– వంగవీటి రంగాను చంపినట్టు హత్యలు చేస్తారా..ఏమిటీ ఉన్మాదం..?
– గతంలోనూ నన్ను ఎలిమినేట్ చేస్తే.. రూ.50 లక్షల చందా ప్రకటించారు
– పనిలో పనిగా ఎల్లో మీడియా ఖమ్మంలో నిరసన సెగ అంటూ దుష్ప్రచారం
– దాడులు చేస్తే.. చేతులు కట్టుకుని చూస్తూ ఊరుకోం
– నిన్న ఖమ్మం సమీపంలో కారుపై జరిగిన ఘటనపైనా అనుమానాలు
– కులం మీకే కాదు…మాకూ కులం ఉంది
– చంద్రబాబుకు అవినీతి చేసి జైలుకు వెళ్తే మేమా బాధ్యులం..?
– బాబుకు ప్రాణహానా…? అనారోగ్యమా..ఏది నిజం..?
– అవన్నీ బెయిల్ కోసం పాకులాడే పన్నాగాలే
మంత్రి అంబటి రాంబాబు
జరిగింది ‘దాడి’.. నిరసన సెగ కాదు
తెలంగాణలో ఈరోజు జరిగే ఒక నిశ్చితార్థానికి హాజరయ్యేందుకు ఖమ్మం వెళ్లాను. రాజానగరంలో జక్కంపూడి రాజా సోదరుని వివాహానికి హాజరై ఖమ్మం వెళ్లేక్రమంలో నేను ప్రయాణించే కారుకు స్వల్ప ప్రమాదం జరిగింది. దాంతో పెద్దగా నేను ఇబ్బంది పడనప్పటికీ ఈరోజు ఉదయం నేను బస చేసి వస్తున్న హోటల్ ముందు మరో సంఘటన జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా తమకు తాము చెప్పుకుంటూ.. నామీద కొందరు కులోన్మాదులు దాడికి ప్రయత్నించారు. దీనిపై కొన్ని పచ్చ మీడియా ఛానెళ్లు రకరకాల కథనాల్ని అల్లారు. ‘అంబటికి తెలంగాణలో నిరసన సెగ’ ‘ఖమ్మం ప్రజలు అంబటిపై తిరుగుబాటు’ అంటూ స్క్రోలింగ్ పెట్టుకున్నారు. అంతేగానీ, నామీద జరిగింది ‘దాడి’ అని మాత్రం ఆ ఛానెళ్లు చెప్పలేకపోయాయి.
చందాలేసుకుని లేపేస్తారట
మంత్రిగా నేనొక ప్రైవేటు కార్యక్రమానికి వెళితే నామీద దాడికి ప్రయత్నిస్తే.. అది నిరసన సెగ ఎలా అవుతుంది..? దాడికి పాల్పడిన వాళ్ల చేతుల్లో కర్రలు ఉన్నాయి. వాళ్లు నా మీద బూతులు తిడుతూ ఏ రకంగా ప్రవర్తించారో ఛానెళ్లల్లో అందరూ చూశారు. అసలు, నేనేమీ రాజకీయ ప్రసంగాల కోసం అక్కడకు వెళ్లలేదే.. ? మరి, ఎందుకు వారు నామీద దాడికి ప్రయత్నించారు..? వారిలో కొందరేమో.. ‘ఏయ్, అంబటి రాంబాబు నిన్ను వేసేస్తాం.. అందరం చందాలేసుకుని లేపేస్తాం..’ అని కేకలేశారు.
నాటి సామాజికవర్గ హెచ్చరికలే నేడు వినిపించాయి
జరిగిన ఘటనపై నేను ఆలోచిస్తే.. గతంలో అదే ఖమ్మంలో జరిగిన ఒక సామాజికవర్గ కార్తీక వనసమారాధనలో కొందరు నన్ను ఉద్దేశించి అన్న మాటలు గుర్తుకొచ్చాయి. అప్పటి కార్యక్రమంలో ఆ సామాజికవర్గం వారంతా మైకుల్లో బహిరంగంగానే ‘అంబటి రాంబాబును చందాలేసుకుని మరీ భౌతికంగా లేపేస్తాం..’ అని రంకెలేశారు. నన్ను ఎలిమినేట్ చేస్తేనో.. నన్ను భౌతికంగా లేకుండా చేయడానికి తన వంతు చందాగా రూ.50 లక్షలు ఇస్తానంటూ ఆ సామాజికవర్గానికి చెందిన ఒక నాయకుడు బహిరంగంగా ఆఫర్ ఇచ్చాడు. సరిగ్గా, అవే మాటలతో ఇప్పుడు నామీద దాడి చేసినోళ్ల నోటి వెంట కూడా వినిపించాయి.
డబ్బుమదమా..? సామాజికవర్గ కులోన్మాదమా..?
ఈ విధంగా నామీద జరిగిన దాడి తీరును మనం ఎలా అర్ధం చేసుకోవాలి..? ఈ సంఘటన తర్వాత నేను హాజరవ్వాల్సిన నిశ్చితార్ధానికి వెళ్లాను. ఆ తర్వాత పోలీసుల్ని అడిగి.. నామీద దాడికి ప్రయత్నించిన వారి వివరాల్ని తెలుసుకున్నాను. మొత్తం ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్నామని వాళ్లు చెప్పారు. నిజానికి వారు తెలుగుదేశం పార్టీకి చెందినోళ్లో కాదో తెలియదు గానీ.. వారంతా మాత్రం ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులని తేలింది.
ఏంటి మీ కులోన్మాదం..? అని ఆ సామాజికవర్గాన్ని అడుగుతున్నాను. ఈ కులోన్మాదంతోనే గదా గతంలో మీరు వంగవీటి మోహనరంగాను నడిరోడ్డుపై హతమార్చింది..ఇదే కులోన్మాదం తోనే ముద్రగడ పద్మనాభాన్ని, ఆయన కుటుంబ సభ్యుల్ని తీవ్రంగా అవమానించి వేధింపులకు గురిచేశారు. మరీ, ఇంత డబ్బు మదంతో వ్యవహరిస్తారా..? ఇది చాలా దుర్మార్గమైన పద్ధతి. కొన్ని ఛానెళ్లు దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే, ఆ ఛానెళ్లు కూడా అదే సామాజికవర్గానికి చెందినవేనని గుర్తుచేస్తున్నాను.
మీ కులోన్మాదానికి రోజులు చెల్లాయి
అధికారం, డబ్బుమదంతో వ్యవహరిస్తున్న ఆ సామాజికవర్గానికి నేనొకటే హెచ్చరిక చేస్తున్నాను. డబ్బుమదంతో కొట్టుకుంటున్న మీ కులోన్మాదానికి రోజులు చెల్లాయని చెబుతున్నాను. ఒక మంత్రినై ఉండి శుభకార్యానికెళ్తే బంధువుల మధ్యనే నామీద మీరు దాడి చేస్తే.. ఏంటి మీ కుల అహంకారం..? అని ప్రశ్నిస్తున్నాను. ఇంత ఉన్మాదంతో ప్రవర్తిస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరని మనవి చేస్తున్నాను.
నేను చిన్నప్పట్నుంచీ మీ కులోన్మాదాన్ని గమనిస్తున్నాను. ఈ కులోన్మాదంతోనే గతంలో అనేకమందిని పొట్టనబెట్టుకున్నారు. మీ కుల అహంకారంతో మమ్మల్ని ఏదో చేద్దామంటే, మేమేమీ బెదిరిపోతాం అనుకోకండి. ఇలాంటి నీచమైన, దుర్మార్గమైన పోకడలకు పోయే వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని మనవి చేసుకుంటున్నాను. సమాజం ఈ సామాజికవర్గ పెత్తందారీ పోకడలపై ఆలోచన చేయాల్సిన వాతావరణమిది.
ఓర్వలేని సామాజికవర్గ దాడిని ఖండించాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నింటా వైఎస్‌ఆర్‌సీపీకి మద్ధతు లభిస్తుంటే.. అన్ని కులాలు ఏకతాటిమీదకొచ్చి మా నాయకులు జగన్‌గారిని పొగుడుతుంటే.. మీరు మాత్రం మామీద దాడి చేయడానికి ప్రయత్నిస్తారా..? ఏంటి మీ సామాజికవర్గానికి మామీద అంత కడుపు మంట..? అని అడుగుతున్నాను. చంద్రబాబుకు ఏదో జరిగిందని మీకు బాధ కలిగితే.. అందుకు మేమా బాధ్యులం..? ఆయన జైలుకు పోవడంలో మా ప్రమేయమేముంది..?
చంద్రబాబు తప్పు చేశాడు కనుకే ఆయన ఈరోజు కటకటాల వెనకున్నాడు. ఆయన మీ సామాజికవర్గమైతే అవ్వొచ్చు. మీ కులానికే ఆయన్ను పరిమితం చేసుకోవడంలో మాకెలాంటి అభ్యంతరంలేదు. కానీ, అన్యాయంగా దాడులు చేస్తే చేతులు కట్టుకు కూర్చోడానికి మేం సిద్ధంగా లేమని మనవి చేస్తున్నాను. మీ కులోన్మాద అహంకారానికి కాలం చెల్లిందని, దాడుల సంస్కృతికి ఫలితాలు రావని మీకు నేను హెచ్చరిక చేస్తున్నాను. ఇలాంటి కులోన్మాదుల దాడులను సమాజమంతా ఖండించాలని కోరుతున్నాను.
1989లో రాజకీయాల్లోకి వచ్చాను. అప్పట్నుంచీ ఇప్పటిదాకా రాజకీయాల్లోనే ఉన్న వ్యక్తిని నేను. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వెంట నడిచిన వ్యక్తిని. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కి మొదట్నుంచీ తోడుగా నిలిచిన వ్యక్తిని. అలాంటి నాపై దాడి ఎందుకు చేశారు..? ఎందుకు చేయాలనుకుంటున్నారు. ఈరోజు వైఎస్‌ఆర్‌సీపీ తరఫున మేము సామాజిక, సాధికార యాత్ర చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అన్ని కులాల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ఎక్కడ చూసినా అన్ని కులాలు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని పొగుడుతున్నాయి.
ప్రమాదానికి, దాడికీ లింకుపై అనుమానం
నిన్ననేమో నేను ప్రయాణించే కారుకు ప్రమాదం చోటుచేసుకుంది. ఈరోజేమో ఆ సామాజికవర్గం వారు నామీద దాడికి ప్రయత్నించారు. ఈ రెండు ఘటనలకూ లింకు ఉందేమోననే అనుమానం కూడా కలుగుతుంది. ఆ దిశగా విచారణ చేయాల్సిన అవసరమూ ఉంది. నా కారు మీద నిన్న లారీ నుంచి రెండు గోధుమల బస్తాలు పడటంలో కూడా ఆ సామాజికవర్గ కుట్ర ఏమైనా ఉండొచ్చేమో.. తెలంగాణలో దాడి ఘటనపై సూమోటో కేసు బుక్కయ్యింది. ఎంక్వైరీ చేస్తే నిజాలన్నీ బయటకొస్తాయి.
కులోన్మాదం మీకే ప్రమాదం
కడుపులో ఏదో కుట్ర పెట్టుకుని మనుషుల్ని భౌతికంగా లేకుండా చేయాలనుకుంటే మీ కులోన్మాదం మీకే ప్రమాదమని హెచ్చరిక చేస్తున్నాను. ఎందుకంటే, కులం మీకే పరిమితం కాదు. మాకూ కులం ఉంటుందని తెలుసుకోండి. నన్ను అనేకమార్లు అదే సామాజికవర్గం టార్గెట్ చేస్తుంది. చేస్తే చేసుకోండి.. నేను మాత్రం ఏ తప్పూ చేయడం లేదు. కేవలం, మీ తప్పుల్ని సూటిగా నిక్కచ్చిగా చెప్పడం తప్ప. ఇది మీకు నచ్చకపోతే రాజకీయంగా నాతో పోరాడాలి గానీ దాడులకు దిగితే బెదిరేది లేదని మనవి చేసుకుంటున్నాను.
బెయిల్‌కు పాకులాటలో భిన్న కథనాలు
చంద్రబాబుకు జైల్లో ప్రాణహాని ఉందని ఒక పక్కన అంటూనే.. ఆయనకు ఆరోగ్యం బాగుండటం లేదని మరోపక్క చెబుతారు. ఈ రెండింటిలో ఏది నిజం..? జైల్లో ఖైదీకి ప్రాణహాని ఉండటమేంటి..? ఆయన భద్రతకు ఎలాంటి లోపం లేకుండా చూస్తున్నామని సాక్షాత్తూ జైలర్ చెప్పారు. చంద్రబాబు పరిసర ప్రాంతాల్లోకి ఎవర్నీ అనుమతించడంలేదని కూడా ఆయన చెప్పారు. ఇక, ఆరోగ్యం విషయానికొస్తే.. చంద్రబాబు స్వయంగా ఏసీబీ కోర్టు జడ్జి గారికి చెప్పుకున్నారు. ఏదిఏమైనా వారివన్నీ బెయిల్ కోసం పాకులాడే క్రమంలో వినిపిస్తున్న అవాస్తవాలేనని తెలుసుకోవాలి.