-రాజీనామా లేఖ సిద్ధంగా ఉంది: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే
మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై శివసేన అధినేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే బుధవారం సాయంత్రం ఫేస్‌బుక్ లైవ్ ద్వారా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పదవి కోసం పోరాటం చేసే వ్యక్తిని కాదని థాకరే స్పష్టం చేశారు. తానేమీ సీఎం కావాలని కోరుకోలేదని, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అభీష్టం మేరకే తాను ముఖ్యమంత్రి పదవిని స్వీకరించానని ఆయన చెప్పుకొచ్చారు. సీఎంగా తాను సమర్థంగానే పనిచేశానని కూడా ఆయన తెలిపారు.
హిందూత్వ అనేది తమ పార్టీ సిద్ధాంతమన్న థాకరే… దానిని పార్టీ గానీ, తాము గానీ ఎప్పుడూ వదిలిపెట్టలేదని చెప్పారు. సీఎం పదవికి తాను సరిపోనని పార్టీ ఎమ్మెల్యేలు భావిస్తే పదవి నుంచి దిగిపోయేందుకు తాను సిద్ధమేనని కూడా ఆయన ప్రకటించారు. ఈ విషయాన్ని ఒక్క ఎమ్మెల్యే చెప్పినా… మరుక్షణమే తాను పదవికి రాజీనామా చేస్తానని థాకరే కీలక ప్రకటన చేశారు. సీఎం పదవికి రాజీనామా లేఖను తన వద్దే సిద్ధంగా ఉంచుకున్నానని కూడా ఆయన ప్రకటించారు.
నమ్మక ద్రోహానికి గురయ్యాను
శివసైనికుడు ఎవరైనా మహారాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చని ఉద్ధవ్ థాకరే అన్నారు. తాను నమ్మక ద్రోహానికి గురయ్యానని చెప్పారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే తనను వ్యతిరేకించడంతో షాక్ కు గురయ్యానని తెలిపారు. రాజీనామా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని గవర్నర్ కు తెలిపానని అన్నారు. చర్చలకు రావాలని ఏక్ నాథ్ షిండే, రెబెల్ ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తున్నానని చెప్పారు. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా లేనని తెలిపారు.
శివసేన పార్టీని నడిపేందుకు తాను పనికిరానని చెపితే తాను తప్పుకుంటానని ఉద్ధవ్ అన్నారు. అధికారం కోసం తాను పాకులాడటం లేదని చెప్పారు. గత 30 ఏళ్లుగా తాము కాంగ్రెస్, ఎన్సీపీలను వ్యతిరేకించామని.. అయితే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తనను సీఎం బాధ్యతలను తీసుకోవాలని కోరారని తెలిపారు. తనకు కాంగ్రెస్, ఎన్సీపీలు పూర్తిగా సహకరించాయని… ఇప్పుడు ఆ పార్టీలు సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు.