Suryaa.co.in

Andhra Pradesh

టీటీడీ బోర్డు..రాజకీయం – కార్పొరేట్ కలబోత

– జగన్ దారిలోనే చంద్రబాబు
– పాలకమండలి ఏర్పాటులో నిలువెల్లా స్వార్థం, రాజకీయ ప్రయోజనాలు
– బాబు జేబు సంస్థలా టీటీడీ బోర్డు
– రాజకీయ నిరుద్యోగులకి, భజన పరులకు అవకాశం
– ఇతర రాష్ట్రాల నుండి కార్పొరేట్లకు
– వీళ్లతో సనాతన ధర్మం ఎలా కాపాడగలతో ఉప ముఖ్యమంత్రి చెప్పగలరా?
– రాజకీయ ప్రయోజనాలు తప్ప దీనిలో ఆధ్యాత్మికత, భక్తిభావం ఎక్కడ ఉన్నాయి?
– బీసీ యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్

తిరుపతి: ప్రభుత్వం మారినా.. నాయకులు మారినా.. పాలకులు మారినా.. టీటీడీ అంటే, వేంకటేశ్వరస్వామి అంటే కేవలం అధికార పార్టీ నేతలకి, వాళ్లకు సహకరించే మీడియా, కార్పొరేట్ శక్తులకు పదవులు ఇవ్వడానికి తప్ప.. స్వామి వారికి సేవ చేయడానికి, హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడడం ఎక్కడా కనిపించడం లేదని బీసీ యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ధ్వజమెత్తారు.

గత ప్రభుత్వంలో తిరుమలలో అనేక నేరాలు, ఘోరాలు, పాపాలు, వివాదాలు జరిగాయి. లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి నుండి, స్వామి వారి కైంకర్యాలు, నైవేద్యం గురించి అనేక ఆరోపణలు, వివాదాలు వచ్చి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇవన్నీ సాక్షాత్తూ ఈ సీఎం చంద్రబాబు తెరలేపారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఎన్నో ఆరోపణలు చేశారు.

ఇన్ని చేసిన వీరు ఈ నూతన ప్రభుత్వ హయాంలో అయినా టీటీడీ బోర్డు విషయంలో తప్పులను సరిదిద్ది, సనాతన ధర్మాన్ని పెంపొందించే ప్రయత్నం చేయలేదని రామచంద్ర యాదవ్ దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన వీడియో విడుదల చేసారు. నూతన పాలక మండలి ఏర్పాటుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

“తిరుమల ధర్మకర్తల పాలకమండలి ఏర్పాటులో మాత్రం నిలువెల్లా స్వార్థం, రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని, అవినీతి తంతు, భజన బృందం కలయిక” కనిపిస్తోందని రామచంద్ర యాదవ్ విమర్శించారు.

“తిరుమల విషయంలో భవిష్యత్తు తరాలు క్షమించరాని తప్పులు ఈ ప్రభుత్వం చేస్తుంది. చంద్రబాబు అధికారం చేపట్టాక తిరుమల విషయంలో భక్తి, శ్రద్ధలు ఉన్నట్టు జనాల్ని మభ్యపెట్టి, బిల్డప్ కొట్టి.. అమలులోకి వచ్చే సరికి మాత్రం, గతంలో జగన్ అవలంభిస్తున్న విధానాలనే (కార్పొరేట్, రాజకీయ, అవినీతి) బాబు ప్రభుత్వం కూడా అవలంబిస్తూ.. ఈ బోర్డు తిరుమల ప్రక్షాళన కోసం కానే, కాదు కేవలం రాజకీయ, కార్పొరేట్ వ్యవహారాలను చక్కబెట్టుకోడానికే.. తిరుమల విషయంలో ప్రభుత్వం చేసే ప్రతి తప్పుని బీసీ యువజన పార్టీ ఎత్తిచూపి, పోరాడుతుంది.

చంద్రబాబు కి వచ్చే ప్రతీ అవకాశాన్ని మళ్ళీ మళ్ళీ దుర్వినియోగం చేసుకుని, స్వామివారిని రాజకీయానికి వాడుకుంటున్నారు” అంటూ రామచంద్ర యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇదేనా సనాతన ధర్మ రక్షణ? ఇటువంటి వారితో సాధ్యమా అంటూ ప్రశ్నించారు..!
ఈ నూతన బోర్డును చూస్తే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా ఉపయోగించుకుంటున్నారు తప్ప, ఏ మాత్రం భక్తి, శ్రద్ధ, హిందూ ధర్మ రక్షణ కనిపించడం లేదన్నారు. తప్పులను సరిదిద్దాలని వీళ్ళకు ఏ మాత్రం బాధ్యత లేదని పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీకి గత కొన్నేళ్ళుగా భజన చేస్తున్న మీడియా అధిపతికి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఆయనపై ఉన్న ఆరోపణల సంగతేమిటి? డ్రగ్స్, భూముల అవినీతి విషయంలో అతని పాత్రపై ఎన్నో అనుమానాలున్నాయి. సొంత సామాజికవర్గం, సొంత భజన, సొంత మనిషికి కీలక పదవిని కట్టబెట్టారు.

తెలుగుదేశం పార్టీలో రాజకీయ నిరుద్యోగులకు కొందరికి బోర్డులో పదవులు కట్టబెట్టారు. కార్పొరేట్ లాబీయింగ్ అనుభవం ఉన్న వేమిరెడ్డి కి మరోసారి అవకాశం ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి? ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు కార్పొరేట్ శక్తులకు, రాజకీయ నిరుద్యోగులకు బోర్డులో చోటు కల్పించారు.

వీళ్లతో ప్రక్షాళన సాధ్యమా?

తిరుమల కోట్లాది భక్తుల మనోభావాలను ముడి పెట్టుకున్న అతిపెద్ద పుణ్యక్షేత్రం. అక్కడ పాలనా వ్యవహారాలు, నిర్ణయాలు అన్నీ వారిపై ప్రభావితం చూపిస్తాయి. అటువంటి కీలకమైన చోట రాజకీయ, కార్పొరేట్, అవినీతి శక్తులకు చోటు ఇవ్వడంలో ప్రభుత్వ ఉద్దేశం ఏమిటి? కార్పొరేట్ లాబీయింగులు, అధికార అవసరాలు, రాజకీయ ప్రయోజనాలు తప్ప దీనిలో ఆధ్యాత్మికత, భక్తిభావం ఎక్కడ ఉన్నాయి? ఈ బోర్డు ఏర్పాటు ద్వారా తిరుమల ప్రక్షాళన, పవిత్రత ఏ విధంగా కాపాడగలరో ఈ ముఖ్యమంత్రి చెప్పగలరా? వీళ్లతో సనాతన ధర్మం ఎలా కాపాడగలతో ఉప ముఖ్యమంత్రి గారు చెప్పగలరా!?

రాజకీయాలకు, కార్పోరేట్ కి సంబంధం లేని తిరుమల కోసం మా పార్టీ నిరంతరాయంగా పోరాటం చేస్తూనే ఉంటుంది. సొంత డెయిరీ ఏర్పాటుపై ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం శ్రద్ధ లేదని అర్థమైంది. కనీసం ఆధ్యాత్మికత, పవిత్రతపై అయినా దృష్టి లేదని ఈ బోర్డు ద్వారా తేటతెల్లమయింది.

LEAVE A RESPONSE