– అన్ని వర్గాల ప్రజల నుంచి ఊహించని ఆదరణ
– ఈ నెల 15న జిల్లా స్ధాయిలో జరిగే కార్యక్రమం, ర్యాలీలు పెద్ద ఎత్తున జరగాలి
– అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యం ఉండేలా నాయకులు చొరవ తీసుకోవాలి
– ఈ నెల 18 సాయంత్రం జగన్ , ముఖ్య నాయకులు గవర్నర్ ని కలిసి ప్రజల అభిప్రాయాన్ని వివరిస్తారు
– జూమ్ కాన్ఫరెన్స్, టెలి కాన్ఫరెన్స్ లో ప్రసంగించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి
తాడేపల్లి: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమంకు అన్ని నియోజకవర్గాల్లో అనూహ్య స్పందన వచ్చింది. అన్ని వర్గాల ప్రజల నుంచి ఊహించని ఆదరణ వచ్చింది, కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలా జరిగింది, ఈ నెల 10 న అసెంబ్లీ నియోజకవర్గాలలో జరిగిన కార్యక్రమానికి విపరీతమైన స్పందన లభించింది, 15న జిల్లా స్ధాయిలో, 18 సాయంత్రం గవర్నర్ గారి దగ్గరకు వెళుతున్నాం. జిల్లా స్ధాయిలో 15న జరిగే కార్యక్రమం కూడా భారీగా జరగాలి, ఆ రోజు ర్యాలీలతో రాష్ట్రం హోరెత్తాలి.
జిల్లా కేంద్రంలో జరిగే ర్యాలీలలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనేలా మనం ప్రణాళికలు సిద్దం చేయాలి. అందరినీ భాగస్వామ్యం చేయాలి. నాయకులంతా చొరవ తీసుకుని సమన్వయంతో పనిచేయాలి. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు చేసిన ద్రోహం, వైద్యరంగాన్ని ఎలా నిర్వీర్యం చేశారనేది, నాడు జగన్ చేసిన మంచిని ఈ కార్యక్రమం ముగిసేవరకూ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి.
ఈ కార్యక్రమాలన్నీ మీడియాలో, సోషల్ మీడియాలో బాగా తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలి. చంద్రబాబు అప్రజాస్వామిక నిర్ణయాలకు ఇంతకుమించిన రెఫరెండం ఏం అక్కర్లేదు. జిల్లా కేంద్రం నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపే రోజు ర్యాలీ అనంతరం వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించాలి. 18 సాయంత్రం గవర్నర్ ని జగన్ , ముఖ్యమైన నాయకులు కలిసి అందజేస్తారు. ప్రతి ఒక్కరూ సొంత కార్యక్రమంలా భావించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను.
పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఇంఛార్జ్ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోయేలా చేయాలని, కూటమి ప్రభుత్వం తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకునేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి ఉండాలన్నారు.