* మహబూబ్‌నగర్‌లో రూ.80 లక్షల వ్యయంతో టర్ఫ్ వికెట్
* భవిష్యత్‌లో రంజీ మ్యాచ్‌ల నిర్వహణకు కసరత్తు
* వచ్చే ఏడాదిలో శాటిలైట్ అకాడమీ పనులు ప్రారంభిస్తాం
* హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు
మహబూబ్‌నగర్: భవిష్యత్‌లో రంజీ మ్యాచ్‌లు నిర్వహించే విధంగా మహబూబ్‌నగర్ స్టేడియాన్ని తీర్చిదిద్దుతామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు వెల్లడించారు. సోమవారం మహబూబ్‌నగర్‌లోని హెచ్‌సీఏ క్రికెట్ స్టేడియంలో టర్ఫ్ వికెట్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.
ఈ కార్యక్రమంలో జగన్‌మోహన్ రావుతో పాటు రాష్ట్ర ప్రభుత్వ క్రీడాశాఖ సలహాదారులు ఏపీ జితేందర్ రెడ్డి, హెచ్‌సీఏ కార్యవర్గ సభ్యులు దల్జిత్‌సింగ్, దేవ్‌రాజ్, బసవరాజు, సీజే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భూమి పూజ అనంతరం డ్రెసింగ్, రిఫ్రెషింగ్ రూమ్స్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా జగన్‌మోహన్ రావు మాట్లాడుతూ సుమారు రూ.80 లక్షల వ్యయంతో టర్ఫ్ వికెట్ పనులు ప్రారంభించామని చెప్పారు. గ్రామీణ క్రికెట్ అభివృద్ధి పట్ల తమ కార్యవర్గ సభ్యులకు ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనమని అన్నారు. త్వరలో స్టేడియంలోని వివిధ అభివృద్ధి పనుల కోసం మరో రూ.20 లక్షలను కూడా విడుదల చేయనున్నామని తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయం, మంచి హోటళ్లు మహబూబ్‌నగర్ స్టేడియంకు సమీపంలో ఉండడంతో ఇక్కడ రంజీ మ్యాచ్‌లు నిర్వహించేందుకు ఆస్కారం ఉందని, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తామని చెప్పారు.
గతంలో చెప్పిన విధంగా హైదరాబాద్ జింఖానా స్టేడియంలోని అకాడమీ మాదిరిగా మహబూబ్‌నగర్‌లోనూ అత్యాధునిక వసతులతో ఒక శాటిలైట్ అకాడమీని నెలకొల్పనున్నామని, వచ్చే ఏడాది ఈ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ క్రికెట్ సంఘం కార్యదర్శి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.