Suryaa.co.in

Andhra Pradesh

స్వార్థ ప్రయోజనాల కోసమే కుట్రతో సత్యదూర ఆరోపణలు

– అసత్య ఆరోపణలపై చట్టపరమైన చర్యలు సిద్ధం
– రాష్ట్ర బీజేపీ వెల్లడి

పార్టీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించి చినకాకాని ప్రాంతంలో ఒక భూ యజమాని దానపత్రంగా ఇచ్చిన ఆస్తి విషయంలో పదేపదే కుట్రలు, కుతంత్రాలతో తప్పుడు ఆరోపణలతో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు పై, మీడియా ఇంచార్జ్ లక్ష్మీపతి రాజా లని లక్ష్యం చేసుకుని బిజెపిని బదనాం చేయడాన్ని రాష్ట్ర బిజెపి మరో మారు తీవ్రంగా ఖండించింది.

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ కార్యాలయ నిర్మాణానికి చిన కాకాని పరిధిలోని హైకోర్టు న్యాయవాది బద్రి వెంకటరెడ్డి, దానంగా ఇచ్చిన 0.62 సెంట్లు భూమికి ఆనుకుని ఉన్న, వారి తాలూకు మిగిలిన భూమిలోని కొంత భాగాన్ని దాదాపు ఎకరం భూమిని కూడా కొనుగోలు చేయడానికి సంప్రదింపులు జరిపిందని, దానిని నిలుపదల చేస్తున్నట్లు ప్రకటించినా కూడా …… కొందరు కుట్రలతో స్వార్థ ప్రయోజనాలతో చేస్తున్న విమర్శలు వెనుక పెద్ద దురుద్దేశం దాగి ఉందని, రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి బిట్రా వెంకట శివన్నారాయణ ఆరోపించారు.

భూ యజమానులకు ఇతర వ్యక్తులకు మధ్య నెలకొన్న సమస్యలను, రాష్ట్ర పార్టీ అధ్యక్షునికి ఆపాదించి దుష్ప్రచారం చేయటం సరికాదని పార్టీ హితవు పలికింది. ఇప్పటికైనా కొందరు కుట్రపూరితంగా చేస్తున్న ఆరోపణలను విరమించుకోవాలని బిజెపి హెచ్చరించింది.

చేసే విమర్శలు దుష్ప్రచారాలు అన్నీ కూడా కట్టుకథలతో బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని, దీని వెనుక ఉన్న సూత్రధారులు పాత్రధారుల గురించి తమకు పూర్తి సమాచారం ఉందని త్వరలోనే అన్ని బయటకు వస్తాయని అప్పుడు న్యాయపరంగా ఆరోపణలు చేసిన వారు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని రాష్ట్ర బిజెపి హెచ్చరించింది.

నిరాధార వార్తలు ప్రచురణ చేయడం న్యాయ సమ్మతం కాదని, వివరణ కోరకుండా ఏకపక్షంగా వార్తలు ప్రచురణ అనైతికం అని పేర్కొంటూ, రాష్ట్రంలో బిజెపి సంస్థాగతంగా మరింత పటిష్ఠమైన తరుణంలో ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడుతున్నట్లు భావిస్తున్నామని రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి బిట్ర వెంకట శివన్నారాయణ ఆరోపించారు.

LEAVE A RESPONSE