– ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలను చెల్లించకపోవడాన్ని తప్పుపట్టిన బండి సంజయ్
ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను చెల్లించాలి
– సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ
హైదరాబాద్: ఏళ్ల తరబడి పేరుకుపోయిన ఫీజు రీయింబర్సుమెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగలేఖ రాశారు.
సంజయ్ లేఖ పూర్తి పాఠమిదీ..
విద్య, వైద్యం విషయంలో కాంగ్రెస్ తీరు కోట్లాది మంది ప్రజలను తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తోంది. ‘ఆరోగ్యశ్రీ’, ఫీజు రీయంబర్స్ మెంట్ పథకం అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ‘నోటితో పొగిడి నొసటితో వెక్కిరించినట్లుంది.
ఒకవైపు ‘ఆరోగ్యశ్రీ’ పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు, ఆరోగ్య సేవలను విస్తరిస్తున్నట్లు ప్రకటించారు. కానీ అసలు బిల్లులే చెల్లించకుండా, ఆరోగ్యశ్రీ సేవలే ప్రజలకు అందకుండా చేస్తుండటం ఎంతవరకు సమంజసం? మీ ఏడాది పాలనా నిర్వాకంవల్ల రూ.వెయ్యి కోట్లకుపైగా ఆరోగ్యశ్రీ బకాయిలు పేరుకుపోయాయి
మీ చేతగానితనం, నిర్లక్ష్యం ఫలితంగా ఆరోగ్యశ్రీ సేవలందక పేదలు అల్లాడుతున్నారు. ఫీజు రీయంబర్స్ మెంట్ పథకాన్ని కూడా మీరు ఉద్దేశపూర్వకంగానే నీరుగారుస్తున్నారు. గత బీఆర్ఎస్ తోపాటు మీ ప్రభుత్వ నిర్వాకంవల్ల రూ.7వేల కోట్లకుపైగా బకాయిలు పేరుకుపోయాయి. ఫీజు రీయంబర్స్ మెంట్ అందక కాలేజీ యాజమాన్యాలు మూతపడే దుస్థితి.
ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లించనిదే విద్యార్థులకు సర్టిఫికెట్ ఇవ్వబోమని కాలేజీ యాజమాన్యాలు తెగేసి చెబుతుంటే ఏం చేస్తున్నారు? మీ చేతగానితనం, నిర్లక్ష్యంవల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడింది. సుమారు రూ.380 కోట్ల మేరకు చెల్లిస్తామని టోకెన్లు జారీ చేసి నెలలు గడిచినా చెల్లింపులు చేయకపోవడం దుర్మార్గం.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వన్‌టైం సెటిల్మెంట్ పద్ధతిలో క్లియర్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడం సిగ్గు చేటు. అవేమైనా బ్యాంకు లోన్లా? వడ్డీలతో కలిపి బకాయిలు పెరిగిపోతే వన్ టైం సెటిల్ మెంట్ చేసుకోవడానికి? ఇవ్వాల్సిన సొమ్మును సకాలంలో చెల్లించకపోవడమే కాకుండా… ఓటీఎస్ పేరుతో కోత విధిస్తామని చెప్పడం దుర్మార్గం.
పేదలకు విద్య, వైద్యం అందించే విషయంలో మీరు చేతులెత్తేయడం దారుణం. 2 లక్షల 75 వేల కోట్ల రూపాయల రాష్ట్ర బడ్జెట్ నుండి రూ.8 వేల కోట్లు చెల్లించి లక్షలాది మంది రోగులను, విద్యార్థులను ఆదుకోలేరా? విదేశీ పర్యటనలు, ఢిల్లీ పర్యటనలు, మూసీ పునరుజ్జీవం, ఫోర్త్ సిటీ పేరుతో వేల కోట్లు ఖర్చు చేస్తున్న మీకు రూ.8 వేల కోట్లు చెల్లించేందుకు మనసు రావడం లేదా?
పేదల ప్రాణాలంటే మీకెంత చులకన ఉందో, విద్యార్థుల భవిష్యత్తుపట్ల మీకెంత చిన్నచూపు తేటతెల్లమవుతోంది. తక్షణమే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను చెల్లించాలి. లేనిపక్షంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యార్థుల, పేదలతో కలిసి ఉద్యమిస్తాం. జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి.