– రైతు సమస్యలు పక్కనపెట్టి.. అసెంబ్లీలో బురద రాజకీయాలకు ప్రాధాన్యం
– ఆధార్ కార్డు, పాస్ బుక్కులు చేత పట్టుకొని యూరియా బస్తా కోసం పడిగాపులు కాస్తున్నరు
– ఇది కాంగ్రెస్ తెచ్చిన సంక్షోభం.. రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల రైతన్నకు వచ్చిన సంక్షోభం
– జై కిసాన్ అని నాటి కాంగ్రెస్ అంటే, నై కిసాన్ అని నేటి నేటి రేవంతు అంటున్నడు
– మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్
హైదరాబాద్: అసెంబ్లీలో యూరియా కొరత, వదరల మీద చర్చ చేయాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తే, మాకు యూరియా, వరదల కంటే బురద రాజకీయాలే ముఖ్యమన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలి, కక్ష సాధింపు చర్యలే లక్ష్యంగా ఆదరాబాదరాగా ఆదివారం సభను నిర్వహించి, అర్థంతరంగా, అసంపూర్తిగా ముగించారు.
ఈ ప్రభుత్వానికి రైతుల కష్టాలపై చర్చించే సమయం లేదు, సామర్థ్యం లేదు.
ఇలాంటి దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరు తెలంగాణ రైతాంగానికి పెనుశాపంగా మారింది. భారత దేశ చరిత్రలో యూరియా కోసం రైతులు ఇంతగా తిప్పలు పడ్డ పరిస్థితులు ముందెన్నడూ లేదు.
కాంగ్రెస్ చేతగాని, దద్దమ్మ పాలన వల్ల పంట పొలాల్లో ఉండాల్సిన రైతులు యూరియా కోసం నడిరోడ్ల వెంట బారులు తీరుతున్నరు. ఆధార్ కార్డు, పాస్ బుక్కులు చేత పట్టుకొని యూరియా బస్తా కోసం పడిగాపులు కాస్తున్నారు. పండుగ లేదు..పబ్బం లేదు..వాన లేదు..ఎండ లేదు…రాత్రి లేదు…పగలు లేదు క్యూలో నిలబడుతున్నరు. అలసి సొలసి పడిపోతున్నారు.
ఓపిక లేక క్యూలో చెప్పులు, పాస్‌బుక్కులు, అట్ట డబ్బాలు, ఖాళీ సీసాలు, రాళ్లు పెట్టి రోజుల పాటు నిరీక్షిస్తున్నారు. ‘పత్తి పూత దశతో ఉంది.. ఇప్పుడు యూరియా వేయకపోతే దిగుబడి రాదు’ అని ఒక రైతు.‘వరి పొట్ట దశలో ఉంది.. యూరియా చల్లకపోతే పంట వేసి వ్యర్థం’ అని మరొక రైతు పడుతున్న ఆవేదన చూస్తే గుండె తరుక్కుపోతున్నది.
రాష్ట్రంలో నెలకొన్న యూరియా సంక్షోభానికి నిన్న సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లో కట్టలు తెంచుకున్న రైతుల ఆగ్రహమే నిదర్శనం. ప్రభుత్వ యంత్రాంగం మీద అసహనంతో జుట్లు పట్టుకొని కొట్టుకోవాల్సి రావడమే కాంగ్రెస్ వైఫల్యానికి నిదర్శనం. ఎక్కడిక్కడ హైవేలెక్కి ధర్నాలు చేస్తున్న రైతన్నల ఆగ్రహ జ్వాలలే నిదర్శనం.
ఇది కాంగ్రెస్ తెచ్చిన సంక్షోభం.. రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల రైతన్నకు వచ్చిన సంక్షోభం. యూరియా అడిగిన పాపానికి రైతుల చెంపలు చెల్లుమనిపించిన సోకాల్డ్ ప్రజా పాలన ఇది. 22 నెలల పాలనలో యావత్ తెలంగాణ రైతాంగాన్ని నడి రోడ్డు మీదకు ఈడ్చిన దుర్మార్గ పాలన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిది, రేవంత్ రెడ్డిది.
పాలకులు మారగానే పాలసీలు మారిపోతాయా? రైతుల కష్టాలు తీర్చని ప్రభుత్వం ఏండి ఏం లాభం. కేంద్రం నుంచి యూరియా తెప్పించడంలో, సరఫరాలో ఈ ప్రభుత్వానికి ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకపోవడం శోచనీయం. దేశానికి అన్నం పెట్టే రైతన్నను కన్నీళ్లు పెట్టిస్తున్నరు. అరిగోస పెడుతున్నరు. జై కిసాన్ అని నాటి కాంగ్రెస్ అంటే, నై కిసాన్ అని నేటి నేటి రేవంతు అంటున్నారు.
8 మంది బిజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండి తెలంగాణకు చేస్తున్నది ఏమున్నది. ఏమీ లేదు. శుష్క ప్రియాలు శూన్య హస్తాలు. పామాయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపును ఉపసంహరించుకోవాలని, పత్తిపై ఎత్తివేసిన దిగుమతి సుంకాన్ని యదావిధిగా కొనసాగించాలని.. ఈ మేరకు ఎంపీలు కేంద్రం పై ఒత్తిడి చేయాలని డిమాండ్ చేస్తున్నాం.