– ఉపాధి వేతనాల బకాయిలను కేంద్రం విడుదల చేయాలని డిమాండ్
– పెసా చట్టం అమలుకు త్వరలో శిక్షణ కార్యక్రమాలు
– పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ సమీక్షా సమావేశంలో స్పష్టం చేసిన మంత్రి సీతక్క
హైదరాబాద్: వేసవి నేపథ్యంలో వచ్చే రెండు, మూడు నెలలు అత్యంత కీలకమని, ఈ సమయంలో ఎక్కడా తాగునీటి కొరత తలెత్తకుండా మిషన్ భగీరథ అధికారులు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ జల సరఫరా శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. ప్రజలు నీటిని వృథా చేయకుండా అవసరానికి తగ్గట్టుగా వినియోగించేలా అవగాహన పెంచాలని సూచించారు.
రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో మిషన్ భగీరథ తాగునీటి సరఫరా, ఉపాధి హామీ పథకం (MGNREGS) అమలు, ఏజెన్సీ ప్రాంతాల్లో పెసా చట్టం అమలు అంశాలపై మంత్రి సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్, డైరెక్టర్ దివ్య దేవరాజన్, ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని రిజర్వాయర్లలో తాగునీటి అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని అధికారులు వివరించారు. కృష్ణా, గోదావరి బేసిన్ల నుంచి నీటి కేటాయింపులు కొనసాగుతున్నందున ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులు లేవని తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని సింగూర్, శ్రీశైలం వంటి జలాశయాల్లో తాగునీటి నిల్వలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ప్రతి రోజు నీటి సరఫరా పరిస్థితిపై నివేదికలు సమర్పించాలని మంత్రి ఆదేశించారు. ఎక్కడైనా సోర్స్ పాయింట్లలో కొరత తలెత్తితే వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని, పైప్‌లైన్ లీకేజీలు, సరఫరా లోపాలను త్వరితగతిన సరిదిద్దాలని సూచించారు. 1916 టోల్‌ఫ్రీ నెంబర్ ద్వారా అందుతున్న ఫిర్యాదులను సమర్థవంతంగా పరిష్కరించాలని, ప్రజల్లో ఈ సేవపై మరింత అవగాహన కల్పించాలని చెప్పారు. నీటి మౌలిక వసతులపై సమగ్ర డేటాను సేకరించి, భవిష్యత్ ప్రణాళికలకు ఉపయోగపడే విధంగా రికార్డులు నిర్వహించాలని ఆదేశించారు.
వేసవి ప్రత్యేక చర్యల్లో భాగంగా హ్యాండ్పంపులు, మోటార్లు, పైప్లైన్ల మరమ్మతులు చేపట్టడం, గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడం కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఉపాధి హామీ పథకంపై సమీక్షిస్తూ, అటవి, దూర ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యల వల్ల ఫేషియల్ రికగ్నిషన్ హాజరు నమోదు కష్టంగా మారిందని మంత్రి పేర్కొన్నారు. ఈ నిబంధనలను సడలించాల్సిందిగా కేంద్రానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు.
గత మూడు నెలలుగా వేతనాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో పెండింగ్ చెల్లింపులను తక్షణమే విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఉపాధి కల్పనలో దేశంలో రెండో స్థానంలో ఉండటం గర్వకారణమని, రోజుకు మూడు లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. పనిదినాలను పెంచేందుకు రోజువారీ సమీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో పెసా చట్టం అమలుపై మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రంలో పెసా పరిధిలో ఉన్న 1,289 గ్రామ పంచాయతీలలో చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు. ఆదివాసీ, గిరిజనుల హక్కులను రక్షించడంలో పెసా చట్టం కీలకమని, ఇసుక, అటవీ వనరుల వినియోగంపై నిర్ణయాధికారం గ్రామ సభలకే ఉండాలని స్పష్టం చేశారు.
అధికారులు, ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి అవగాహన పెంచాలని, జిల్లా కోఆర్డినేటర్లు, గ్రామ సభ మోబిలైజర్ల నియామకాన్ని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. మిషన్ భగీరథ, ఉపాధి హామీ, పెసా అమలు కార్యక్రమాలు సమన్వయంతో ముందుకు సాగాలని, ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామని మంత్రి సీతక్క తెలిపారు.