-
బోర్డు భేటీలపై ఈఓ మాట ఫైనలంటున్న అధికారులు
-
అది చైర్మన్ విచక్షణాధికారమేనంటున్న పాలకవర్గం
-
మాజీ ఈఓ సాంబశివరావు దారిలో శ్యామలరావు?
-
మూడు నెలలకు ఒకసారి మాత్రమేనంటున్న అధికారులు
-
అయితే నెలకోసారి బోర్డు భేటీ కావాలంటున్న నిబంధనలు
-
రెండురోజుల ముందు నోటీసు ఇచ్చి మీటింగ్ పెట్టిన దాఖలాలు
-
కరుణాకర్‌రెడ్డి హయాంలో నెలకు రెండుసార్లు భేటీ అయిన వైనం
-
బ్రహ్మోత్సవాల సమయంలో రెండుసార్లు భేటీ
-
పాలకమండలిపై పట్టుకు అధికారుల యత్నం
-
బోర్డు మీటింగులు నెలకా? మూడు నెలలకా?
-
‘మూడు’ మారుతున్న బోర్డు
( మార్తి సుబ్రహ్మణ్యం)
టీటీడీ బోర్డు తొలి సమావేశం ఇటీవలే జరిగింది. అయితే మళ్లీ సమావేశం ఎప్పడు జరుగుతుంది? ఎన్నాళ్లకు జరుగుతుంది? నెలకా? మూడు నెలలకా? అసలు బోర్డు మీటింగ్ నిర్వహణపై తుది నిర్ణయం ఎవ రిది? ఈఓదా? చైర్మన్దా? చైర్మన్ విచక్షణాధికారం పనిచేస్తుందా? ఇదీ ఇప్పుడు హాట్‌టాపిక్.
టీటీడీ పాలకవర్గ సమావేశాల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. అధికారులు ఒకమాట-పాలకవర్గం మరొకమాట చెబుతుండంతో, ఎవరి మాట నెగ్గుతుందన్న ఆసక్తి వ్యక్తమవుతోంది. గతంలో సాంబశివరావు ఈఓగా ఉన్నపుడు, ప్రతి మూడునెలలకోసారి టీటీడీ బోర్డు మీటింగ్ నిర్వహించేవారు. ప్రస్తుత ఈఓ, అధికారులు కూడా అదే పద్ధతి అనురిస్తే బాగుంటుందని సూచించినట్లు సమాచారం.
అంటే మూడునెలలకోసారి బోర్డు మీటింగు నిర్వహించాలన్నది అధికారుల అభిమతం. అప్పుడయితే అధికారులపై పెద్దగా పనిభారం ఉండదు. అదే ప్రతి నె ల సమావేశం నిర్వహిస్తే.. అజెండా, దానికి సంబంధించిన వివరాలు, ఆ నెలలో జరిగిన వ్యవహారాల వివరాలు అన్నింటినీ బోర్డుకు సమర్పించాల్సి ఉంటుంది. అందుకు ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది. పైగా ప్రతి నెల భేటీ నిర్వహిస్తే, పాలకవర్గానికి అధికారులపై పట్టు లభిస్తుంది.
సహజంగా అధికారులు తమపై పాలకవర్గం పెత్తనం చేస్తే సహించలేరు. అసలు అలాంటి అవకాశమే వారికి ఇవ్వరు. బోర్డులో ఎవరైనా నోరున్న సభ్యులతో మాత్రమే జాగ్రత్తగా వ్యవహరిస్తారు. పొరపాటున చైర్మన్, లేదా సభ్యులెవరైనా అత్యుత్సాహం ప్రదర్శించి లెక్కలు, వివరాలు అడిగి ఇబ్బంది పెడితే, వారిపై సీఎంకు ఫిర్యాదు చేస్తుంటారు. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగిన దాఖలాలు అనేకం.
జగన్ జమానాలో టీటీడీని శాసించిన జేఈఓ ధర్మారెడ్డికి మంత్రులు, ఎమ్మెల్యేలే భయపడేవారు. అసలు ఆయన వారిని ఖాతరు చేసేవారు కాదు. వైఎస్ హయాంలో చైర్మన్, సభ్యులు కొంత స్వతంత్రంగా వ్యవహరించేవారు. ఈఓ ప్రతిపాదనలను గుడ్డిగా సమర్ధించకుండా చర్చ పెట్టేవారు. అందులో కొందరు సభ్యులయితే, తమకు నచ్చని అంశాలపై డిసెంట్‌నోట్ ఇచ్చేవారు. బహుశా ఆ కారణాల వల్లనే ఏ ఈఓ అయినా , వీలైనంత తక్కువ సార్లు బోర్డు మీటింగు జరగాలని కోరుకుంటారు. ఇప్పుడూ అదే జరుగుతున్నట్లుంది.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో బోర్డు చైర్మన్, పాలకవర్గానికి స్వేచ్చ ఉండేది. అధికారుల పెత్తనం-జోక్యం పరిమితంగానే ఉండేది. టీడీపీ హయాంలో ప్రతిసారీ అధికారుల పెత్తనమే ఎక్కువగా ఉంటుంది. కృష్ణమూర్తి చైర్మన్‌గా ఉన్పప్పుడే ఈఓ సాంబశివరావు, మూడునెలలకోసారి బోర్డు మీటింగ్ అన్న నిబంధన చూపించి, ఆ మేరకు అమలుచేశారు. ఇప్పటి అధికారులు కూడా ఆయననే అనుసరించాలని కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది.
అయితే అధికారుల ప్రతిపాదనపై, పాలకమండలి ఎలా స్పందిస్తుందోనన్న ఆసక్తి కనిపిస్తోంది. మూడునెలలకు ఒక భేటీ అంటే ఏడాదికి మూడుసార్లు మాత్రమే భేటీ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల బోర్డులో పదవులు తీసుకోవడం వృధా అన్నది సభ్యుల అభిప్రాయం. అదే ప్రతినెల సమావేశం నిర్వహిస్తే, టీటీడీలో జరిగే విషయాలతోపాటు, తమ దృష్టికి వచ్చిన అంశాలను బోర్డులో చర్చించి వాటిని పరిష్కరించే అవకాశం ఉంటుందన్నది వారి మనోభావన.
అసలు మూడునెలలకోసారి సమావేశం నిర్వహించడమంటే.. తమను నామమాత్రులను చేయడమేనన్నది వారి వాదన. నిజానికి ప్రతి నెలా బోర్డు సమావేశం నిర్వహించాల్సి ఉంది. భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో అయితే, నెలకు రెండుసార్లు బోర్డు మీటింగు నిర్వహించిన దాఖలాలు బోలెడు. బ్రహ్మోత్సవాల సందర్భంలో అయితే, రెండుసార్లు మీటింగ్ నిర్వహించిన సందర్భాలు లేకపోలేదు.
అసలు రెండురోజుల ముందు నోటీసు ఇచ్చి, బోర్డు సమావేశం నిర్వహించుకునే వెసులుబాటు కూడా ఉంది. చైర్మన్ విచక్షణాధికారం ప్రకారమే వైఎస్ హయాంలో బోర్డు నడిచింది. అసలు వైఎస్ హయాంలో అయితే.. వచ్చే సమావేశ తేదీని, అంతకుముందు జరిగే బోర్డు మీటింగులోనే ఖరారు చేసేవారు.
ఈ నేపథ్యంలో.. మూడునెలలకోసారి బోర్డు మీటింగు నిర్వహించాలన్న అధికారుల ప్రతిపాదన నిలుస్తుందా? లేక ప్రతినెలా మీటింగు నిర్వహించాలన్న నిబంధన గెలుస్తుందా? ఈ విషయంలో చైర్మన్ వైఖరి ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. చైర్మన్ సహా సభ్యులంతా కొత్తవారే కాబట్టి, వారిపై అధికారులు పట్టు సాధిస్తారా? లేక తమ హయాంలో తమ ముద్ర కనబరచాలన్న పట్టుదలతో పాలకమండలి అధికారులపై పట్టు బిగిస్తుందా?.. చూడాలి.