– అడహక్ కమిటీ ఏర్పాటు
– రాష్ట్ర కార్యవర్గం తీర్మానం
– తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య
హైదరాబాద్ : తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర మహాసభల నిర్వహణ, కార్యక్ర మాల కోసం అడహక్ కమిటీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తీర్మానం చేసింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ఉపాధ్యక్షులు బండి విజయ్‌కుమార్, వల్లాల జగన్, రాష్ట్ర కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడితూడి బాపూరావును సంఘం నుంచి టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గం బహిష్కరించింది.
గత కొంతకాలంగా వీరంతా సంఘం వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. సంఘం నియమ, నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఏకపక్ష నిర్ణయాలతో సంఘం ఐక్యతకు భంగం కలిగిస్తున్నారు. ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. కుల, మత, వర్గ ప్రస్తావనలు తెస్తూ సంఘంలో అనైక్యతకు కారణమవుతున్నారు. అంతేగాక సంఘం పేరిట అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. సంఘం సభ్యత్వ రుసుంను దుర్వినియోగం చేశారు.
సంఘం వాట్సాప్, ఇతర సోషల్ మీడియా గ్రూపుల్లో సంఘం విభజనకు దారితీసేలా పోస్టులు పెడుతున్నారు. గ్రూపులు, ముఠాలను ప్రోత్సహిస్తున్నారు. పద్దతి మార్చుకోవాలని అనేక పర్యాయాలు సూచించినప్పటికీ, వారిలో ఎలాంటి మార్పు రాలేదు. సంజాయిషీ కోరుతూ రాష్ట్ర కార్యవర్గం తరపున ప్రధాన కార్యదర్శి మూడుసార్లు నోటీసులు పంపినా అధ్యక్షుడు మామిడి సోమయ్యతోపాటు ఇతరులు బేఖాతరు చేశారు.
ఈనేపథ్యంలో బుధవారం హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర అత్యవసర కార్యవర్గ సమావేశం సుదీర్ఘంగా చర్చించి టీడబ్ల్యూజేఎఫ్ నుంచి మామిడి సోమయ్య, బండి విజయ్‌కుమార్, వల్లాల జగన్, తన్నీరు శ్రీనివాస్, కుడితూడి బాపూరావును శాశ్వతంగా బహిష్కరించాలని తీర్మానించింది. వీరి ప్రాథమిక సభ్యత్వాన్ని సైతం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి వీరికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) తో ఎలాంటి సంబంధం లేదు. వీరు నిర్వహించే సమావేశాలు, ఇతర కార్యక్రమాలకు టీడబ్ల్యూజేఎఫ్‌కు సంబంధం లేదు. ఈ విషయాన్ని జర్నలిస్టు మిత్రులు, సంఘం శ్రేయోభిలాషులు గుర్తించాలని కోరుతున్నాం.