– అఖిలేష్‌కు టీఆర్‌ఎస్, వైసీపీ నిధుల సాయం?
– ఏపీ నుంచి స్పెషల్ ఫ్లెయిట్‌లో యుపీకి నిధులు
– మానిటరింగ్ చేసిన లిక్కర్ బాబులు
– గెలిస్తే అక్కడా ఏమీ తరహా ‘పిచ్చి మందు’ అమ్మకాల డీల్
– ఢిల్లీ నుంచి యుపీ చేరిన తెలంగాణ డబ్బు
– కేంద్రం అప్రమత్తతతో కొంత బ్రేక్
– బీజేపీ జాతీయ సత్యకుమార్ పేల్చిన బాంబుతో ఆగమాగం
– రంగంలోకి దిగిన కేంద్ర నిఘా వర్గాలు
– ఎయిర్‌పోర్టుల్లో ప్రైవేటు విమానాల వివరాలపై నజర్
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఎన్నికల్లో ఇది మామూలే అయినప్పటికీ ఇటీవలి కాలంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల ప్రకారమయితే మీడియాకు బిగ్ న్యూసే కాదు. బీజేపీకి బిగ్ షాక్. ఇటీవల జరిగిన యుపీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్-వైసీపీ..యుపీ మాజీ సీఎం, సమాజ్‌వాజ్‌పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో చేతులు కలిపారట. ఆ మేరకు ఒకరు ఢిల్లీ నుంచి, మరొకరు బెజవాడ నుంచి ప్రత్యేక ప్రైవేట్ విమానాల ద్వారా అఖిలేష్ పార్టీకి నిధుల వరద పారించారట. అయితే, తెలంగాణ నుంచి సగం వరకూ వెళ్లిన నిధులు.. కేంద్ర నిఘా దళాల అప్రమత్తతో మిగిలిన సగం నిధులు, ఢిల్లీ నుంచి పంపిణీ కాకుండా నిలిచిపోయాయట. యుపీ ఎన్నికల్లో 23 జిల్లాలను పర్యవేక్షించిన అక్కడి బీజేపీ రాష్ట్ర కో ఇన్చార్జి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పార్టీకి ఉప్పందించడంతో ఈ నిధుల కథ నిగ్గుతేలిందట.
యుపీలో విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీని ఓడించేందుకు దేశంలోని అనేక శక్తులు, వ్యక్తులు ఏకమయ్యాయి. యోగిని ఓడించడమే వారి ఉమ్మడి లక్ష్యం. తద్వారా మోదీని బలహీనపరచడం మరో వ్యూహం. వారిలో కొందరు ప్రత్యక్షంగా, మరికొందరు పరోక్షంగా అక్కడి సమాజ్‌వాదీ పార్టీకి, ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌కు సహకరించారు. కొందరు తమ నాయకులకు ప్రచారానికి పంపించగా, మరికొందరు నిధుల సాయం చేశారు. సహజంగా ఇది ఎక్కడయినా జరిగేదే. గత కర్నాటక ఎన్నికల్లో బీజేపీని విబేధించిన టీడీపీ జనతాదళ్ ఎస్‌కు సాయం చేయగా, టీఆర్‌ఎస్ కాంగ్రెస్‌కు, బీజేపీకి వైసీపీ సాయం చేసిన విషయంపై పెద్ద చర్చ జరిగిన విషయం తెలిసిందే.
ఇప్పుడు యుపీ ఎన్నికల్లో మాత్రం ఈ సాయం వ్యవహారం చిత్ర విచిత్రానికి గురిచేస్తోంది. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ, రాష్ట్ర స్థాయిలో బీజేపీని విబేధిస్తున్నప్పటికీ జాతీయ స్థాయిలో మాత్రం బీజేపీతో సత్సంబంధాలు నిర్వహిస్తోంది. ప్రధాని కార్యాలయం నుంచి బీజేపీ అగ్ర నేతల వరకూ, వైసీపీ సీనియర్ నేతలు వ్యక్తిగత సంబంధాలు కొనసాగిస్తున్నారన్నది బహిరంగ రహస్యం. టీటీడీ పాలకమండలి ఏర్పాటుచేసే ముందు, కొందరు వైసీపీ నేతలు స్వయంగా తమతో సంబంధాలున్న కేంద్రమంత్రుల వద్దకు వెళ్లి, సిఫార్సు లేఖలు తీసుకున్న విషయం రహస్యమేమీ కాదు.
రాష్ట్ర బీజేపీ నేతలు వైసీపీ సర్కారు నిధుల దుర్వినియోగంపై యుద్ధం చేస్తున్నా, కేంద్రం ఏదో ఒక రూపంలో నిధులిచ్చి రాష్ట్రాన్ని ఆదుకుంటూనే ఉంది. ఇక కొడాలి నాని, పేర్ని నాని, కన్నబాబు వంటి మంత్రులు.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులను ప్రశ్నిస్తుంటే, విజయసాయిరెడ్డి వంటి ఎంపీలు మాత్రం కేంద్రాన్ని మెచ్చుకుంటూ ప్రకటనలిస్తుంటారు.
ఇక వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రిని అరెస్టు చేయకుండా.. అక్రమాస్తుల కేసులో ముద్దాయిగా ఉన్న జగన్ ప్రతివారం సీబీఐ కోర్టుకు హాజరుకాకుండా కేంద్రంలోని బీజేపీ అడ్డుచక్రం వేస్తోందని కాంగ్రెస్, వామపక్షాలు విరుచుపడుతున్నాయి. ఆ ప్రకారంగా చూస్తే కేంద్ర స్థాయిలో బీజేపీ-వైసీపీ సంబంధాలు సవ్యంగా ఉన్నట్లు స్పష్టమవుతూనే ఉంది. దానివల్ల బీజేపీ కొంత అప్రతిష్టాలవుతున్నప్పటికీ.. ఆ పార్టీకి రాష్ట్రంలో కనీస బలం కూడా లేనందున, బీజేపీ నాయకత్వం వాటిని పెద్దగా పట్టించుకోనట్లు కనిపిస్తోంది.
మరి రాష్ట్రంలో పరిపాలన సవ్యంగా సాగేందుకు, వ్యక్తిగతంగా జగన్‌కు ఎంతో మేలు చేస్తున్న బీజేపీని ఓడించేందుకు… వైసీపీ నాయకులు యుపీకి వెళ్లి, అఖిలేష్‌యాదవ్‌తో డీల్ కుదుర్చుకోవడమే రాజకీయ విశ్లేషకులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. యుపీలో బీజేపీని 23 జిల్లాల్లో గెలిపించిన ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ చేధించిన ఈ రాజకోట రహస్యం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.
‘‘యుపీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలయిన జగన్-కేసీఆర్ దొడ్డిదారిన కృషి చేశారు. అఖిలేష్‌యాదవ్ ఒకవేళ పొరపాటున గెలిస్తే అక్కడ కూడా ఏపీలో మాదిరిగానే రకరకాల మద్యం బ్రాండ్లు అమ్మడానికి డీల్ కుదుర్చుకున్నారు. అందులో భాగంగా కొన్ని నిధులు యుపీకి చేరవేశారని మాకు తెలిసింది. ఆ మేరకు నిఘా వేశాం. పూర్తి వివరాలు బయటకొస్తే వైసీపీని ప్రజాక్షేత్రంలో బీజేపీ బట్టలూడదీయడం ఖాయమ’ని సత్యకుమార్ జంగారెడ్డి గూడెంలో విలేకరుల సమావేశంలో బాంబు పేల్చారు.
కానీ, మీడియాలో పరిపక్వత లేని కారణంగా, సత్యకుమార్ చేసిన ఆరోపణ ప్రాధాన్యం వారికి తెలియకుండా పోయింది. తెలుగు రాష్ట్రాలలో ప్రకంపనలు పుట్టించే ఆయన ఆరోపణల సారాన్ని మీడియా గ్రహించినట్లు
లేదు. అటు ప్రింట్ మీడియాలోనూ అదే పరిస్థితి. అందుకే ఆయన వ్యాఖ్యలు ముందు మీడియాలో పెద్దగా ప్రాచుర్యం కాలేదు. కానీ ఆయన మాట్లాడిన వీడియో సోషల్‌మీడియాలో నిన్నటి నుంచి విపరీతంగా వైరల్ కావడంతో దానిపై ఆసక్తికరమైన చర్చ మొదలయింది. దానితో చానళ్లలో చర్చ మొదలయింది.
నిజానికి బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ చాలామంది మాదిరిగా అవగాహన, ఆధారాలు లేకుండా అడ్డదిడ్డంగా మాట్లాడరు. ఆయన విమర్శలు కూడా హుందాగానే కనిపిస్తుంటాయి. మిగిలిన వారిలా ప్రచారానికి పాకులాడకుండా, ఆర్గనైజేషన్‌పైనే దృష్టి సారించే సత్యకుమార్ సత్తా తెలిసిన బీజేపీ నాయకత్వం, ఆయనకు ఉత్తరప్రదేశ్ వంటి అతి పెద్ద రాష్ట్రానికి కో ఇన్చార్జిగా నియమించింది. అండమాన్-నికోబార్ రాష్ట్రాలకు ఇన్చార్జిగా నియమించింది. ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక నాయకుడికి ఈ స్థాయిలో బాధ్యతలు అప్పగించడం ఇదే తొలిసారి.
యుపీలో 23 జిల్లాలకు ఇన్చార్జిగా ఉన్న సత్యకుమార్, తన పరిథిలోని మొత్తం 134 నియోజకవర్గాల్లో 101 స్థానాలు బీజేపీ గెలిచేలా అక్కడి శ్రేణులను కదిలించారు. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక క్యాడర్‌లో ఉత్సాహం నింపి, ఫలితాలను రాబట్టుకున్నారు. కాన్పూర్‌లోని కన్యా-బుందేల్‌ఖడ్ ప్రాంతాల్లో ఆర్గనైజేషన్ ఇన్చార్జిగా కీకలపాత్ర పోషించిన సత్యకుమార్ కొన్ని నెలల నుంచే అక్కడ బైఠాయించి, ఎన్నికల్లో పనిచేశారు. అక్కడి విజయం ఆయనది కాకపోయినా, క్యాడర్‌తో పనిచేయించి, ఫలితం రాబట్టడమే నిజమైన నాయకుడి లక్షణం. యుపీలో సత్యకుమార్ అదే పనిచేశారన్నది బీజేపీ వర్గాల సమాచారం.
అలాంటి సత్యకుమార్ యుపీలో ఉండగనే, ఏపీ నుంచి వైసీపీకి చెందిన కొందరు సమాజ్‌వాదీపార్టీకి నిధులు ఇచ్చేందుకు సిద్ధమయినట్లు ఉప్పందిందట. దానితో ఆయన ప్రభుత్వ వర్గాలను అప్రమత్తం చేయడంతోపాటు, పార్టీపరంగా ఒక పరిశోధన బృందాన్ని ఏర్పాటుచేశారట.
ఆ ప్రకారంగా… ప్రస్తుతం ఏపీలో మద్యం అమ్మకాల వ్యవహారాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న చెన్నైకి చెందిన ఓ వైసీపీ యువనేత, పాలకులకు దగ్గర బంధువు కూడా అయిన సదరు నాయకుడితోపాటు, రాష్ట్రంలో మద్యం తయారీ కంపెనీలను స్వాధీనం చేసుకున్న మరో యువనేత కలసి అఖిలేష్‌తో చర్చలు జరిపారన్న సమాచారం సత్యకుమార్ నియమించిన బృందానికి అందిందట. ఒకవేళ అఖిలేష్‌యాదవ్ గెలిస్తే.. అక్కడ కూడా ఏపీలో మాదిరిగానే రకరకాల బ్రాండ్లతో మద్యం అమ్మకాలను డిజిటల్ రూపంలో కాకుండా, క్యాష్ రూపంలోనే జరిపేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సత్యకుమార్ నియమించిన వేగులు తేల్చారట.
అందుకు అఖిలేష్ కూడా అంగీకరించిన తర్వాత.. ఒప్పందంలో భాగంగా నగదును యుపీకి చేర్చారట. అందుకు ఒక పారిశ్రామికవేత్తకు చెందిన ప్రైవేటు హెలికాప్టర్‌ను వాడుకున్నారట. సహజంగా ఎయిర్‌పోర్టులు కేంద్ర అధీనంలో ఉంటున్నప్పటికీ, నిర్వహణ-పెత్తనం అంతా రాష్ట్రాలదే ఉంటుంది. అందుకే ప్రైవేట్ విమానాలు, హెలికాప్టర్ల విషయంలో తనిఖీ అంత పెద్దగా ఉండదు. ఇన్‌ఫ్రా, ఇరిగేషన్‌లో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు ఉండే సొంత హెలికాప్టర్లను, అధికార పార్టీ ఎక్కువగా వినియోగిస్తుంటుంది.
యుపీకి డబ్బులు పంపే విషయంలోనూ అదే జరిగినట్లు సత్యకుమార్ నియమించిన బృందం చేసిన పరిశోధనలో తేలిందట. కాగా, మద్యం అమ్మకాలను డీల్ చేస్తున్న వైసీపీకి చెందిన, సదరు చెన్నై నేత ప్రయాణించిన ప్రైవేట్ హెలికాప్టర్‌పై కేంద్ర నిఘాదళం ఆరా తీస్తున్నట్లు బీజేపీ వర్గాల సమాచారం.
అయితే తెలంగాణ నుంచి టీఆర్‌ఎస్ పంపిన నిధుల్లో కొంతమేరకే యుపీకి చేరినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి రెండు అధికార పార్టీలు యుపీకి డబ్బులు పంపిస్తున్న వైనాన్ని తెలుసుకున్న సత్యకుమార్, పార్టీ నాయకత్వానికి సమాచారం ఇవ్వడం, దానితో నిఘా దళాలు అప్రమత్తమై స్పందించడంతో.. మిగిలిన డబ్బు యుపీకి తరలిపోకుండా ఢిల్లీలోనే నిలిచిపోయిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
సరే.. కేసీఆర్ అంటే ఇటీవలి కాలంలో బీజేపీతో నేరుగా పంచాయితీ పెట్టుకున్నారు కాబట్టి, టీఆర్‌ఎస్ పార్టీ రాజకీయంగా యుపీలో అఖిలేష్‌కు నిధులు పంపించి ఉంటుందన్న అంశంలో కొంత అర్ధం ఉండవచ్చు. కానీ, ప్రభుత్వ పరంగా కేంద్రంతో సత్సంబంధాలు ఉండి, ఎప్పటికప్పుడు నిధులు తెచ్చుకుంటూ, వ్యక్తిగతంగా కేసుల్లో ఊరట పొందుతున్న వైసీపీ నాయకత్వం కూడా, కేసీఆర్ దారిలో నడవటమే బీజేపీ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.
అయితే, దానిపై ఆ పార్టీ నేతల వాదన ఆసక్తికరంగా ఉంది. ‘‘యుపీలో బీజేపీ ఓడిపోతే సంస్థాగతంగా పార్టీ-ప్రభుత్వం బలహీనపడుతుందన్నది వారి ఆలోచన. అప్పుడు రాష్ట్రపతి-ఉప రాష్ట్రపతి ఎన్నికలతోపాటు, సభలో బిల్లుల పాస్ కోసం బీజేపీ తమ పై ఆధారపడాలన్నది వైసీపీ-టీఆర్‌ఎస్ అసలు ప్లాన్. ఎవరి మద్దతు అవసరం లేకుండానే బీజేపీ అధికారంలోకి రావడంపై జగన్ అప్పుడే నిరాశ వ్యక్తం చేయడాన్ని మీరు మర్చిపోవద్దు. రెండు రాష్ట్రాల్లో బీజేపీ రాజకీయంగా బలపడుతుండటం ఇద్దరికీ ఇష్టం లేదు. బీజేపీ తమ చెప్పుచేతల్లో ఉండాలంటే బీజేపీకి బలం ఉన్న యుపీలో దెబ్బకొట్టాలన్నదే కేసీఆర్-జగన్ అసలు వ్యూహం. అందుకే ఇద్దరూ బీజేపీని ఓడించేందుకు అఖిలేష్‌కు నిధులు పంపారు. ఈ విషయాన్ని మా పార్టీ జాతీయ నేత సత్యకుమార్ బయటపెట్టి ఇన్ని గంటలయినా, వైసీపీ ఎందుకు ఖండించలేదు. మాపై ఎగిరిపడే ఆ పార్టీ నేతలు, మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారు? అంటే సత్యకుమార్ చేసిన ఆరోపణల్లో నిజం ఉన్నట్టే కదా’ అని బీజేపీ నేత లంకా దినకర్ వ్యాఖ్యానించారు.
పీకే ప్లానేనా ఇది?
అయితే.. బీజేపీకి వ్యతిరేకంగా జరిగిన ఈ ‘ఆపరేషన్ యుపి బీజేపీ’ మిషన్ కథకు ప్రశాంత్ కిశోర్ దర్శకత్వం వహించినట్లు బీజేపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఏపీలో జగన్‌కు మార్గదర్శకత్వం వహించిన అదే పీకే.. ఇప్పుడు తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను గెలిపించే కాంట్రాక్టు తీసుకున్న విషయం తెలిసిందే. కాబట్టి ఉమ్మడి పార్టీలకు వ్యూహకర్తగా ఉన్న పీకేనే, ఈ నిధుల వ్యవహారాన్ని నడిపించినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. ‘ఇదంతా పీకే ప్లాన్ ప్రకారమే జరిగినట్లు అనుమానించాల్సి ఉంది. ఆయన జగన్-కేసీఆర్‌కు సలహాదారు. యుపిలో ప్రజాక్షేత్రంలో బీజేపీని ఓడించే దమ్ము లేకనే పీకేను రంగంలోకి దింపారు. ఆయన పప్పులు ఈసారి తెలుగు రాష్ట్రాల్లో ఉడకవు’ అని బీజేపీ నేత లంకా దినకర్ స్పష్టం చేశారు.