– అన్నీ మోదీ, యోగీకి వదిలేసి తమ బాధ్యతద లేనట్లు ఉన్నట్లు ఎలా?
– సమస్యలన్నీ వారి నెత్తిన వదిలేసి వారిదే బాధ్యత అంటే ఎలా?
– ప్రజలకు ఆ మాత్రం నైతిక బాధ్యత లేదా?
– దేశంలో మరో పాతికేళ్లు సైద్ధాంతిక పోరు కొనసాగుతుంది
– సామాజిక సమరసత మంచ్ అఖిల భారత సంయోజక్ కె.శ్యాం ప్రసాద్
హైదరాబాద్: కేంద్రంలో ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ప్రధాని మోదీ, అలాగే యూపీ సర్కారుకు నేతృత్వం వహిస్తున్న యోగి ఆదిత్యనాథ్ లాంటివారు వస్తే సమస్యలన్నీ పరిష్కారమైపోతానే బలహీనత ప్రజల్లో కనిపిస్తోందని, సమస్యలన్నీ వారి నెత్తిపై వేసేసి మనం భద్రంగా పనులు చేసుకుందామనే తీరులో జనం ఉన్నారని సామాజిక సమరసత మంచ్ అఖిల భారత సంయోజక్ కె.శ్యాం ప్రసాద్ వ్యాఖ్యానించారు. Changing colours of Naxalism (మారుతున్న నక్సలిజం రంగులు) పేరిట హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీలోని PGRRCDE ఆడిటోరియంలో Martyrs’ Memorial Research Institute (MMRI) సంస్థ ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు.
దేశంలో మంచి ప్రభుత్వాలు ఏర్పడటం, కొన్ని సమస్యలు పరిష్కారం కావడం జరుగుతోందని, కానీ, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా ఎమ్మెల్యే చేతిలో తాళం చెవులు పెడితే అన్నీ అయిపోతాయనే ఆలోచనలో ఉండటం సరికాదని హితవు చెప్పారు. దేశంలో సైద్ధాంతిక పోరు ముగియలేదని, తప్పనిసరిగా మరో పాతికేళ్ళు నడుస్తుందని శ్యాం ప్రసాద్ పేర్కొంటూ జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ ఆ స్పృహలో మనముండాలన్నారు.
రాజకీయాల్లో పదవులు చేపట్టకున్నప్పటికీ సమాజానికి మేలు చేసే పనులు చెయ్యవచ్చన్న ఆయన, మాజీ డీజీపీ అరవిందరావును ఉదాహరణగా చూపిస్తూ, ఆయన పదవీ విరమణ చేసినప్పటికీ హిందూ సమాజానికి ఉపయోగపడే కార్యాన్ని చేపట్టారన్నారు. ఇక అర్బన్ నక్సలైట్లను మహాభారతంలోని శకునితో పోల్చారు. యుద్ధవీరుడు కూడా అయిన ఇతను వ్యూహకర్తగా ఉంటూ కౌరవులు, పాండవుల మధ్య నిత్యం యుద్ధవాతావరణానికి కారకుడయ్యాడని, ఈ పాత్రనే అర్బన్ నక్సలైట్లు పోషిస్తున్నారని శ్యాం ప్రసాద్ విమర్శించారు. ఈ అర్బన్ నక్సలైట్లను అమాయకులుగా, తెలివితేటలు లేనివారిగా ఎంతమాత్రం భావించరాదంటూ వీరిని నడిపిస్తూ చాలా పెద్ద బ్రెయిన్స్ ఉన్నాయన్నారు.
2007లో దలైలామా భారత్ వచ్చినప్పుడు బౌద్ధ ధర్మం, సనాతన ధర్మం రెండూ ఒకే వృక్షపు రెండు కొమ్మలని వ్యాఖ్యానించడంతో వరంగల్‌లో వరవరరావు ధర్నా చేసిన సంఘటనను శ్యాం ప్రసాద్ గుర్తు చేస్తూ, ఇటీవల ముగిసిన ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో దేశవిదేశాల నుంచి 300 మంది బౌద్ధ బిక్షువులు మొదటిసారిగా పవిత్రస్నానం చేసి, సనాతన ధర్మంలోని స్వాముల ఆతిథ్యాన్ని స్వీకరించిన పరిణామాన్ని సదస్సుకు తెలిపారు.
ఈ బౌద్ధ భిక్షువులు కూడా నాడు దలైలామా చెప్పినట్టుగా బౌద్ధ ధర్మం, సనాతన ధర్మం రెండూ ఒకే వృక్షపు రెండు కొమ్మలు అని స్పష్టం చేశారన్నారు. ఈ ఐక్యత వెనుక ఎంతో కృషి జరిగిందంటూ… ఇదే తీరుగా రైతులు, రైతు కూలీలను సైద్ధాంతికంగా వేరు చేసి చూపిస్తుంటారని, అయితే, వ్యవసాయం బాగుండాలంటే వీరిద్దరూ కలసి పనిచేయాలన్నారు.
ఈ విధమైన సరైన భావజాలం సమాజానికి చేరాల్సిన అవసరముందన్నారు. 1969లో శ్రీకాకుళం జిల్లాలో నక్సలైట్లు తాము చంపాలనుకున్న వ్యక్తి దొరకకపోవడంతో ఇందువదన నాయుడు అనే మరో వ్యక్తి ప్రాణాలు తీసిన ఘటనను శ్యాం ప్రసాద్ గుర్తు చేస్తూ సిద్ధాంతంలోను, వ్యవహారంలోనూ జరిగిన పొరపాటు సదస్సులో తెలిపారు. ఇదే పరిస్థితి కులపరమైన సమానత్వం విషయంలోనూ ఉందంటూ ఇందుకు పరిష్కారం కోసం సైద్ధాంతికపరంగాను, కార్యాచరణలోను మన సమాజంలో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు పనిచేయాలని హితవు చెప్పారు.
అంతకుముందు ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ కె అరవిందరావు మాట్లాడుతూ. మొదటగా ఈ నక్సల్ ఉద్యమంలో బలైపోయిన వేలాది పోలీసు సిబ్బంది, అనేకమంది అమాయకులైన ప్రజలకు శ్రద్ధాంజలి ఘటించారు. 1984లో తాను వరంగల్ ఎస్పీగా ఉన్న రోజుల్లో అక్కడ సహేతుకత కనిపించని నక్సల్ ఉద్యమాన్ని తాను గమనించానన్నారు. పోలీసులలో సైతం నక్సల్ సానుభూతి పరులను తాను గమనించానని, అదే సమయంలో కొందరు జడ్జీలలో పోలీసుల పట్ల ప్రతికూల భావన ఉండేదని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వంతో చర్చల సందర్భంలో నక్సలైట్లు ఈశాన్య భారతంలోని ఉగ్రవాదులు అనుసరించిన నమూనాను వాడుకున్నారని, ఆసమయంలో డబ్బుల వసూళ్లు చోటు చేసుకున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. అర్బన్ నక్సలిజం అనే పదం నూతనంగా సృష్టించబడినప్పటికీ, ఆ భావన మాత్రం చాలా కాలం క్రితం నుండి సమాజంలో ఉందన్నారు. కొన్ని బాహ్య శక్తులు మన దేశాన్ని అస్థిరపరిచేందుకు అంతర్గత శక్తులతో చురుకుగా సమన్వయం చేసుకుంటున్నాయని హెచ్చరిస్తూ, వామపక్ష మేధావులుగా పిలవబడే వారు ప్రపంచ వామపక్ష ఆలోచనాపరుల బానిసలని ఎత్తి చూపారు.
నేడు దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నాగరికత సంబంధమైన యుద్ధం అని తెలియజేస్తూ పాశ్చాత్య దేశాలు తమ సంస్కృతిని మనపై ఎలా రుద్దుతున్నాయో అర్థం చేసుకోవాలి అరవిందరావు అప్రమత్తం చేశారు. దేశాన్ని ఒక వర్గానికి అప్పగించేసి అగచాట్లు పడుతున్న యుకె, జర్మనీల్లోని మేధావులు.. వలసలతో కుదేలవుతున్న ఐరోపా దుస్థితిపై ఇప్పుడు మేలుకుంటున్నారని తెలియజేస్తూ, మన దేశపు మేధావులు దీనిని గుర్తించాల్సి ఉందన్నారు.
అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చాక భారతదేశానికి మేలే జరిగింటూ.. సోషల్ మీడియా వల్ల చాలా చరిత్ర వెలుగులోకి వచ్చిందన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న విచ్ఛిన్నకర పరిస్థితులు, నాగరిక-సాంస్కృతిక పతనంపై రాజీవ్ మల్హోత్రా, ఐరోపా వలసలపై డాగ్లస్ ముర్రే వంటివారు రాసిన రచనలను చదవాలన్నారు. విశృంఖలంగా కొనసాగుతున్న అబద్ధపు ప్రచారాన్ని ఎదుర్కోవాలంటే.. లోతైన మేధో అధ్యయనం జరగడం అవసరమని, దానిని మనమంతా అలవర్చుకోవాలని అరవిందరావు కోరారు.
మాజీ ఐఏఏస్ జయప్రకాష్ నారాయణ్ స్పందిస్తూ ..దేశ ఐక్యత, శాంతి, స్వేచ్ఛ మధ్య సమతుల్యత ఉండాలన్నారు. దేశంలో ఐక్యత లేకుండా శాంతి రాదని, ఈ రెండూ లేని స్వేచ్ఛ వ్యర్థమని అన్నారు. అదే సమయంలో ప్రజాస్వామ్య చట్రంలో నిరుద్యోగం, పేదరికం, అవకాశాల కొరతను పరిష్కరించాలని చెప్పారు. సమానత్వం, సంపద పంపిణీ కంటే వ్యక్తులకు గౌరవం, అవకాశాలు చాలా ముఖ్యమైనవంటూ సోషలిజం ఒక ఆలోచనగా మంచిదే కానీ, పరిష్కార మార్గాలతోనే సమస్య ఉందన్నారు.
మాజీ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులు ప్రసంగిస్తూ.. ఎస్ఆర్ శంకరన్ శిష్యుడినైన తాను అసిపాబాద్, ఉట్నూరు, వైజాగ్-పాడేరు ప్రాంతాలలో పనిచేసినప్పుడు నక్సలైట్ల విధానాలను అతి దగ్గర నుంచి గమనించి అర్థం చేసుకున్నానన్నారు. కేవలం ప్రజలను జాగృతం చేస్తున్నారన్న కారణంతోనే ప్రజానేతలను నక్సలైట్లు కాల్చి చంపిన సందర్భాలున్నాయంటూ.. 1989లో హత్యకు గురైన ఎమ్మెల్యే వెంకట్రావు, వారి చేతిలోనే ప్రాణాలు పోయిన నాటి మంథని ఎమ్మెల్యే శ్రీపాదరావులను గుర్తు చేశారు.
ఒక సందర్భంలో నక్సలైట్ల చేతిలో అపహరణకు గురైన తనను వారి నుంచి గిరిజనులే రక్షించారని తెలిపారు. భూమి కోసం, భుక్తి కోసం గిరిజనులు చేస్తున్న పోరాటానికి నేటికీ పరిష్కారం దొరకని పరిస్థితులున్నాయన్నారు. గిరిజన సమాజంలో దోపిడీ తీవ్రంగా జరుగుతోందని, ఈ విద్యార్థుల కోసం కళాశాలల్లో శిక్షణనిచ్చి మన భావజాలాన్ని అందించాల్సిన అవసరముందన్నారు. ఈ సందర్భంగా వనవాసీ కళ్యాణ ఆశ్రమం వల్ల గిరిజన సమాజానికి ఎంతో మేలు జరిగిందన్నారు.
నెహ్రూ యువకేంద్ర మాజీ ఉపాధ్యక్షులు పేరాల శేఖర్ రావు ప్రసంగిస్తూ.. నక్సలిజం ముసుగులో అనేకమంది నక్సలైట్లు బలవంతపు వసూళ్లకు పాల్పడి, అపారమైన సంపదను కూడ పెట్టుకున్నారని ఆరోపించారు. మావోయిస్టులు సమాజంలో విభజన ఆలోచనలు రేకెత్తిస్తున్నారని, జాతి స్వయం నిర్ణయాధికారం అనేటువంటి ఒక విధ్వంసకరమైన భావనను వాళ్లు దేశంలో సృష్టిస్తున్నారని విమర్శించారు. వాళ్లు భారతదేశాన్ని ఒక జాతిగా అంగీకరించరంటూ, వీరి భావన దేశభద్రతకు, ఐక్యతకు ముప్పుగా పరిగణిస్తుందని హెచ్చరించారు.
చైనా ద్వారా నక్సలైట్లకు బర్మాలో ఇచ్చిన ఆయుధ శిక్షణను గుర్తు చేస్తూ… ఏపీకి సంబంధించిన ఫొటోలు కూడా ఉన్న రాజీవ్ భట్టాచార్య రచన Lens and the guerrillaని ప్రస్తావిస్తూ… శ్రీకాకుళం రైతాంగ పోరాటాల పేరిట ప్రవేశించిన నక్సలైట్ ఉద్యమం గురించి తెలియజేశారు. 1967 నుంచి హింసావాదంతోనే నడుస్తున్న నక్సలైట్ ఉద్యమం ఇంకేం సాధిస్తుందో కోదండరాం, హరగోపాల్ వంటి నేతలు మాట్లాడాలన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలోని నక్సల్ నాయకులలోనే కుల చిచ్చు, విరసంని నాలుగు ముక్కలు చేసిన కుల వైషమ్యం గురించి శేఖర్ ఎత్తి చూపారు.
నక్సల్ ఉద్యమంలో సైతం అంతర్గతంగా తీవ్రస్థాయిలో కుల విద్వేషాలు పొడసూపిన ఘటనలను ప్రస్తావించారు. ఆయుధ పోరాటంతో సుపరిపాలన వస్తుందా? అని ప్రశ్నిస్తూ.. నేపాల్ మావోయిస్టులు సైతం ప్రజాస్వామ్య పంథాలోకి వచ్చారని, మన దేశంలోనే మిజోరాంలో లాల్ డెంగా కూడా మిజో నేషనల్ ప్రంట్ ద్వారా ప్రజా ప్రభుత్వ బాట పట్టారన్నారు. జాతుల పోరాటం వర్ధిలాలంటూ నెల్లూరులో 1987 నాటి సభను శేఖర్ రావు గుర్తు చేస్తూ వైషమ్యాల ద్వారా సమసమాజాన్ని నెలకొల్పగలమా అని నిలదీశారు.
ఆ రోజుల్లోనే నక్సలైట్లు AOB (Andhra Orissa Boarder) నుంచి రూ.200 కోట్ల దాకా గంజాయి పెంపకం దార్ల నుంచి వసూలు చేసిన సందర్భాలున్నాయన్నారు. మన దేశాన్ని అస్థిరపరిచేందుకు ఐఎస్ఐ, చైనా పన్నుతున్న కుట్రల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ పరిణామాలను ప్రస్తావిస్తూ.. అక్కడ చరిత్ర తెలియని యువతరం వల్ల పెను విధ్వంసం జరిగిందని, ఆ దేశాన్ని సృష్టించిన వ్యక్తి విగ్రహాన్నే కూలగొట్టే పరిస్థితి ఏర్పడిందన్నారు. బంగ్లాదేశ్‌కి నాడు ఎంతో సహకరించిన భారత్ పాత్రను, పాకిస్తాన్ చేసిన ద్రోహంతో పాటు ఆ దేశపు (బంగ్లాదేశ్) చరిత్రనే చెరిపేసే దుస్థితిని శేఖర్ రావు గుర్తు చేశారు.
ఈ సెమినార్ ముఖ్య ఉద్దేశ్యం సమాజంలోని మనుషుల మేధస్సును ప్రేరేపించడమేనని, ఆయుధం ఏ సమస్యకూ పరిష్కారం కాదని, ఆలోచన మాత్రమే పరిష్కారం అని MMRI అధ్యక్షులు మురళీమనోహర్ అన్నారు. హింస, దోపిడీ రెండింటినీ అంతం చేయాలని ఆయన ఆకాంక్షించారు.
అంతర్గత భద్రత గురించి లోతైన అవగాహన కోసం మరిన్ని పరిశోధనలు జరగాలని MMRI ఆశిస్తోందని, రాజ్ నహీ, సమాజ్ బదల్‌నా అనే దృష్టికోణంతో అన్నిటికీ ప్రభుత్వమే చూసుకుంటుందన్న ఆలోచన మాని ప్రభుత్వం చేసే ప్రయత్నాలకు సమాజం తోడ్పాటును అందించినట్లయితే సమస్య ఇంకా త్వరగా పరిష్కారమవుతుందని ఆయన అన్నారు.