Suryaa.co.in

Telangana

మనమే తెలంగాణ రాష్ట్రంలో పాలను ఉత్పత్తి చేసుకోలేమా…?

-హైదరాబాద్ మహా నగరానికి గుజరాత్ అమూల్ పాలు, కర్నాటక నంది పాలు, తమిళనాడు ఆరోగ్య పాలు, చిత్తూరు హెరిటేజ్ పాలు అవసరమా…?
– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో సహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రోజు లక్షలాది లీటర్ల పాలు అవసరం ఉంటుందని, రైతులు వ్యవసాయంతో పాటు పాల ఉత్పత్తిపై దృష్టిని సారించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పిలుపునిచ్చారు.

మంగళవారం కరీంనగర్ డైరీ సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరి సుందరగిరి గ్రామంలో, హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్ గ్రామంలో, సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం అంతక పేట గ్రామంలో ఒక్కొక్క గ్రామంలో పది వేల లీటర్ల సామర్థ్యం కలిగిన మిల్క్ కూలింగ్ యూనిట్లను వినోద్ కుమార్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రతిరోజు లక్షలాది లీటర్ల పాల వినియోగం జరుగుతుందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలోని రైతులు, ఇతర ఔత్సాహిక వ్యక్తులు పాల ఉత్పత్తిపై దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు.

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంట్లో పాడి గేదెలను ఏర్పాటు చేసుకొని పాల ఉత్పత్తిని సాధించాలని ఆయన అన్నారు. ఉత్పత్తి చేసిన పాలను కొనుగోలు చేసేందుకు కరీంనగర్ డైరీ సంస్థ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గుజరాత్ రాష్ట్రానికి చెందిన అమూల్ పాలు, కర్ణాటకకు చెందిన నంది పాలు, తమిళనాడుకు చెందిన ఆరోగ్య పాలు, చిత్తూరుకు చెందిన హెరిటేజ్ పాలు సరఫరా అవుతోందని , ఈ పాలు అవసరమా..?, మనమే తెలంగాణ రాష్ట్రంలో పాలను ఉత్పత్తి చేసుకోలేమా..? అని వినోద్ కుమార్ అన్నారు.

పాల ఉత్పత్తితో అదనంగా లాభాలను అర్జించవచ్చని ఆయన అన్నారు. ప్రతినిత్యం ప్రతి ఇంట్లో అనేక రకాల ఖర్చులు పెరుగుతున్నాయని, పాల ఉత్పత్తి ద్వారా ఆ ఖర్చుల భారాన్ని అధిగమించవచ్చని వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే వి. సతీష్ కుమార్ కరీంనగర్ డైరీ సంస్థ చైర్మన్ రాజేశ్వరరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE