విద్యార్థుల్లో ఆ స్ఫూర్తిని పెంచాలి
• ఉన్నతమైన ప్రమాణాల కోసం కృషి చేయాలని సూచన
• ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమలకు పునరుజ్జీవాన్ని అందించేందుకు మేధో సంపత్తి హక్కుల క్రింద అమలు చేయగల పేటెంట్లపై విశ్వవిద్యాలయాలు దృష్టి సారించాలి
• మరింత పటిష్టమైన విధానాల రూపకల్పన కోసం విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వం కలిసి పని చేయాలని ఉపరాష్ట్రపతి పిలుపు
• చండీగఢ్ లోని పంజాబ్ విశ్వవిద్యాలయ 69వ స్నాతకోత్సవంలో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి
• పలువురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్ లను అందజేసిన ఉపరాష్ట్రపతి
చండీగఢ్, మే 6, 2022 : అంకుర సంస్థల (స్టార్టప్) సంస్కృతిని ప్రోత్సహించటంతో పాటు, విద్యార్థులు ఔత్సాహిక పారిశ్రామిక స్ఫూర్తిని పెంపొందించాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు విశ్వవిద్యాలయాలకు పిలుపునిచ్చారు. ఆలోచనలతో పాటు, మెలకువలు అందించేందుకు, అవకాశాలు అందుకునే చొరవ పెంపొందించే విషయం తరగతి గదులు పోషించాల్సిన పాత్రను ఆయన నొక్కి చెప్పారు. విద్యను అభ్యసిస్తున్న కాలంలోనే ఇంటర్న్ షిప్, శిక్షణా కార్యక్రమాల ద్వారా పని పట్ల అవగాహన పెంపొందించేలా విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు.
శుక్రవారం చండీగఢ్ లో జరిగిన పంజాబ్ విశ్వవిద్యాలయ 69వ స్నాతకోత్సవ వేడుకల్లో ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ, సాధించిన దానితో సంతృప్తి పొందకుండా, ఉన్నతంగా ఎదిగేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉన్నత విశ్వవిద్యాలయాల సరసన మేటిగా నిలిచే దిశగా ముందుకు సాగాలని సూచించారు.
ఉపాధ్యాయులకు నిరంతర వృత్తిపరమైన అభివృద్ధిని అందించే వాతావరణాన్ని విశ్వవిద్యాలయాలు కల్పించాలన్న ఉపరాష్ట్రపతి, అధ్యాపకులు క్షేత్రస్థాయి నుంచి అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమలకు పునరుజ్జీవాన్ని అందేంచే మేధో సంపత్తి హక్కుల కింద అమలు చేయగల పేటెంట్ల మీద విశ్వవిద్యాలయాలు దృష్టి సారించాలని పేర్కొన్నారు. మెరుగైన పరిశోధన ఫలితాల కోసం పరిశ్రమలు – విశ్వవిద్యాలయాల అనుసంధానతను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
నూతన ఆవిష్కరణలు, అత్యాధునిక పరిశోధనల ద్వారా జ్ఞాన విప్లవం విషయంలో విశ్వవిద్యాలయాలు ముందంజలో ఉండాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన ఉపరాష్ట్రపతి, మరింత పటిష్టమైన విధానాలను రూపొందించేంలా విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వం మధ్య పరస్పర సన్నిహిత సహకారం అవసరమని సూచించారు.
మంచి నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని పిలుపునిచ్చిన ఉపరాష్ట్రపతి, విద్య జీవితంలో సానుకూల పరివర్తనకు, సామాజిక ఐక్యత, సంఘటిత జాతీయ అభివృద్ధికి దారితీయాలని ఆయన ఆకాంక్షించారు. తరగతి గదుల్లో అందించే జ్ఞానం, నైపుణ్యాలు, వైఖరులపై మనందరి కలల భారతం నూతన సామర్థ్యాలతో నిర్మితమౌతుంది ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీ గురునానక్ సూచించిన సత్ (నిజాయితీ, సత్యమైన ప్రవర్తన. ), సంతోఖ్ (సంతృప్తి), దయా (కరుణ), నిమ్రత (నమ్రత) మరియు ప్యార్ (ప్రేమ) వంటి ఐదు సద్గుణాలను ఉటంకించిన ఆయన, ఈ అంశాలు మనకు జీవితంలో స్ఫూర్తిని పంచుతాయని తెలిపారు.
ప్రపంచాన్ని సానూకూలంగా మార్చేందుకు విద్యార్థులు తమ జ్ఞానాన్ని ఉపయోగించాలన్న ఉపరాష్ట్రపతి, దేశం ఎదుర్కొంటున్నసవాళ్ళ పరిష్కారం కోసం క్రియాశీలకంగా పని చేయాలని సూచించారు. అత్యున్నత లక్ష్యంతో దేశ భవిష్యత్ కోసం పని చేసేందుకు యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నూతన జాతీయ విద్యావిధానం – 2020 జాతీయ అభివృద్ధిలో నేరుగా విద్యాసంస్థలు నిమగ్నం కావడానికి కావలసిన రోడ్ మ్యాప్ ను అందిస్తుందన్న ఆయన, ఇది దేశంలోని ఉన్నత విద్యాసంస్థలను విజ్ఞాన ఆర్థిక వ్యవస్థ సవాళ్ళ వైపు మళ్ళించేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారు.
డిజిటల్ విశ్వవిద్యాలయం, వర్చువల్ ల్యాబ్ లను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందించిన ఉపరాష్ట్రపతి, ఇటువంటి కార్యక్రమాలు విస్తృతమైన సానుకూల ప్రభావాన్ని చూపుతాయని, ఉన్నత విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావడంమే గాక, అందరికీ సమాన అవకాశాలను కల్పిస్తుందన్నారు. దేశంలో ఉన్నత విద్యారంగంలో గర్వించదగిన స్థానాన్ని సంపాదించుకున్న పంజాబ్ విశ్వవిద్యాలయాన్ని అభినందించిన ఆయన, భవిష్యత్తులో ప్రపంచంలోని విశ్వవిద్యాలయాల సరసన గౌరవప్రదమైన స్థానాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్, ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్, స్వదేశీ వ్యాక్సిన్ తయారీ మార్గదర్శకులు డా. కృష్ణ ఎల్లా, సుచిత్రా ఎల్లా సహా పలువురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పంజాబ్ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర వాణిజ్య మంత్రి సోం ప్రకాష్ పంజాబ్ విశ్వవిద్యాలయ ఉపకులపతి విక్రమ్ నాయర్ సహా అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.