌ఎస్ నేతలతో ఉన్న, మరికొన్ని ఫొటోలను కూడా బీజేపీ విడుదల చేసింది. అందులో గతంలో బీజేపీలో పనిచేసి, తాజాగా టీఆర్‌ఎస్‌లో చేరిన దాసోజుశ్రవణ్, శేరి సుభాష్‌రెడ్డి, సినీ నిర్మాత-నటుడు బండ్ల గణేష్ కూడా ఉండటం విశేషం. అయితే.. నందకుమార్nandu కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అనుచరుడని టీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తుంటే, రోహిత్‌రెడ్డి-నందకుమార్ వ్యాపార భాగస్వాములని బీజేపీ ఎదురుదాడి చేస్తోంది. విచిత్రంగా .. అటు బీజేపీ-టీఆర్‌ఎస్ నేతలతో నందకుమార్ ఉన్న ఫొటోలను, రెండు పార్టీలూ విడుదల చేయడమే ఆశ్చర్యం. దీన్ని బట్టి నందకుమార్ వ్యాపార తెలివితేటలు ప్రదర్శించి, ఇరు పార్టీలతో సత్సంబంధాలు నెరుపుతున్నట్లు అర్ధమవుతోంది.

మరి నిజంగా నందకుమార్, పైలెట్ రోహిత్‌రెడ్డి వ్యాపార భాగస్వామి అయితే.. పైలెట్ రోహిత్‌రెడ్డి తన వ్యాపార భాగస్వామి అయిన నందకుమార్‌ను కూడా, కావాలనే ఇరికించారా అన్నది మరో సందేహం. అలాకాకుండా నందకుమారే.. తన మిత్రుడు రోహిత్‌రెడ్డి కోసం, పీఠాథిపతులను ఫాంహౌసుకు తెచ్చి వారిని ఇరికించారా అన్నది మరో అనుమానం.

అసలు ఈ మొత్తం వ్యవహారంలో.. దొరికిన నగదు ఎంతన్న దానిపై ఎవరూ స్పష్టత ఇవ్వకపోవటం మరో గందరగోళానికి దారితీస్తోంది. కొందరు 15 కోట్లు పట్టుబడ్డాయని చెబుతుంటే, మరికొందరు మాత్రం కోటిరూపాయలే దొరికాయని చెబుతున్నారు. అయితే మీడియాలో మాత్రం 15 కోట్లు పట్టుబడినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అటు పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కూడా, అధికారికంగా స్పష్టత ఇవ్వకపోవడం ఆశ్చర్యం. గతంలో రేవంత్‌రెడ్డి పట్టుబడినప్పుడు, నయాపైసలతో లెక్కలు చెప్పిన పోలీసులు, ఇప్పుడు మాత్రం వాటిని బయటపెట్టకపోవడమే విశేషం.

LEAVE A RESPONSE