Suryaa.co.in

Andhra Pradesh

ఏపీలో గణనీయంగా తగ్గిన నిరుద్యోగం

– ఎంపీ విజయసాయి రెడ్డి

విశాఖపట్నం, సెప్టెంబర్ 27: రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా 6 లక్షలకు పైగా ప్రభుత్వ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిందని, దీంతో రాష్ట్రంలో నిరుద్యోగం రికార్డు స్థాయిలో తగ్గిందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా మంగళవారం పలు అంశాలు వెల్లడించారు.

పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే నిరుద్యోగ రేటు ఆంధ్రప్రదేశ్ లో చాలా తక్కువని ఇటీవల సీఎంఐఈ (సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ) తన నివేదికలో వెల్లడించిందని అన్నారు. దేశ నిరుద్యోగ సగటు కన్నా ఏపీ నిరుద్యోగ రేటు తక్కువగా ఉందని, దేశంలో సగటు నిరుద్యోగ రేటు 8.3% శాతం కాగా ఏపీలో కేవలం 6% మాత్రమే ఉందని అన్నారు. సీఎంఐఈ నివేదిక ప్రకారం ఈ ఏడాది ఆగస్టు నాటికి జమ్ము కాశ్మీర్ లో 32.8%, హరియాణాలో 37.3%, రాజస్థాన్ లో 31.4%, బీహార్ లో 12.8%, పశ్చిమ బెంగాల్ లో 7.4%, తమిళనాడులో 7.2%, తెలంగాణలో 6.9%, కేరళలో 6.1% నిరుద్యోగం ఉందని అన్నారు.

డిజిటల్ వైద్యసేవల్లో ఏపీకి అవార్డుల పంట
ప్రజలకు డిజిటల్ వైద్య సేవలు అందించడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఏపీకి జాతీయ స్థాయిలో ఆరు అవార్డులు లభించాయని విజయసాయి రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు దేశంలో 24.38 కోట్ల మంది ప్రజలకు డిజిటల్ హెల్త్ ఐడీలను సృష్టించగా, 3.4 కోట్ల మందికి హెల్త్ ఐడీలను సృష్టించి ఏపీ.. దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని అన్నారు.

LEAVE A RESPONSE