-సామాన్య కార్యకర్తలపై చంద్రబాబు ఆప్యాయత
అమరావతి: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక క్షణం తీరిక లేకుండా పాలనా వ్యవహారాల్లో బిజీబిజీగా ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు తనపై అంతులేని అభిమానాన్ని కనబరిచిన సాధారణ కార్యకర్తలను పిలుపించుకుని మాట్లాడిన ఆసక్తిర సన్నివేశం గురువారం సచివాలయంలో చోటు చేసుకుంది. ప్రతిపక్షంలో ఉండగా తాను పర్యటనలకు వెళ్లినప్పుడు నిత్యం తనను అనుసరించి అభిమానాన్ని చూపించిన ఇద్దరు కార్యకర్తలను గుర్తు పెట్టుకుని మరీ పిలిపించుకుని వారితో మాట్లాడారు.
దెందులూరుకు చెందిన దుర్గాదేవి, వినుకొండకు చెందిన శివరాజు యాదవ్ తెలుగుదేశం పార్టీకి వీరాభిమానులు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పర్యటనకు వెళ్లినా అక్కడికి వచ్చేవారు. దెందులూరుకు చెందిన దుర్గాదేవి చంద్రబాబును కాన్వాయ్ తో పాటు స్కూటీపై వచ్చి ఉత్సాహంగా పాల్గొనేది. వినుకొండకు చెందిన శివరాజు యాదవ్ చంద్రబాబు పర్యటనలను ముందుగానే తెలుసుకుని అక్కడికి చేరుకునేవాడు.
గత ప్రభుత్వం చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టిన సమయంలో కూడా ఆ ఇద్దరు కార్యకర్తలు కొన్ని రోజులు రాజమండ్రిలోనే ఉండి బాబు ఎప్పుడు బయటకు వస్తారా అని ఆతృతగా ఎదురు చూశారు.
తనపై అంతులేని అభిమానాన్ని కనబరిచిన ఆ ఇద్దరిని గుర్తించిన సీఎం చంద్రబాబు నాయుడు వ్యక్తిగత సిబ్బంది ద్వారా ప్రత్యేకంగా గురువారం పిలిపించుకున్నారు. ఆప్యాయంగా పలకరించి వారి కుటుంబ నేపథ్యాన్ని వాకబు చేశారు. సాక్షాత్తూ తమ అభిమాన నాయకుడే నేరుగా తమతో మాట్లాడటంతో దుర్గాదేవి, శివరాజు యాదవ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు ఎంత విలువ ఇస్తారన్నదానికి ఇదొక మచ్చుతునక.