Suryaa.co.in

Editorial

అట్లుంటది.. మన పొలిటికల్ వకీల్‌సాబ్‌తోని!

– ఏపీ సమస్యల గురించేమైనా ముచ్చటించారా?
– బకాయిలు చెల్లించాలని కేసీఆర్‌ను కోరారా?
– ఏపీపై కేసులు ఉపసంహరించుకోవాలని అడిగారా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

undavalli1ఉండవల్లి అరుణ్‌కుమార్ ఎవరన్నది ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. రోజూ పేపర్లు, టీవీలూ చూసే వారందరికీ ఆయన పేరు ఎరుకే. జనంలో బలం లేకపోయినా, సొంత వర్గం లేకపోయినా మీడియాను ఆకర్షించడంలో పీహెచ్‌డీ చేసినాయన. మీడియాలో ఉన్న వారే ఆయనకు బలం. ఆ బాబాయిలే ఆయనకు కొండంత అండ. చదవింది లా అయినా.. ప్రాక్టీసు చేయకపోయినా.. ఆయన‘లా’ మాట్లాడగలిగే లీడర్లు లేకపోవడమే ఆయనకు ప్లస్‌పాయింటు. ఏమాటకామాట. సబ్జెక్టుల మీద సంపూర్ణ అవగాహన ఉన్న అతికొద్దిమంది లీడర్లలో ఆయనొకరు. ఒకప్పుడాయన వైఎస్ రాజశేఖరరెడ్డికి వీరాభిమాని. ఆయన వల్లే ఎంపీగా గెలిచిన నాయకుడు. వైఎస్‌ను ముప్పతిప్పలు పెట్టిన ఈనాడు రామోజీ వ్యాపార సామ్రాజ్యంలో ఒకటయిన మార్గదర్శిని, మూయించేందుకు నడుంబిగించాయన.

వైఎస్ రక్షణదళానికి కేవీపీ సేనాని అయితే, ఈయన మహామంత్రి. టీడీపీకి వ్యతిరేకంగా ‘అవుడియా’లిచ్చే బృహస్పతి. ఒక్కముక్కలో చెప్పాలంటే వైఎస్ లేకపోతే ఆయన లేరు. కౌంటింగ్ సమయంలో ఆయన కలెక్టరుపై ఒత్తిడి చేయడం వల్లే ‘గెలిచినంతపని’ చేశారన్నది ఇప్పటికీ వినిపించే ఒక టాక్. నిజం రాజశేఖరుడికెరుక. అయితే.. రాష్ట్రం విడిపోకుండా చివరాఖరు వరకూ కష్టపడ్డాయన. దానికోసం కోర్టులో కేసుకూడా వేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ ఆయన చేయని పోరాటం లేదు. పన్నని వ్యూహమంటూ లేదు. చేయని లాబీయింగ్, పెట్టని ప్రెస్‌కాన్ఫరెన్సులూ లేవు. అయినా రాష్ట్రం విడిపోయింది. అందుకే ఆయనకు కాంగ్రెసంటే వల్లమాలిన కోపం. కానీ రాష్ట్రం విడిపోవడానికి ఉద్యమించిన కేసీయారన్న అంటే మహా ఇష్టం. ఆయన తెలివితేటలంటే ఇంకా ఇష్టం.

పేరుకు ఏకలింగమయినా.. పట్టుమని పది ఓట్లు సొంతంగా తెచ్చుకోలేకపోయినా.. తన వాక్చాతుర్యంతో ఇతరులను ప్రభావితం చేయగల దిట్ట. పైకి చెప్పకపోయినా.. తన అభిమాన నేత కొడుకయిన జగనంటేYS-jagan-Undavalli-Arun-Kumar ఆయనకు వల్లమాలిన అభిమానం. కాకపోతే ఆయన దారితప్పుతున్నాడన్న ఆందోళన ఆయనది. అందుకే పాజిటివ్‌లో నెగటివ్.. నెగటివ్‌లో పాజిటివ్ మాదిరిగా, జగన్‌కు ప్రెస్‌మీట్ల ద్వారా సలహాలిస్తుంటారు. మొన్నామధ్య ఒక ప్రెస్‌మీట్‌లో.. జగన్ పేదల కోసం డబ్బు పంచుతున్నారు. దానికోసం అప్పులు చేస్తున్నారు. ప్రతిపక్షాలు దీనిపై ప్రశ్నిస్తే, ఏం పేదలకు పంచకూడదా అంటాడని అరుణన్న చెప్పిన కొద్దిరోజుల తర్వాత.. జగనన్నతోపాటు మంత్రులు సరిగ్గా అదే పాయింటుమీద విపక్షాలపై ఎదురుదాడి చేశారు.

ఇదోరకమైన నెగటివ్‌లో పాజిటివ్ పాలిటిక్స్ అన్నమాట. ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే.. ప్రెస్‌మీట్ నిర్వహించే నాయకుడు, ముందస్తుగా తనకిష్టమైన విలేకరిని, ‘నువ్వు ఫలానా ప్రశ్న అడుగు’ అని తాను చెప్పాల్సిన అంశం చెబుతుంటారు. ఇదీ అంతేనన్నది గిట్టనివారి విమర్శ. ఇంతకూ ఇప్పుడాయన ఏ పార్టీలోనూ లే నంటారు. రాజకీయాలతో నాకు సంబంధం లేదంటారు. కాకపోతే క్రియాశీల రాజకీయాల్లో ఉన్నానని చిత్రంగా చెబుతుంటారు. రాజకీయాలతో సంబంధం లేని మీకు రాజకీయాలతో ఏం పని అని ఎవరూ అడగరు. అదో సౌకర్యం ఆయనకు.

రాష్ట్రంలో చాలామంది మాజీ ఎంపీలున్నారు. వారికెవరూ మీడియాలో ప్లేసివ్వరు. కానీ అరుణన్నకు బోలెడంత ఉచిత ప్రచారం ఇచ్చేస్తారేమిటో మరి? కాకపోతే అదేదో సినిమాలో మహేష్ చెప్పినట్లు.. నేనూ ఉన్నానని చెప్పేందుకు గణపతి పాలు తాగినట్లు, ఉండవల్లి అనే ఒకాయన ఉన్నానని చెప్పుకునేందుకు, రాజమండ్రిలో ప్రెస్‌మీట్ పేరంటం పెడుతుంటారు.

అంతటి ఘనుడు, అంతలావు ‘గ్నాని’, మొన్నీమధ్య… తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్‌లో కబురు పంపితే ఠక్కున ప్రగతిభవన్‌లో వాలిపోయారు. వాకే.. వాకే.. వాలారు సరే. కేసీఆర్ పెట్టబోయే బీయారెస్.. అదేనప్పా.. ‘భారత రాష్ట్రసమితి పార్టీ’పై ముచ్చటించారట. యాపీస్.. ‘పువ్వుపార్టీ’కి వ్యతిరేకంగా తాను పెట్టబోయే పార్టీ గురించి, కేసీయారన్న ఇచ్చిన పవర్ ప్రజెంటేషన్ చూసి అరుణన్న మురిసిముక్కలయ్యారట. కేసీయారన్న విజ్ఞానం చూసి ఉండవల్లి ఉక్కిరిబిక్కిరయ్యారట. అంతలావు మేధావి అయిన అరుణన్న మైండ్ బ్లాంకయిపోయిందట. కేసీయారన్నలోని మేధావిని చూసి అరుణన్న ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారట.

శేఖరన్న ఇచ్చిన ప్రజెంటేషన్ అంతా చూసి.. దేశ భవిష్యత్తు కేసీయారన్న చేతిలోనే ఉందని ‘యమలీల’ సినిమాలో తోటరాముడు తనికెళ్ల భరణీ లెక్క డిసైడయిపోయారట. మళ్లీ ఇంకోసారి పిలుస్తా రావోయ్ అంటే.. ‘ఆయ్’ అంటూ ఉండవల్లి సారు తలూపారట. ఇది ఇంకా యాపీస్. బీజేపీకి ఓట్లు పెరగకుండా చూసే బ్రాండ్ అంబాసిడర్ ఉద్యోగం తనకిచ్చారని ఉండవల్లి సారు ఉబ్బిబ్బవుతూ చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా నిలబడిన మొనగాడయిన కేసీయారన్నకు అంతా మద్దతునివ్వాలని, చివరాఖరులో సెలివిచ్చిన ఉండవల్లి పిలుపును ఎవరు పట్టించుకుంటారు? ఎవరు లైట్‌గా తీసుకుంటారని పక్కనపెడితే… రాష్ట్ర విభజనకు కారణమయిన కేసీయారన్నతో కలసి, వెజిటేరియన్ భోజనం చేయడం మాత్రం అరుణన్నకే చెల్లింది. అన్నట్లు మీకు గుర్తుందా? రాష్ట్ర విభజన వద్దంటూ పార్లమెంటులో ఉండవల్లి యాగీ చేసినప్పుడు, కేసీయారన్న కూడా పార్లమెంటు మెంబరే మరి!

వాకే.. వాకే.. ఈ విజ్ఞానవంతుల కలయిక, వెజిటేరియన్ ఫుడ్డూ ఇవన్నీ పక్కనపెడితే.. అరుణన్న వెజిటేయరిన్ మీట్‌లో.. ఆయన తన సొంత రాష్ట్రానికి చెందిన సమస్యలు గురించి ఏమైనా ముచ్చటించారా లేదా అన్నదే ‘మెయిను ఇంపార్టుమెంటు’ పాయింటు. అంటే ఏపీకి సంబంధించిన సమస్యలేమైనా ‘ప్రగతిభవన్ మన్‌కీబాత్’లో వచ్చిందా లేదా? అది కదా సగటు ఆంధ్రోడు ఆలోచించే అసలు పాయింటు.

అంటే.. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణ సర్కారు పోరాటాన్ని విరమించుకోవాలని ఏమైనా కేసీయారన్నను కోరారా? లేదా? ఏపీ విద్యుత్ సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సిన, 5 వేల కోట్ల బకాయిలు విడుదల చేయాలనేమైనా అభ్యర్ధించారా? లేదా? విభజన చట్టం సెక్షన్ 9,10 ప్రకారం ఏపీకి రావలసిన హక్కుల గురించేమైనా ముచ్చటించారా? లేదా? కేఆర్‌ఎంబీ ఇచ్చిన 66:34నిష్పత్తి కాదు. 50-50 చొప్పున కృష్ణాజలాలు పంచాలని ఏమైనా డిమాండ్ చేశారా? లేదా? అవసరం లేకపోయినా పట్టుపట్టి జలవిద్యుత్ ఉత్పాదన పేరిట శ్రీశైలం డ్యాం ఖాళీ చేసిన యవ్వారంపై ఏమైనా మాట్లాడారా? లేదా?

గోదావరి నది సముద్రంలో కలిసేముందు, లిఫ్టుద్వారా నీరు తీసుకునే ప్రయత్నం చేస్తున్న ఏపీ మీద తెలంగాణ సర్కారు చేస్తున్న ఫిర్యాదులపై ఏమైనా గళం విప్పారా? లేదా? లేకపోతే కేసీయారన్న పెట్టిన పప్పు, ఉలవచారు, వంకాయకూర, సాంబారు, రసం, గడ్డపెరుగు తిని వచ్చేశారా? ఇవి కదా.. ‘పొలిటికల్ వకీల్‌సాబ్’ గురించి, సామాన్య ఆంధ్రోడు ఊహించేది? సరే.. ప్రెస్‌మీట్‌లో ఆయన కేసీఆర్ పట్ల ఉన్న ‘గౌరవంతో కూడిన మొహమాటంతో’ ఇవేమీ చెప్పలేదు సరే. మరి వీటిని ప్రశ్నించాల్సిన మీడియా ఏం చేస్తోంది? పకోడీ, పుల్లట్లు, పూతరేకులూ, కాకినాడ కాజాలూ, సుబ్బయ్యహోటల్ బుట్టభోజనం తింటోందా అన్నది బుద్ధిజీవుల ప్రశ్న.

LEAVE A RESPONSE